
లూయిజీ పిరాండెల్లో (1867–1936) ఇటాలియన్ నాటకకర్త, కవి, కథకుడు, నవలారచయిత. సిసిలీ ద్వీపంలోని సంపన్నుల ఇంట్లో, రాజకీయంగా చైతన్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో కథలు, గాథలు వినడానికి అమిత ఆసక్తి చూపేవాడు. పన్నెండేళ్ల వయసుకే తొలి విషాదాంత నాటకం రాశాడు. తన నివాసస్థలం రోమ్‌కు మారాక, తీవ్రమైన నిరాశలో ప్రతీకారస్వరంతో పుట్టే నవ్వులాంటి భావనలో తన తొలి కవితలు రాశాడు. నాటకరంగాన్ని జయించి తీరుతానని అనుకున్న పిరాండెల్లో, అబ్సర్డ్(అసంబద్ధ) నాటకాలకు సంబంధించి ప్రథమ శ్రేణి నాటక రచయితల్లో ఒకరిగా నిలిచాడు. ప్రకృతి విపత్తులో ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నా కూడా, తనను తాను కూడగట్టుకుని, విపత్తు కారణంగా తిరిగి ఎన్నటికీ కోలుకోలేని విధంగా మెంటల్ షాక్‌కు గురై మంచం పట్టిన భార్యను చూసుకుంటూ, భాషా పాఠాలు బోధించుకుంటూ రచనావ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇటాలియన్‌తో పాటు, తన స్వస్థలం సిసిలీ ద్వీపంలో మాట్లాడే సిసిలియన్ భాషలో కూడా రాశాడు. 1934లో నోబెల్ పురస్కారం ఆయన్ని వరించింది. ‘వన్, నో వన్ అండ్ వన్ హండ్రెడ్ థౌజండ్’, ‘సిక్స్ క్యారెక్టర్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ యాన్ ఆథర్’, ‘ద రూల్స్ ఆఫ్ ద గేమ్’, ‘ద మాన్ విత్ ద ఫ్లవర్ ఇన్ హిజ్ మౌత్’ ఆయన రచనల్లో కొన్ని. ‘నేషనల్ ఫాసిస్ట్ పార్టీ’ స్థాపకుడు ముస్సోలిని మీది అభిమానంతో ‘నేను ఫాసిస్టును, ఎందుకంటే నేను ఇటాలియన్‌ను’ అని చెప్పుకున్న పిరాండెల్లో, ఫాసిస్టు నాయకులతో విభేదించి, తనను తాను తర్వాత అరాజకీయవాదిగా ప్రకటించుకున్నాడు.