
కంటినిండా నిద్రపోయే పిల్లలు యుక్తవయసులో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. నాజూకుగానూ ఉంటారని అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. దాదాపు 20 నగరాల్లోని 2200 మంది పిల్లలపై తాము ఒక అధ్యయనం జరిపామని.. వేళకు నిద్రపోవడం.. నిద్ర తగినంత ఉండటం వారికి ఏళ్ల తరువాత కూడా మేలు చేస్తుందని ఇందులో తెలిసిందని పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త బక్స్‌టన్ అంటున్నారు. ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయస్కులపై జరిగిన ఈ అధ్యయనంలో తాము వారి బాడీ మాస్ ఇండెక్స్‌ను (బీఎంఐ) పరిశీలించామని.. అవసరమైన సమయం కంటే తక్కువ నిద్రపోయే వారి బీఎంఐ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
నిద్రలేమి అటు శారీరక, ఇటు మానసిక ఆరోగ్యం రెండింటిపై దుష్ప్రభావం చూపుతుందనేందుకు ఈ అధ్యయనం తాజా తార్కాణమని బక్స్‌టన్ అన్నారు. రాత్రివేళల్లో టీవీలకు అతుక్కుపోతున్న తల్లిదండ్రులు కనీసం పిల్లలను సరైన సమయంలో నిద్రపోయేలా చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని వివరించారు. పరిశోధన వివరాలు స్లీప్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైంది.