
రెప్పపాటు కాలంలోనే ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం
ఇది నవభారతం.. అణ్వాయుధాలతో మనల్ని భయపెట్టలేరు
ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ మట్టుబెట్టగలం
ప్రధానమంత్రి మోదీ స్పష్టీకరణ
75వ జన్మదినం సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ధార్: అణ్వాయుధాలను బూచిగా చూపించి భారత్‌ను బెదిరిస్తామంటే ఎంతమాత్రం కుదరదని పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. అణ్వ్రస్తాలకు నవ భారతదేశం(న్యూ ఇండియా) భయపడదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్ఘాటించారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కోలుకోలేని నష్టం జరిగిందని తెలిపారు. నష్టం జరిగినట్లు జైషే మొహమ్మద్ కమాండర్ స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పర్యటించారు. పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు శ్రీకారం చుట్టారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే...
మన సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది
‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులు మన అక్కచెల్లెమ్మలు, కుమార్తెల సిందూరం తుడిచేశారు. ముష్కరులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం. వారి స్థావరాలను ధ్వంసం చేశాం. అపూర్వమైన ధైర్య సాహసాలు కలిగిన మన సైనిక దళాలు కేవలం రెప్పపాటు కాలంలో పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిల్చోబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద ముఠా నాయకులకు జరిగిన నష్టాన్ని నిన్ననే ఓ ముష్కరుడు రోదిస్తూ బయటపెట్టడం ప్రపంచమంతా చూసింది. ఇది నవ భారత్. అణు బాంబులతో మనల్ని ఎవరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ వారిని మట్టుబెట్టగలం. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది.
మన మంత్రం స్వదేశీ
ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా. పండుగల సీజన్ రాబోతోంది. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంచుకోవాలి. మీరు కొనేది, విక్రయించేది ఏదైనా సరే అది ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి కావాలి. స్వాతంత్య్రం సాధించడానికి జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీని ఒక ఆయుధంగా ప్రయోగించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు స్వదేశీ ఉత్పత్తుల వాడకమే పునాది అని మర్చిపోవద్దు.
మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులు ఉపయోగిస్తేనే దేశానికి లబ్ధి చేకూరుతుంది. ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ప్రజలు స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. మన ఉత్పత్తుల పట్ల మనం గరి్వంచాలి. అది చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా మన దేశంలో తయారైన వస్తువునే కొనండి. పిల్లల బొమ్మలు, దీపావళి విగ్రహాలు, ఇంట్లో అలంకరణ సామగ్రి, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు మన దగ్గర తయారవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. ఏదైనా కొనుగోలు చేసే ముందు అది ‘మేడ్ ఇన్ ఇండియా’ అవునో కాదో తనిఖీ చేసుకోండి.
స్వదేశీ ఉత్పత్తులు కొంటే మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. అది నేరుగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ సొమ్ముతో రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించవచ్చు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. స్వదేశీ వస్తువుల విక్రయాలు పెరిగితే కంపెనీల్లో వాటి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. తద్వారా మన దగ్గర ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయి. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. స్వదేశీ వస్తువులు కొని ఈ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందండి. విక్రయదారులు తమ దుకాణాల వల్ల ‘స్వదేశీ’ బోర్డులు గర్వంగా ఏర్పాటు చేసుకోండి.
కోటికి చేరిన సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డులు
ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. దీనివల్ల దేశంలో వస్త్ర పరిశ్రమకు నూతన బలం చేకూరుతుంది. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఔషధాలు సైతం ఉచితంగా అందజేస్తారు. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.
అవగాహన, వనరులు లేవన్న కారణంతో మహిళలు నష్టపోవడానికి వీల్లేదు. అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించాం. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా వ్యాధిని అరికట్టడానికి 2023లో నేషనల్ మిషన్‌ను మధ్యప్రదేశ్‌లోనే ప్రారంభించాం. అప్పట్లో మొట్టమొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డు అందజేశాం. ఈరోజు కార్డుల సంఖ్య కోటికి చేరింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా ప్రజలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
పీఎం మిత్రా పార్కు
దేశంలో మొట్టమొదటి ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైట్ రీజియన్, అప్పారెల్(పీఎం మిత్రా)’ పార్కు నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్‌ను, రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం మిత్రా పార్కులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ప్రపంచ స్థాయి టెక్స్‌టైల్ తయారీ కేంద్రాలను స్థాపించబోతున్నారు.
రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం కింద శిశు సంరక్షణ, విద్యతోపాటు స్థానికంగా లభించే పౌష్టికాహారాన్ని ప్రోత్సహిస్తారు. చక్కెర, వంటనూనెల వినియోగం తగ్గించుకోవాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సుమన్ సఖి చాట్‌బాట్‌ను సైతం మోదీ ప్రారంభించారు. తల్లి, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు తగిన సమాచారం అందజేస్తారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి ఒక మొక్కను బహూకరించారు.