
తెలుగులో తొలి వాగ్గేయకారుడు, పదకవితా పితామహ బిరుదాంకితుడు, దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు అన్నమయ్య. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలం నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవుల నమ్మకం. ‘చందమామ రావే జాబిల్లి రావే’ ‘జో అచ్యుతానంద జో జో ముకుందా’ అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్ర పోతారు.
భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనంటూ ఆయన రచించిన తందనానా పురే తందనానా అనే కీర్తన ఎప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంటుంది. అన్నమయ్య జయంతినాడు ఆయన రచించిన కొన్ని కీర్తనలనైనా మనసారా పాడుకోవడం, ఆయనను స్మరించుకోవడం శ్రేయోదాయకం.
(వైశాఖ శుద్ధ పౌర్ణమి అన్నమయ్య జయంతి)