
ఇప్పుడు మనం ‘వ్యాసం’గా భావిస్తున్నది సాధారణంగా రాజకీయ వ్యాసమే. కానీ ఈ అర్థంలోకి స్థిరపడకముందు వ్యాసం ఒక సాహిత్య ప్రక్రియ. 19వ శతాబ్దపు గొప్ప ఎస్సేయిస్టు చాల్స్ లాంబ్ (1775–1834). ఇంగ్లండ్‌లో జన్మించాడు. ఒంటరి పిల్లాడు. పదకొండేళ్లు పెద్దదైన అక్క, రచయిత్రి మేరీ లాంబ్ దగ్గర తొలుత చదువుకున్నాడు.
చాలాకాలం ఈస్ట్ ఇండియా హౌజ్‌లో గుమస్తాగా పనిచేశాడు. మేరీతో కలిసి టేల్స్ ఫ్రమ్ షేక్‌స్పియర్ రాశాడు. 1820లో ఏలియా అనే కలంపేరుతో ఒక లండన్ మేగజైన్‌కు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిల్లో జ్ఞాపకాల వెచ్చదనం, మేధో చమత్కారం, అంతరంగ కలబోత, కలగలిసి ఉంటాయి. ‘ఎస్సేస్ ఆఫ్ ఏలియా’ పేరుతో రెండు భాగాలుగా ఈ పుస్తకాలు వచ్చాయి. చాల్స్ కవి కూడా. అలాగే ఆయన ఉత్తరాలు కూడా సంకలనాలుగా వచ్చాయి. లాంబులు వర్ధిల్లాలనే ఆశయంతో ఇంగ్లండ్‌లో నెలకొల్పిన క్లబ్ ఒకటి 140 ఏళ్లుగా కొనసాగుతోంది.