ఐరనే ఆభరణం

 This Campaign Urges Women To Invest In Something Other Than Gold This Diwali - Sakshi

ధన్‌తేరస్‌ ప్రాజెక్ట్‌!

మన దేశంలో స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుము! స్త్రీ ధనం కింద బంగారాన్ని కాదు ఐరన్‌ను అందించాలి. కాబట్టి ఈ ధన్‌తేరస్‌కి.. అంటే ధనత్రయోదశికి బంగారు నగల మీద కాక ఒంట్లోని ఐరన్‌ మీద దృష్టిపెట్టండి అంటూ ‘ప్రాజెక్ట్‌ స్త్రీధన్‌’ పేరుతో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి పనిచేసే డీఎస్‌ఎమ్‌ అనే సంస్థ ఓ ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా ధన్‌తేరస్‌కు బంగారు ఆభరణాల దుకాణాలు విడుదల చేసే కమర్షియల్స్‌కు భిన్నంగా ఆ సంస్థ తన యాడ్స్‌ను తయారు చేసింది.

ఐరన్‌ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాన్ని తింటున్న మహిళను చూపిస్తూ ‘ఈ ధన్‌తేరస్‌కు ఈ మహిళ బంగారం కన్నా ఎంతో విలువైన దాన్ని పొందుతోంది’ అనే క్యాప్షన్‌తో ఒక యాడ్‌ను తయారు చేసింది. అలాగే.. చెవికి జూకాలు, మెడలో నగలు, చేతులకు గాజులు, నడుముకు వడ్డాణం, కాళ్లకు పట్టీలు పెట్టుకొని నడుస్తున్న యువతిని చూపిస్తూ.. ఇదే ఐరన్‌ అయితే మీ నరనరాల్లో ప్రవహిస్తుంది ఆరోగ్యంతో మిమ్మల్ని మెరిపిస్తుంది. అంటూ ఇంకో యాడ్‌ను రూపొందించింది. ‘ఐరన్‌ తీసుకోండి’ అంటూ ఇంకొన్ని యాడ్స్‌ను తయారు చేసి గ్రామీణ, పట్టణ వాసులను చైతన్యపరుస్తోంది.

ఈ ప్రచారంలో డీఎస్‌ఎమ్‌ తన లాభాపేక్షను చూసుకుంటోందా  వగైరా అనుమానాలను పక్కన పెడదాం. మన దేశంలో మహిళలకు ఐరన్‌ కావాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం. 2018 జనవరిలో నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ –4) విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో దాదాపు యాభై మూడు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడ్తున్నారు. కాబట్టి ఈ ధన్‌తేరస్‌నే ఆరోగ్య సంరక్షణకు శుభారంభంగా భావించి ప్రతిరోజు ఆహారంలో విధిగా ఐరన్‌ ఉండేలా చూసుకోండి. స్త్రీ ఆరోగ్యమే దేశానికి మహాభాగ్యం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top