సన్మార్గం : ప్రసాదంలోని పరమార్థమేమిటి? | Sakshi
Sakshi News home page

సన్మార్గం : ప్రసాదంలోని పరమార్థమేమిటి?

Published Tue, Nov 26 2013 11:14 PM

సన్మార్గం : ప్రసాదంలోని పరమార్థమేమిటి?

 పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి  తదహం భక్త్యుప హృతమశ్నామి ప్రయతాత్మానాం  నిష్కామమైన, నిర్మలమైన, నిష్కళంకమైన మనస్సుతో తనకు చేసే పూజ ఏ రూపంలో ఉన్నా, అది ఆదరణీయమేనని కృష్ణభగవానుడు భగవద్గీతలో వివరిస్తాడు. ఏ భక్తుడైనా భక్తితో ప్రేమతో పత్రాన్ని గానీ, పుష్పాన్నిగానీ, ఫలాన్ని గానీ, నీటినిగానీ సమర్పిస్తాడో అతని నైవేద్యాన్ని నేను స్వీకరిస్తాను. శుద్ధాంతఃకరణంగల  నిష్కామమైన భక్తుడు సమర్పించిన వానిని నేను ఆరగిస్తాను, ఆదరిస్తాను అని హామీ ఇస్తాడు. ప్రకృతినుండి ప్రావిర్భవించిన పరమాత్ముడు ప్రకృతిసిద్ధమైన నైవేద్యాలను ఆకాంక్షించడంలో ఎంతో ఔచిత్యం ఉందనిపిస్తుంది. ప్రకృతి పచ్చగా ఉండాలంటే పదికాలాలు ఆకుపచ్చగా, ఆహ్లాదభరితంగా, ఆరోగ్య సహితంగా ఉండటానికి దోహదం చేసేవి పత్రాలు. అందుకనే మామిడి ఆకులు, వేప ఆకులు, మారేడు, రావి మొదలైన వివిధ రకాల పత్రాలతో, తమలపాకులతో నైవేద్యం సమర్పించుకోమని విజ్ఞులంటారు. పత్రభరితమైన హరితవనంలో ఆకుల మధ్య పూవులు ఆహ్లాదంగా దర్శనమిస్తాయి. ఆ పూలను పూజాపుష్పాలుగా సమర్పించుకోవడానికైనా పుష్పవాటికల నిర్మాణం చేపడతాం. పూవులనుండి కాయలు, కాయలనుండి పళ్ళు, పళ్లనుండి చెట్లు కనులవిందుగా లభిస్తాయి.
 
 పళ్లలో ప్రధానమైన అరటిపండు నైవేద్యమైన తరువాత జీర్ణక్రియను పెంపొందించే పండుగా వినియోగించబడుతుంది. అరటి ఆకులో భోజనం ఆనందదాయకమైనదే. మామిడి తోరణాలు కనులకు ఆహ్లాదంగా ప్రాణవాయువును సరఫరా చేస్తుంటే... తాంబూలంగా ఇచ్చే తమలపాకు చక్కటి జీర్ణశక్తిని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే ‘కదళీఫలం సమర్పయామి’ అంటూ ప్రకృతిపరమైన నైవేద్యాన్ని సమర్పిస్తాం.
 
 పత్రం, పుష్పం, ఫలం తరువాత ప్రధానమైనది తోయం. ప్రాణాధారమైన జలం సద్వినియోగ పరచబడాలని, జలవనరులను ఏర్పరచుకోవాలని, బలానికి జీవనంలో సముచితమైన స్థానం కోసం జాగ్రత్త వహించాలని ఆదేశిస్తూ ‘జలాన్ని’ తనకు నివేదించమంటాడు. అందుకోసమైనా పరిశుభ్రమైన ప్రహ్లాదమైన ‘జల సంచ యనం’ కోసమైనా తాపత్రయపడమని, జలసేకరణ కోసం, జలవనరుల పరిరక్షణ కోసం, స్వచ్ఛమైన, పారిశుద్ధ్యమైన జలసాధన కోసం కృషి చేయాలనే అంతరార్థం అంతర్లీనంగా కనిపిస్తుంది.
 అర్జునా! ఆ విధంగా ఏ రూపంలోనైనా... ఏ పదార్థ వచనం ద్వారానైనా, ఏ రకమైన పిండివంటల పరిచయ రూపంలోనైనా నాకు నివేదన చేయబడిన పదార్థం ప్రసాదమౌతుంది. ప్రశాంతమైన, పరిశుభ్రమైన నైవేద్యాన్ని పంచయజ్ఞాల ద్వారా నివేదించిన తరువాత దానిని అందరికీ పంచిపెట్టాలి. అలా యజ్ఞంలో మిగిలిన అమృతాన్నాన్ని సేవించే వారంతా యోగిజనులే అవుతారు. వారు నిస్సందేహంగా సనాతన పరబ్రహ్మ పరమాత్మ పదాన్ని పొందగలుగుతారని భగవద్గీతలో భరోసా ఇస్తాడు.
 
