నాగ్ నా నగ

నాగ్ నా నగ - Sakshi


అమల ప్రేమకు నిర్వచనం చెప్పలేం.

ఆమె అనుబంధానికి పేరు పెట్టలేం.

అనురాగానికి వెల కట్టలేం.

అభిమానానికి తూకం వెయ్యలేం.

ఆత్మీయతకు కొలమానం కనిపెట్టలేం.

ఆరాధనకు అంచులు కుట్టలేం.

ఆప్యాయతలకు ఆదిని అన్వేషించలేం.

అన్యోన్యతకు అంతం వెతకలేం.

ఈ ఏడు వారాల నగలు ఉండగా...

వేరే ఆభరణాలెందుకు?

అలంకారాలెందుకు?

 


పెళ్లయ్యి ఈ జూన్‌కి ఇరవైమూడేళ్లయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాకుంటే, కొన్నేళ్ళు మీరు నం.1గా ఉండేవారేమో. కానీ, కెరీర్‌ని త్యాగం చేసేశారే?

అమల: పెళ్లి చేసుకుందామని నాగ్ నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను కలలో కూడా ఊహించనంత అందమైన జీవితాన్నిచ్చాడు. నన్ను సినిమాలు చేయొద్దని తను చెప్పలేదు. పెళ్లయిన తర్వాత కూడా నేను వర్క్ చేస్తున్నాను. కాకపోతే సినిమాలు కాదు.. సామాజిక కార్యక్రమాల కోసం పని చేస్తున్నాను. సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నది నేనే. త్యాగం లాంటి పెద్ద మాటలు మాట్లాడను. కథానాయికగా ఎందుకు కొనసాగలేదని ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు.



సినిమాలకు దూరంగా ఉండాలని ఎందుకనుకున్నారు?

పెళ్లయ్యాక పదిహేనేళ్ల వరకూ కెరీర్ గురించి ఆలోచించేంత తీరిక లేదు. పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లి అవసరం ఉంటుంది. అఖిల్ ఆలనాపాలనా చూసుకునేదాన్ని. ఇంటి బాధ్యతలతో పాటు బ్లూ క్రాస్ కృషితోనే నాకు సరిపోయేది. ఇప్పుడు అఖిల్ సొంత నిర్ణయాలు తీసుకునేంత ఎదిగాడు. అందుకని, నాకు ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేసేంత, నాకు నచ్చిన పనులు చేసేంత వీలు చిక్కింది. అందుకే, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి శేఖర్ కమ్ముల అడిగినప్పుడు చేశా. తమిళ సీరియల్ ‘ఉయిర్‌మై’లో నటించా.



సినిమాల్లోకి వచ్చినప్పటిలానే ఇప్పుడూ ఉన్నారే?

ఒకప్పుడు బొద్దుగానే ఉండేదాన్ని. ఆ తర్వాత సన్నబడ్డా.  సినిమా తారలంటే మరీ సన్నగా, చాలా లావుగా... కాకుండా మధ్యస్తంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇన్నేళ్లూ సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆరోగ్యం కోసం చేస్తున్న వ్యాయామాలు, యోగా, మంచి డైట్.. నేనిలా ఉండడానికి కారణం అయ్యాయి.



డైట్ అంటే గుర్తొచ్చింది మీరు ‘వేగన్’ కదా. వేగన్ అంటే తెలియనివారికి కొన్ని విషయాలు చెబుతారా?

‘వేగన్’ అంటే మూగజీవాల నుంచి వచ్చే దేన్నయినా ఆహారంలో చేర్చుకోకపోవడం. నేను పాలు తాగను. తేనెకి దూరం. మాంసం జోలికెళ్లను. పదకొండేళ్ల వయసులోనే మాంసాహారం మానేశా. ఎనిమిదేళ్ల క్రితం వేగన్‌గా మారా. పాలు మానేసినప్పట్నుంచీ ఆరోగ్యం ఇంకా బాగుంటోంది.



వయసు పెరిగాక, ఎముకలు బలహీనమవుతాయనీ, క్యాల్షియమ్ కోసం లేడీస్ పాలు తాగాలనీ డాక్టర్లు చెబుతారే?

