
వారి ఓట్లతో ఎన్నికల్లో నెగ్గడానికి కుట్రలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం
న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా ఆ పార్టీ యాత్రలు చేస్తోందని మండిపడ్డారు. చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 ప్రజా సంక్షేమ పథకాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. దేశ పౌరులపై కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీకి ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. అందుకే చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నారని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాల్లో చొరబాటుదారులు ఎప్పటికీ ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. మనదేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓట్లు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో నెగ్గడానికి అక్రమ వలసదారులకు అండగా నిలుస్తారా? ఇదెక్కడి చోద్యం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మోదీ విజయాలను ప్రజలు మర్చిపోలేరు
దేశంలో ఓటర్ల జాబితాల ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు అమిత్ షా స్పష్టంచేశారు. బిహార్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రపై విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగిస్తే తప్పేమిటని అన్నారు. దేశ సరిహద్దులను మోదీ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు.
మన సరిహద్దులను అతిక్రమించాలని చూసిన శత్రువులపై సర్జికల్, వైమానిక దాడులు చేసినట్లు గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం నేర్పామని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో 2027 నాటికి మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్వవస్థగా మారడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్నో విజయాలు సాధించిందని, దేశ ప్రజలు వాటిని ఎప్పటికీ మర్చిపోలేరని వెల్లడించారు. మోదీ పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించిందని గుర్తుచేశారు.