breaking news
baghavadgeetha
-
క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ భగవద్గీత శ్లోకం భావం వివాదంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలను సృష్టిస్తున్నారని హిమంత బిశ్వశర్మపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘తాను రోజు భగవద్గీత శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు సుమారు 668 శ్లోకాలు పోస్ట్ చేశాను. అయితే ఇటీవల నా సోషల్ మీడియా టీం.. భగవద్గీతలోని చాప్టర్ 18లో ఉన్న 44వ శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఆ శ్లోకం అనువాద అర్థాన్ని తప్పుగా పోస్ట్ చేసింది. ఆ తప్పు నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌ను నేను వెంటనే డిలీట్ చేశాను. అస్సాం ఎప్పుడూ కులాలకు అతీతమైన సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటంది. దానికి మహాపురుష్ శ్రీమంత శంకరదేవకు నా కృతజ్ఞతలు. నేను డిలీట్ చేసిన పోస్ట్ వల్ల ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. వారికి ఇవే నా క్షమాపణలు’ అని సీఎం హిమంత బిశ్వశర్మ (ఎక్స్)ట్వీటర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. As a routine I upload one sloka of Bhagavad Gita every morning on my social media handles. Till date, I have posted 668 slokas. Recently one of my team members posted a sloka from Chapter 18 verse 44 with an incorrect translation. As soon as I noticed the mistake, I promptly… — Himanta Biswa Sarma (@himantabiswa) December 28, 2023 అయితే సీఎం హిమంత ట్వీటర్ టీం మొదటగా పోస్ట్ చేసిన భగవద్గీత శ్లోకం.. ‘బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల విధి’ అనే అర్థం వచ్చేలా ఉండటంతో ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించాయి. -
సన్మార్గం : ప్రసాదంలోని పరమార్థమేమిటి?
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుప హృతమశ్నామి ప్రయతాత్మానాం నిష్కామమైన, నిర్మలమైన, నిష్కళంకమైన మనస్సుతో తనకు చేసే పూజ ఏ రూపంలో ఉన్నా, అది ఆదరణీయమేనని కృష్ణభగవానుడు భగవద్గీతలో వివరిస్తాడు. ఏ భక్తుడైనా భక్తితో ప్రేమతో పత్రాన్ని గానీ, పుష్పాన్నిగానీ, ఫలాన్ని గానీ, నీటినిగానీ సమర్పిస్తాడో అతని నైవేద్యాన్ని నేను స్వీకరిస్తాను. శుద్ధాంతఃకరణంగల నిష్కామమైన భక్తుడు సమర్పించిన వానిని నేను ఆరగిస్తాను, ఆదరిస్తాను అని హామీ ఇస్తాడు. ప్రకృతినుండి ప్రావిర్భవించిన పరమాత్ముడు ప్రకృతిసిద్ధమైన నైవేద్యాలను ఆకాంక్షించడంలో ఎంతో ఔచిత్యం ఉందనిపిస్తుంది. ప్రకృతి పచ్చగా ఉండాలంటే పదికాలాలు ఆకుపచ్చగా, ఆహ్లాదభరితంగా, ఆరోగ్య సహితంగా ఉండటానికి దోహదం చేసేవి పత్రాలు. అందుకనే మామిడి ఆకులు, వేప ఆకులు, మారేడు, రావి మొదలైన వివిధ రకాల పత్రాలతో, తమలపాకులతో నైవేద్యం సమర్పించుకోమని విజ్ఞులంటారు. పత్రభరితమైన హరితవనంలో ఆకుల మధ్య పూవులు ఆహ్లాదంగా దర్శనమిస్తాయి. ఆ పూలను పూజాపుష్పాలుగా సమర్పించుకోవడానికైనా పుష్పవాటికల నిర్మాణం చేపడతాం. పూవులనుండి కాయలు, కాయలనుండి పళ్ళు, పళ్లనుండి చెట్లు కనులవిందుగా లభిస్తాయి. పళ్లలో ప్రధానమైన అరటిపండు నైవేద్యమైన తరువాత జీర్ణక్రియను పెంపొందించే పండుగా వినియోగించబడుతుంది. అరటి ఆకులో భోజనం