చాలామందికి తెలియని విషయం ఏంటంటే... పాలల్లోకన్నా నువ్వులలో క్యాల్షియమ్ ఎక్కువుంటుంది. గ్లాసుడు పాలల్లో 10 మిల్లీగ్రాములు కాల్షియమ్ ఉంటే.. 100 గ్రాముల నువ్వులలో వెయ్యి మిల్లీగ్రాములుంటుంది. కానీ, పాలలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉంటుందని డైరీ ఫామ్స్ ప్రకటనలిచ్చి, ఆకర్షిస్తుంటాయి. నువ్వులు మంచివని  ప్రకటించుకోవడం పాపం వాటిని పండించే రైతులకు తెలియదుగా. అలాగే వేరుసెనగపప్పు కూడా మంచిదే. ఇవాళ మనందరం ఏదైనా కొనాలంటే ప్రకటనలు చూసే కొంటున్నాం కానీ, నిజంగా అవి మంచివేనా? అనేది ఆలోచించలేకపోతున్నాం. భారీ ప్రకటనలతో చాలామంది వ్యాపారస్థులు ప్రలోభపెట్టేస్తున్నారు.



నాగార్జున మీ సొంతం కావడంపై చాలామంది అసూయపడతారు. హ్యాండ్‌సమ్‌గా కనిపించే నాగార్జున ఎలాంటి వ్యక్తి?

నాగ్ చాలా చాలా స్పెషల్. తనను పెళ్లి చేసుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదం. వ్యక్తిగా నాగ్ మంచి హ్యూమన్ బీయింగ్. అందుకే తనంటే ప్రేమ, ఆరాధన, గౌరవం.



భర్త అందగాడైతే వేరే అమ్మాయిల దృష్టి పడకుండా కాపాడుకోవాల్సొస్తుంది. ఈ విషయంలో మీకు టెన్షన్ తప్పదేమో?

మానసిక పరిణతి లేని, సున్నితమైన మనస్కులైతే టెన్షన్ పడతారేమో. నేను అభద్రతాభావానికి గురయ్యేలా నాగ్ ఎప్పుడూ ప్రవర్తించలేదు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళను నేనే అనే నమ్మకాన్ని కలిగించాడు. ఎంతమంది అందమైన అమ్మాయిలు చుట్టూ ఉన్నా, ‘నువ్వంటే నాకు చాలా ప్రేమ’ అనే విధంగా ప్రవర్తించడంతో పాటు ‘నువ్వు మాత్రమే నాకు ప్రత్యేకం’ అనే ఫీల్‌ని కలగజేస్తాడు. నేను నెగటివ్ ఎమోషన్స్‌కి విలువ ఇవ్వను. ఇస్తే అసూయ, అభద్రత, కోపం... కలుగుతాయి.



మీరెక్కువగా చేనేత చీరలే వాడతారెందుకని? ఖర్చు తక్కువ కాబట్టి షాపింగ్‌లో నాగ్‌కి ఇబ్బంది ఉండదేమో?

అది నిజమే. నా డ్రెస్‌ల ఖర్చు తక్కువే అయినప్పటికీ... ప్రయోజనాత్మక కార్యక్రమాల కోసం నాగ్ ఇచ్చే భారీ చెక్స్‌ని కాదనను. నాగ్‌ది చాలా పెద్ద మనసు. కాదనుకుండా ఇచ్చేస్తాడు. చేనేత చీరలు బాగుంటాయి. మనం కనుక నెలకు రెండు చేనేత చీరలు కొంటే.. దాని చేనేతనే నమ్ముకున్న తయారీదారుల కుటుంబం నెలసరి ఖర్చులకు దాదాపు సరిపోతుంది. పైగా అవి మెత్తగా ఉంటాయి, హాయిగా ఉంటుంది.



నగలు కూడా పెద్దగా వాడరనిపిస్తోంది. మరి... నాగార్జున మీకిచ్చిన మొదటి ఆభరణం గురించి?

నాకో అందమైన ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇచ్చాడు. అయితే నీళ్లల్లో డైవింగ్ చేస్తున్నప్పుడు నా చేతి మీద ట్యాంక్ పడింది. దాంతో ఆ ఉంగరానికి ఉన్న రాయి పగిలిపోయింది. అది పగిలినందువల్ల నా వేలికి ఏమీ కాలేదు. సో.. నాగ్ ఇచ్చిన ఆ ఉంగరం నా వేలును కాపాడినట్లుగా నేను భావిస్తాను. ఓ బర్త్‌డేకి నాకు మంచి ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత నాకు నగలేవీ వద్దని చెప్పడంతో మానేశాడు.



బలమైన కుటుంబం ఏ స్త్రీకైనా కొండంత అండ. ‘అక్కినేని’ మీ ఇంటి పేరుగా మారినందుకు ఎలా అనిపిస్తోంది?

అక్కినేని కుటుంబంలో ఉండడం నా అదృష్టం.. ఆ దేవుడి ఆశీర్వాదం. ఎక్కడికెళ్లినా ప్రేమాభిమానాలు, గౌరవం దక్కుతున్నాయి. మారుమూల ప్రజలను కలవడానికి వెళ్లినప్పుడు పెద్దవాళ్లందరూ మా మావయ్య సంగతులు, తర్వాతి తరంవారు నాగ్‌ను, యూత్ ఏమో నాగచైతన్య, అఖిల్ గురించి అడుగుతుంటారు. మా పట్ల వాళ్ల ప్రేమకు ఆశ్చర్యం వేస్తుంటుంది.



