ఉండేందుకు ఇల్లు లేని మండలి సభ్యురాలు! | To be a member of a houseless house to stay | Sakshi
Sakshi News home page

ఉండేందుకు ఇల్లు లేని మండలి సభ్యురాలు!

Apr 11 2018 12:13 AM | Updated on Apr 11 2018 12:13 AM

To be a member of a houseless house to stay - Sakshi

రసాయన ఎరువుల వల్ల వరి పంటకొచ్చే ముప్పుపై గ్రామస్తులను దశాబ్దాల క్రితమే చైతన్యం చేసిన కమలా పూజారి నేడు, గ్రామాల్లో మంచి నీటి సరఫరాకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించారు. ఇప్పుడిక రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలు కూడా అయ్యారు కాబట్టి ఆమె లక్ష్యసాధనకు ఉన్న అవాంతరాలు తొలగిపోవచ్చు.  అయితే ఆమె సొంత గూటి సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది!

కమలా పూజారి వయసు 67 ఏళ్లు. గిరిజన మహిళా రైతు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా పత్రాపుట్‌ గ్రామం ఆమె స్వస్థలం. భుమియ గిరిజన తెగలో పుట్టిన కమలకు దేశీ వరి వంగడాలన్నా, సేంద్రియ వ్యవసాయమన్నా పంచప్రాణాలు. ఆమె పేరు ఇప్పుడు రాష్ట్రమంతా మారుమోగిపోతోంది. అందుకో బలమైన కారణమే ఉంది మరి. ఒడిశా రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలిగా ఇటీవల కమల నియమితులయ్యారు. ఒక గిరిజన మహిళను రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలిగా తొలిసారిగా నియమించిన ఘనత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు దక్కింది.

నాడు వరికొచ్చే ముప్పుపై
కమల నియామక ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరచినప్పటికీ.. ఈ పదవి ఆమెకు అంత అయాచితంగా ఏమీ రాలేదు. సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యానికి.. ముఖ్యంగా అపురూపమైన దేశీ వరి వంగడాలకు ఒడిశాలోని జేపూర్‌ పెట్టింది పేరు. జేపూర్‌ బ్లాక్‌లోనే ఉంది కమల స్వగ్రామం పత్రాపుట్‌. వేలాది ఏళ్లుగా తమవై విరాజిల్లుతున్న వందలాది దేశీ వరి వంగడాలు అంతరించిపోతుండటం ఆమెను కలవరపరచింది. రసాయనిక వ్యవసాయం పుణ్యమా అని అందుబాటులోకి వచ్చిన కొత్త వంగడాల వల్ల దేశీ వంగడాలు కాలగర్భంలో కలసిపోతుండటం ఆమెకు సుతరామూ నచ్చలేదు. దేశీ వరి వంగడాలు అతివృష్టిని, కరువు కాటకాలను తట్టుకొని నిలబడి.. ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అంత విలువైన వంగడాల పరిరక్షణ సజావుగా సాగాలంటే సేంద్రియ వ్యవసాయం వ్యాప్తిలోకి తేవాలని కమలా పూజారి దశాబ్దాల క్రితమే గ్రహించారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ నేర్పిన మెలకువలు ఆమె తన లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు తోడ్పడ్డాయి. 

నేడు తాగునీటి సరఫరాపై
లక్ష్య సాధనకు రైతుగా తాను పాటుపడటంతోపాటు తమ గ్రామంలో గడపగడపకు, ఆ ప్రాంతంలోని గ్రామ గ్రామానికీ వెళ్లి ఇదే విషయాన్ని కమల ప్రచారం చేశారు. అవాంతరాలు ఎదురైనా దీక్షతో కదిలింది. ఫలితంగా పత్రాపుట్, ఆ పరిసర గ్రామాల్లో రైతులు రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిలిపివేశారు.  ఆమె కృషికి గుర్తింపుగా 2004లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో సత్కరించింది. జోహన్నెస్‌బెర్గ్‌(దక్షిణాఫ్రికా)లో 2002లో జరిగిన అంతర్జాతీయ సమావేశాలకు కూడా ఆమెహాజరయ్యారు. ఇక ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం మహిళా హాస్టల్‌ భవనానికి కమల పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని చాటుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 

ఈ నేపథ్యంలో కమలను ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం తొలి మహిళా సభ్యురాలిగా నియమించడం విశేషం. దీని గురించి టీవీ ద్వారా తెలిసీ తెలియగానే కమల ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘గ్రామాల్లో తాగునీటి సరఫరాపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ఆమె తన ఇద్దరు కుమారులతో కలసి మట్టి గోడల పూరింటిలో నివసిస్తున్నారు.  ‘నాకు ఈ పదవి కన్నా ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువ సంతోషించేదాన్ని’ అని కమల అన్నారని ఆమె మనుమడు విలేకరులతో చెప్పాడు! నిజానికి ఆమె 2016లో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మంజూరు కాలేదు. ఆమె రెండో కుమారుడికి గత ఏడాది ఇల్లు మంజూరైనా, అదింకా నిర్మాణంలోనే ఉంది.
– పంతంగి రాంబాబు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement