మానవత్వాన్ని,  ప్రేమను ఎవరైనా  తృణీకరించగలరా?

Can anyone deny humanity love? - Sakshi

చెట్టు నీడ

భగవంతుడే ఈ నిరుపేద రూపంలో వచ్చినట్లు స్వామీజీ భావించారు. అతడి వంక చూస్తూ ఆయన,  ‘‘తినడానికి ఏమైనా ఇవ్వగలవా?’’ అని అడిగారు.

అది రాజస్థాన్‌లోని రైలు నిలయం. స్వామి వివేకానంద అక్కడ బస చేసి ఉన్నారు. పగలంతా జనం తీర్థప్రజలా ఆయన దర్శనార్థం వచ్చిపోతూనే ఉన్నారు. మతం, ధార్మికత వంటి అంశాలపై అడిగిన సందేహాలన్నింటికీ అనర్గళంగా సమాధానాలు చెబుతూనే ఉన్నారు. ఈ విధంగా మూడు పగళ్లు, మూడు రాత్రుళ్లు గడిచాయి. ధార్మిక ప్రబోధంలో స్వామీజీ ఎంతగా లీనమైపోయారంటే, ఆహారం స్వీకరించడానికి కూడా ఆయన ప్రబోధాన్ని ఆపింది లేదు. ఆయన చుట్టూ గుమికూడిన జనాలకు తినడానికి ఏమైనా ఆహారం ఉందా అని ఆయనను అడగాలని కూడా స్ఫురించలేదు. మూడవరోజు రాత్రి సందర్శకులందరూ వెళ్లిపోయాక ఒక నిరుపేద వ్యక్తి ఆయనను సమీపించి అభిమానపర్వకంగా ‘‘స్వామీజీ! ఈ మూడురోజుల నుంచీ మీరు నిర్విరామంగా మాట్లాడుతూనే ఉన్నారు. గుక్కెడు నీళ్లు కూడా తాగింది లేదు. అది చూసి నేను ఎంతో బాధపడుతున్నాను’’ అన్నాడు అభిమాన పూర్వకంగా. 

భగవంతుడే ఈ నిరుపేద రూపంలో వచ్చినట్లు స్వామీజీ భావించారు. అతడి వంక చూస్తూ ఆయన, ‘‘తినడానికి ఏమైనా ఇవ్వగలవా?’’ అని అడిగారు. అతడు ‘‘స్వామీజీ, మీకు చపాతీలు ఇవ్వాలని నా హృదయం పరితపిస్తోంది. కాని ఎలా ఇవ్వగలను? నేను వాటిని తాకాను. మీరు అనుమతి ఇస్తే పిండి, పప్పు తెచ్చిపెడతాను. మీరు స్వయంగా వండుకోవచ్చు’’ అని చెప్పాడు.  అందుకు స్వామీజీ, ‘‘లేదు నాయనా, నువ్వు వండిన చపాతీలనే తెచ్చి నాకు ఇవ్వు. సంతోషంగా వాటిని తింటాను’’ అన్నారు. ఆ మాట విని అతడు భయంతో వణికిపోయాడు. చర్మకారుడైన తాను ఒక సన్న్యాసికి చపాతీలు ఇచ్చాననే సంగతి మహారాజు చెవిన పడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని భీతి చెందాడు. కాని స్వామీజీ ఆకలి తీర్చాలనే తపన అతడి భయాన్ని దిగమింగింది. వెంటనే ఇంటికి వెళ్లి తాజాగా చపాతీలు వండి తెచ్చి స్వామీజీకి ఇచ్చాడు. నిరుపేదవాడి నిస్వార్థ ప్రేమాభిమానాలను చూసి స్వామీజీ కళ్లు చెమ్మగిల్లాయి. 
– డి.వి.ఆర్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top