‘ఆరు’కు ముగిసిన ప్రచారం | The end of the sixth polling of the campaign | Sakshi
Sakshi News home page

‘ఆరు’కు ముగిసిన ప్రచారం

Apr 23 2014 3:57 AM | Updated on Aug 14 2018 4:21 PM

‘ఆరు’కు ముగిసిన ప్రచారం - Sakshi

‘ఆరు’కు ముగిసిన ప్రచారం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్‌కు మంగళవారంతో ప్రచారపర్వం ముగిసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 117 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.

11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత  ప్రాంతంలో 117 సీట్లకు రేపే పోలింగ్
బరిలోని ప్రముఖులు ములాయం, అజహర్, హేమమాలిని, సుష్మ

 
 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్‌కు మంగళవారంతో ప్రచారపర్వం ముగిసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 117 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 సీట్లతోపాటు మహారాష్ట్రలో 19 సీట్లు, యూపీలో 12, మధ్యప్రదేశ్‌లో 10, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలో ఏడు స్థానాలు చొప్పున, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో ఆరు సీట్ల చొప్పున, రాజస్థాన్‌లో 5 సీట్లు, జార్ఖండ్‌లో 4, జమ్మూకాశ్మీర్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. మొత్తం 2,087 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 17.9 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఆరో దశ బరిలో నిలిచిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, మిలింద్ దేవ్‌రా, నమో నారాయణ్ మీనా, జితేంద్ర సింగ్, తారిక్ అన్వర్, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, ఎన్సీపీ నేత చగన్ భుజ్‌బల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్, రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ, బాలీవుడ్ ‘డ్రీమ్‌గర్ల్’ హేమమాలిని, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తదితరులు ఉన్నారు. తమిళనాడులో ఎన్నికల బరిలో నిలిచిన 845 మంది అభ్యర్థుల్లో 100 మందికిపైగా నేరచరితులే ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, తమిళనాడు ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి.

 ఆజంగఢ్ స్థానానికి ములాయం నామినేషన్

 ఆజంగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానానికి ఈ నెల 4న నామినేషన్ వేసిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్ మంగళవారం ఆ రాష్ట్రంలోని ఆజంగఢ్ స్థానానికి నామినేషన్ వేశారు. జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల ఒత్తిడి మేరకే రెండో స్థానంగా ఆజంగఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తమ రాష్ట్రంలోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రతిగా తనను ఆజంగఢ్ నుంచి పోటీ చేయాల్సిందిగా కార్యకర్తలు కోరారని చెప్పారు.
 
అత్యంత ధనిక అభ్యర్థుల్లో ‘డ్రీమ్‌గర్ల్’

 న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి, ‘డ్రీమ్‌గర్ల్’ హేమమాలిని ఆరో దశ ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. తనకు రూ. 178 కోట్ల ఆస్తులున్నట్లు హేమమాలిని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడం తెలిసిందే. ఆరో దశలో పోటీ చేస్తున్న ఒక్కో బీజేపీ అభ్యర్థి సగటు ఆస్తి రూ. 14 కోట్లు ఉండగా హేమమాలిని ఆస్తులు మాత్రం అందుకు 12 రెట్లకన్నా ఎక్కువగా ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement