పచ్చిళ్లు

Add Mango Pieces and Cook for about ten Minutes - Sakshi

పచ్చళ్లే! పచ్చికాయలు కనుక పచ్చిళ్లు!పచ్చిగా చెప్పాలంటే..కొంచెం వయలెన్స్‌ ఉంటే కానీతయారీలో ఘాటు..ప్లేట్‌లోకి వచ్చాక షూట్‌ ఎట్‌ సైటు.. ఉండవు.కారం... ఉప్పు.. ఆవపొడి.. నువ్వులనూనెకలిస్తే.. చేతినిండా కలిపితేజిహ్వ జిమ్మాస్టిక్సే. నోరు ఏరోబిక్సే.

వడు మాంగా
కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్‌ స్పూన్లు
పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను
తయారీ:
►ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు నీడలో ఆరబెట్టాలి
►ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల అన్ని మామిడి పిందెలకు  నూనె పడుతుంది)
►బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
►పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చి, జత చేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి
►ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి
►రోజుకి మూడు నాలుగుసార్లు చొప్పున అలా మూడు రోజులు కలపాలి
►మామిడి పిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతాయి
►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే వడు మాంగా రుచిగా ఉంటుంది.

టెండర్‌ మ్యాంగో పికిల్‌
కావలసినవి: మామిడి పిందెలు – ముప్పావు కిలో; ఉప్పు – ముప్పావు కప్పు; ఆవాలు – టేబుల్‌ స్పూను; పసుపు – ఒకటిన్నర టీ స్పూన్లు; నువ్వుల నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 20
తయారీ:
►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, నీడలో కొద్దిసేపు ఆరబెట్టాలి
►తొడిమలను చాకుతో కట్‌ చేయాలి
►రాతి ఉప్పును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
►ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక పసుపు జత చేయాలి
►తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి
►పెద్ద పాత్రలో మామిడి పిందెలు వేసి వాటి మీద నువ్వుల నూనె వేసి బాగా కలపాలి
►ఆవ పొడి జత చేసి మరోమారు కలపాలి
►ఉప్పు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి
►మూడు రోజుల పాటు ప్రతిరోజూ రెండు పూటలా పైకి కిందకి కలుపుతుండాలి
►నాలుగో రోజుకి ఊట కిందకి దిగుతుంది
►మిక్సీలో ఎండు మిర్చి వేసి పొడి చేయాలి
►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఊరగాయలో నుంచి వచ్చిన ఊట కొంత తీసి, ఎండు మిర్చి పొడిలో వేసి మెత్తగా చేయాలి
►ఒక పెద్ద పాత్రలోకి ఊరగాయ తిరగదీసి, దాని మీద ఈ మిశ్రమం వేసి, జాడీలోకి తీసుకోవాలి
►పది రోజుల పాటు ప్రతిరోజూ పైకి కిందకి కలపాలి
►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుంటే వడ దెబ్బ బారి నుంచి రక్షించుకోవచ్చు.

కన్ని మాంగా అచార్‌
కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి)
తయారీ:
►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి
►తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి
►పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి
►నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి
►ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి
►ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి.

కడు మాంగా అచార్‌
కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్‌æస్పూన్లు
తయారీ:
►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి
►బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
►కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి
►పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి
►మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి
►మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక దింపేయాలి
►చల్లారాక గాలి చొరని సీసాలోకి తీసుకోవాలి (ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుము కలుపుకోవచ్చు

మామిడి కాయ గ్రేవీ చట్నీ
కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక కప్పు; ధనియాలు – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 15 (కాశ్మీర్‌ మిర్చి); కొబ్బరి నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి కొబ్బరి – రెండు కప్పులు; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ: 
►తరిగిన పచ్చిమామిడికాయ ముక్కలను ఒక పెద్ద పాత్రలో వేసి పసుపు, ఉప్పు, బెల్లం జత చేసి కలిపి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలి వేడయ్యాక రెండు టేబుల్‌ స్పూన్ల ధనియాలు వేసి వేయించి తీసి చల్లార్చాలి
►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి
►బాణలిలో ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి కాగాక ఒక టీ స్పూను బియ్యం వేసి వేయించాలి
►మెంతులు కొద్దిగా జత చేయాలి
►మినప్పప్పు కూడా జత చేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి
►మిక్సీలో రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము, వేయించిన బియ్యం, మెంతులు, మినప్పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి
►కొద్దిగా నీళ్లు జత చేయాలి
►స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి
►మామిడికాయ ముక్కలు జత చేయాలి
►మిక్సీ పట్టిన మిశ్రమం జత చేయాలి
►కప్పుడు నీళ్లు పోసి కలపాలి
►ముప్పావు కప్పు కొబ్బరి పాలు పోసి మరోమారు కలిపి మూత పెట్టాలి
►పావు గంట తరవాత మూత తీయాలి
►మామిడి గ్రేవీ చట్నీ అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

మామిడికాయ పచ్చడి
కావలసినవి: మామిడి కాయలు – 4 (పచ్చివి); ఎండు మిర్చి – 8 ; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు.
తయారీ:
►మామిడికాయల తొక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►ఒక్కో ఎండు మిర్చిని మంట మీద దోరగా కాల్చాలి
►మిక్సీలో ఎండు మిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేయాలి
►అన్నంలోకి వేడి వేడి నేతితో కలుపుకుంటే రుచిగా ఉంటుంది.

మామిడికాయ – కొత్తిమీర పచ్చడి
కావలసినవి: మామిడికాయ ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నానబెట్టిన పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆవనూనె – అర టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4; పంచదార – అర టీ స్పూను
తయారీ:
►మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, నానబెట్టిన పచ్చి సెనగ పప్పు, జీలకర్ర పొడి, ఉప్పులను మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి
►ఆవ నూనె వేసి మరోమారు తిప్పాలి
►ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి తిప్పాలి
►పంచదార జత చేసి మరోమారు తిప్పాలి
►అప్పటికప్పుడు చేసుకునే ఈ చట్నీ అన్నంలో ఏ పదార్థంతోనైనా నంజుకుని తింటే రుచిగా ఉంటుంది.

పచ్చి మామిడికాయ పచ్చడి
కావలసినవి: మామిడికాయ ముక్కలు – అరకప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత
పోపు కోసం:
►ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను.
►పైన చెప్పిన పదార్థాలను (పోపు సామాను మినహాయించి) మిక్సీలో వేసి మెత్తగా తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి
►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి పచ్చడిలో కలపాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top