మీ అత్తగారు స్వర్గీయ అన్నపూర్ణ గురించి రెండు మాటలు?

ఆమెలో నేను అమ్మను చూసుకున్నా. పెళ్లయిన కొత్తలో తెలుగు సంప్రదాయాల గురించి ఆమే చెప్పింది. తెలుగు నేర్పిందీ అత్తగారే. ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.



పెళ్లయిన కొత్తలో అక్కినేనితో మూవ్ కావడానికి ఏమైనా...?

మావయ్యగారు చాలా గొప్ప వ్యక్తి. చాలా పద్ధతిగా ఉండేవారు. క్రమశిక్షణ గల వ్యక్తి. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి, అందర్నీ అర్థం చేసుకుంటారు. కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించలేదు. మావయ్యగారి ప్రేమాభిమానాల్ని మర్చిపోలేను. ఆయన మా మనసుల్లో ఉన్నారు.



మీ అమ్మానాన్నలతో, బ్రదర్, సిస్టర్‌తో నాగ్ ఎలా...?

నాకు మా అమ్మా, నాన్న, బ్రదర్, సిస్టర్ మాత్రమే కాదు.. ఓ స్టెప్ మామ్ కూడా ఉంది. మా వాళ్లతో నాగ్ చాలా బాగుంటాడు. వాళ్లెప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు చాలా కేరింగ్‌గా ఉంటాడు. మా వాళ్ల నుంచి ఏమీ ఎదురుచూడడు. ఎలాంటి నిబంధనలూ లేకుండా స్వచ్ఛంగా అభిమానిస్తాడు.



నాగచైతన్యకు మీరు తల్లి స్థానాన్ని ఇచ్చారా?

అలా ఎదురు చూడటం తప్పు. ఎందుకంటే, తనకో అమ్మ ఉంది. ఆ అమ్మ స్థానాన్ని నేను లాక్కోలేను. చైతన్య మా కుటుంబ సభ్యుడే. తనంటే నాకు చాలా ఇష్టం. ‘వండర్‌ఫుల్ బాయ్’.



మీ స్టెప్ మదర్ మీతో ఎలా ఉంటారు?

బాగానే ఉంటారు. నాకు మా అమ్మగారు ఉన్నారు కాబట్టి నా స్టెప్ మామ్‌ని నేను అమ్మగా అంగీకరించలేదు. అవిడ కూడా మా అమ్మ స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నించలేదు. ఆమె మా కుటుంబ సభ్యురాలే. ఆమె అంటే నాకిష్టమే. మా మధ్య మంచి అనుబంధం ఉంది.



అఖిల్‌ని తెరపై చూడడానికి ఓ తల్లిగా...?

 ఎస్.. తనను హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై చూసుకోవాలనే కోరిక ఉంది.



మరో జన్మ అంటూ ఉంటే...

మీరేం అడుగుతారో తెలుసు.. అవును.. నాగ్‌కి భార్యగానే ఉండాలని కోరుకుంటున్నాను.

- డి.జి. భవాని

ఫోటో: శివ మల్లాల
    

 

లవ్ లైఫ్, మ్యారీడ్ లైఫ్...


నాగ్ చాలా రొమాంటిక్. నా దగ్గర తన ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు చాలా కేర్ తీసుకున్నాడు. ఎంతో ప్లాన్ చేసుకుని, ఆ ఫీలింగ్‌ను చాలా అందంగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఆ సమయంలో తను చెప్పిన మాటలు పూర్తిగా నా వ్యక్తిగతం. నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయే ఆ మాటలను బయటికి చెప్పను. పెళ్లనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులిస్తాయి. కొన్ని కలుపు మొక్కలు మంచి చెట్లను నాశనం చేస్తాయి. పెళ్లి కూడా అంతే. మన బంధం ఇతరుల కారణంగా నాశనం కానివ్వకూడదు. ‘నువ్వు నాకు చాలా ప్రత్యేకం.. నువ్వంటే నాకు ప్రేమ’ అనే నమ్మకాన్ని జీవిత భాగస్వామికి కలిగించాలి. లేకపోతే ఆ బంధంలో జీవం ఉండదు. మా ప్రతి పెళ్లి రోజునాడు మా ప్రమాణాలను పునరుద్ధరించుకుంటాం. అలాగే.. ప్రతి ఏడాదీ మాకు కొత్తగా ఉంటుంది.

 

 రామ్

 ఎడిటర్, ఫీచర్స్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top