ఆనందదాయకమైనదే. మామిడి తోరణాలు కనులకు ఆహ్లాదంగా ప్రాణవాయువును సరఫరా చేస్తుంటే... తాంబూలంగా ఇచ్చే తమలపాకు చక్కటి జీర్ణశక్తిని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే ‘కదళీఫలం సమర్పయామి’ అంటూ ప్రకృతిపరమైన నైవేద్యాన్ని సమర్పిస్తాం. పత్రం, పుష్పం, ఫలం తరువాత ప్రధానమైనది తోయం. ప్రాణాధారమైన జలం సద్వినియోగ పరచబడాలని, జలవనరులను ఏర్పరచుకోవాలని, బలానికి జీవనంలో సముచితమైన స్థానం కోసం జాగ్రత్త వహించాలని ఆదేశిస్తూ ‘జలాన్ని’ తనకు నివేదించమంటాడు. అందుకోసమైనా పరిశుభ్రమైన ప్రహ్లాదమైన ‘జల సంచ యనం’ కోసమైనా తాపత్రయపడమని, జలసేకరణ కోసం, జలవనరుల పరిరక్షణ కోసం, స్వచ్ఛమైన, పారిశుద్ధ్యమైన జలసాధన కోసం కృషి చేయాలనే అంతరార్థం అంతర్లీనంగా కనిపిస్తుంది. అర్జునా! ఆ విధంగా ఏ రూపంలోనైనా... ఏ పదార్థ వచనం ద్వారానైనా, ఏ రకమైన పిండివంటల పరిచయ రూపంలోనైనా నాకు నివేదన చేయబడిన పదార్థం ప్రసాదమౌతుంది. ప్రశాంతమైన, పరిశుభ్రమైన నైవేద్యాన్ని పంచయజ్ఞాల ద్వారా నివేదించిన తరువాత దానిని అందరికీ పంచిపెట్టాలి. అలా యజ్ఞంలో మిగిలిన అమృతాన్నాన్ని సేవించే వారంతా యోగిజనులే అవుతారు. వారు నిస్సందేహంగా సనాతన పరబ్రహ్మ పరమాత్మ పదాన్ని పొందగలుగుతారని భగవద్గీతలో భరోసా ఇస్తాడు. ప్రసాదమంటే ప్రసన్నత, తేటదనం, నైర్మల్యం, గురువాదులచే భుక్త పరిశిష్ఠమైన అన్నము, కావ్యగుణాలలో ఒక లక్షణంగా దేవ నైవేద్యమనే పరిపరివిధాల అర్థాలున్నాయని లాక్షణికులు చెబుతారు. అటువంటి ప్రసాదం ప్రసన్నంగా చేస్తుందని, దానిని ప్రసాదకంగా పిలుస్తారని విజ్ఞులంటారు. ప్రాణాహుతుల రూపంలో ఆహారం శక్తిని అందిస్తుంది కనుక అన్నాన్ని కూడా ప్రసాదంగానే చూడాలని ఆదిత్యపురాణం అంటే, అన్నాన్ని పూజించమని, చులకనగా చూడవద్దని, అలా పూజించబడిన అన్నమే శక్తి సామర్థ్యాలనిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. శుద్ధము, సిద్ధము, ప్రసిద్ధమని ప్రసాదాలను లాక్షణికులు మూడువిధాలుగా పేర్కొంటారు. గురువుకు నైవేద్యం చేయగా, గురువు భుజించగా మిగిలిన గురుభుక్త శేషాన్ని శుద్ధము అని, అలాగే పరమేశ్వరునకు అర్పించగా మిగిలిన ఈశ్వర భుక్త శేషాన్ని సిద్ధమని, భగవత్ భక్తులు భుజించగా మిగిలిన శేషాన్ని ప్రసిద్ధమని నిర్వచించారు. అందుకే అన్న బ్రహ్మ తత్వారాధనకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెద్దపీట వేస్తాయి. అన్నం రూపంలో భగవంతునికి నివేదన చేస్తూ నైవేద్యం రూపాలలో ఒక విశిష్ఠత, పరమార్థంగా గోచరిస్తుంది. అన్నంలో నిండి నిబిడీకృతమైన శక్తి పాలతో కలిపినప్పుడు రెట్టింపై పరమాన్నంగా మారుతుంది. దానికి బెల్లమో, పంచదారో చేర్చితే ద్విగుణీకృతమౌతుంది. ఆ పరమాన్నానికి పెసరపప్పు తోడైతే, కొబ్బరి ముక్కలు కలగలిస్తే ఆ శక్తి విలువలు అపారమైనవి అవుతాయని ఆహార శాస్త్రవేత్తలు చెబుతారు. అటువంటి చక్కెరపొంగలి, పొంగలిరూపంలో నివేదన చేసిన పిడికెడు నైవేద్యం ఓ అభాగ్యుని, ఓ అనాథని అర్థాకలిని రూపుమాపగలుగుతుంది. అతనికి ఓ పూట జీవనం కలిగిస్తుంది. అలాగే చిత్రాన్నములైన పులిహోర, పొంగలి, దద్ధోజనాల పోషక శక్తి విలువలు సాధారణమైనప అన్నం కంటే అత్యధిక స్థాయిలో ఉంటాయి కనుకనే వానిని భగవదర్పణం చేసి భుక్తావశేషాన్ని మాత్రమే అమృతంగా స్వీకరించమని పెద్దలు చెబుతారు. అదే ప్రసాదంలోని అర్థం పరమార్థం. - సూర్యప్రసాదరావు