 ప్రసాదమంటే ప్రసన్నత, తేటదనం, నైర్మల్యం, గురువాదులచే భుక్త పరిశిష్ఠమైన అన్నము, కావ్యగుణాలలో ఒక లక్షణంగా దేవ నైవేద్యమనే పరిపరివిధాల అర్థాలున్నాయని లాక్షణికులు చెబుతారు. అటువంటి ప్రసాదం ప్రసన్నంగా చేస్తుందని, దానిని ప్రసాదకంగా పిలుస్తారని విజ్ఞులంటారు. ప్రాణాహుతుల రూపంలో ఆహారం శక్తిని అందిస్తుంది కనుక అన్నాన్ని కూడా ప్రసాదంగానే చూడాలని ఆదిత్యపురాణం అంటే, అన్నాన్ని పూజించమని, చులకనగా చూడవద్దని, అలా పూజించబడిన అన్నమే శక్తి సామర్థ్యాలనిస్తుందని స్మృతులు చెబుతున్నాయి.
 
 శుద్ధము, సిద్ధము, ప్రసిద్ధమని ప్రసాదాలను లాక్షణికులు మూడువిధాలుగా పేర్కొంటారు. గురువుకు నైవేద్యం చేయగా, గురువు భుజించగా మిగిలిన గురుభుక్త శేషాన్ని శుద్ధము అని, అలాగే పరమేశ్వరునకు అర్పించగా మిగిలిన ఈశ్వర భుక్త శేషాన్ని సిద్ధమని, భగవత్ భక్తులు భుజించగా మిగిలిన శేషాన్ని ప్రసిద్ధమని నిర్వచించారు. అందుకే అన్న బ్రహ్మ తత్వారాధనకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెద్దపీట వేస్తాయి.
 
 అన్నం రూపంలో భగవంతునికి నివేదన చేస్తూ నైవేద్యం రూపాలలో ఒక విశిష్ఠత, పరమార్థంగా గోచరిస్తుంది. అన్నంలో నిండి నిబిడీకృతమైన శక్తి పాలతో కలిపినప్పుడు రెట్టింపై పరమాన్నంగా మారుతుంది. దానికి బెల్లమో, పంచదారో చేర్చితే ద్విగుణీకృతమౌతుంది. ఆ పరమాన్నానికి పెసరపప్పు తోడైతే, కొబ్బరి ముక్కలు కలగలిస్తే ఆ శక్తి విలువలు అపారమైనవి అవుతాయని ఆహార శాస్త్రవేత్తలు చెబుతారు. అటువంటి చక్కెరపొంగలి, పొంగలిరూపంలో నివేదన చేసిన పిడికెడు నైవేద్యం ఓ అభాగ్యుని, ఓ అనాథని అర్థాకలిని రూపుమాపగలుగుతుంది. అతనికి ఓ పూట జీవనం కలిగిస్తుంది. అలాగే చిత్రాన్నములైన పులిహోర, పొంగలి, దద్ధోజనాల పోషక శక్తి విలువలు సాధారణమైనప అన్నం కంటే అత్యధిక స్థాయిలో ఉంటాయి కనుకనే వానిని భగవదర్పణం చేసి భుక్తావశేషాన్ని మాత్రమే అమృతంగా స్వీకరించమని పెద్దలు చెబుతారు. అదే ప్రసాదంలోని అర్థం పరమార్థం.
 - సూర్యప్రసాదరావు

Advertisement
 
Advertisement
 
Advertisement