ఒక్కసారైనా ఇండియాను చూడాల్సిందే | at least once in India should be visit | Sakshi
Sakshi News home page

ఒక్కసారైనా ఇండియాను చూడాల్సిందే

Sep 16 2014 10:49 PM | Updated on Sep 2 2017 1:28 PM

ఒక్కసారైనా ఇండియాను చూడాల్సిందే

ఒక్కసారైనా ఇండియాను చూడాల్సిందే

భారతదేశ పర్యటనకు వచ్చిన విదేశీయులలో చాలామంది యాత్రాకథనాలు రాశారు. అయితే ఒక చైనా వనిత భారతదేశంపై తాజాగా రాసిన పుస్తకం ‘ది ఫర్‌దర్ ఐ వాక్...

భారతదేశ పర్యటనకు వచ్చిన విదేశీయులలో చాలామంది యాత్రాకథనాలు రాశారు. అయితే ఒక చైనా వనిత భారతదేశంపై తాజాగా రాసిన పుస్తకం ‘ది ఫర్‌దర్  ఐ వాక్, ద క్లోజర్ ఐ గెట్ టు మీ’ (ముందుకు నడిచేకొద్దీ, వెనక్కి నేను నాలోకి) ప్రస్తుతం చైనాలో అత్యంత ఆదరణ పొందుతోంది. ఆ మహిళా యాత్రికురాలి పేరు హాంగ్ మి. వయసు 34.
 
హాంగ్ మి 2009లో తన అమెరికన్ భర్త టామ్ కార్టర్‌తో కలిసి దాదాపుగా భారతదేశం మొత్తం పర్యటించారు. భిన్న రకాల సంస్కృతులను దగ్గరగా వీక్షించారు. అప్పటి అనుభవాలన్నిటినీ క్రోడీకరించి చైనా భాషలో ఈ యాత్రాకథనాన్ని రచించారు. ఇండియాపై చైనాలో ఇంటివంటి దేశవాళీ పుస్తకం రావడం ఇదే ప్రధమం అట. హాంగ్ మి మాటల్లో చెప్పాలంటే ఇదొక స్వీయ రూపాంతరీకరణ యాత్రారచన. అప్పట్లో హాంగ్, ఆమె భర్త ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు, మారుమూల గ్రామాలలో కూడా పర్యటించారు. ఈ రెండు వైరుధ్యాల నడుమ భారతీయ సంస్కృతిలో ఆమె ఒక ఏకసూత్రతను సాధించారు. అదే... భిన్నత్వంలో ఏకత్వం.
 
భారతదేశ సందర్శనలో భాగంగా హాంగ్ మి కుంభమేళా, ఒంటెల మేళా, హోలీ వంటి పండుగలలో పాలుపంచుకున్నారు. అలాగే ఆనాటి ఎన్నికల ప్రచార సరళిని దగ్గరగా గమనించారు. వీటన్నిటి విశేషాలను అందంగా తన పుస్తకంలో పొందు పరిచారు. ఈ ప్రయత్నం వెనుక తన భర్త టామ్ ప్రోత్సాహం కూడా ఉందంటారు హాంగ్. టామ్‌కు కూడా కొంత రచనానుభవం ఉంది. అంతకు ముందే ఆయన చైనాలోని 33 ప్రావిన్సుల సంస్కృతీ సంప్రదాయాలను ఛాయా చిత్రాల రూపంలో ఒక పుస్తకంగా తెచ్చారు.
 హాంగ్ దంపతుల భారతదేశ పర్యటన బడ్జెట్ రోజుకు 20 అమెరికన్ డాలర్లు అయ్యిందట. ప్రధానంగా వీరు ఉత్తర, దక్షిణ,పశ్చిమ ప్రాంతాలను సందర్శించారు.
 
ఇక్కడ టామ్ గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పకోడానికి ఆయన భార్య హాంగ్ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ‘దిల్ బోలే హడి ప్ప’ చిత్రంలోని ఒక క్రికెట్ సన్నివేశానికి గాను పదవ బ్యాట్స్ మన్‌గా టామ్ ఎంపికయ్యారట. ఇక ప్రధానంగా చెప్పుకోవలసిన మరో విషయం ఏమిటంటే ఈ దంపతులు ఒడిషాలో ఉన్నప్పుడు అనుకోకుండా కొందరు మావోయిస్టులను కలిసి, వారిని ఇంటర్వ్యూ చెయ్యడం. అయితే ఈ వివరాలు పుస్తకంలో సంక్షిప్తంగా మాత్రమే ఉన్నాయి. ‘‘అన్నిటినీ కూర్చడం పెద్ద సమస్యే అయింది.
 
అందుకే కొన్నిటికి అప్రమేయంగా ప్రాధాన్యం తగ్గింది’’ అంటారు హాంగ్ మి. ఇక ఈ పర్యటనలో హాంగ్‌కి సంతృప్తిని కలిగించినవి సాంస్కృతిక వేడుకలు కాగా, ఇబ్బంది పెట్టినది మాత్రం మన ఆహారపు అలవాట్లలో ఆమె ఇమడలేక పోవడం. మొత్తానికి భారతదేశ పర్యటన కొత్తలోకాలకు ద్వారాలు తెరిచిందని, ప్రపంచ సందర్శకులు, పర్యాటకులు తమ జీవితంలో ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందేనని హాంగ్ మి తన పుస్తకం ముందు మాటలో రాసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement