ఆర్టీసీ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం | RTC develop possible with YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

May 3 2014 2:25 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఆర్టీసీ అభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నారు.

ఒంగోలు, న్యూస్‌లైన్: ఆర్టీసీ అభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నారు. స్థానిక ఒక లాడ్జిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ తీవ్ర సంక్షోభాన్ని చవిచూసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీటుకు ఉన్న నామమాత్రపు టాక్స్‌ను 15 శాతం పెంచి ఆర్టీసీపై భారం మోపాడన్నారు. పెంచిన టాక్స్‌ను తగ్గించాలని 24 రోజులపాటు ఆర్టీసీలోని కార్మిక సంఘాలన్నీ సమ్మె చేస్తే కేవలం 2.5 శాతం టాక్స్ మాత్రమే తగ్గించారని విమర్శించారు.

 ఒకవైపు ప్రయాణికులపై చార్జీల రూపంలో భారం మోపుతూ ఆర్టీసీకి రావాల్సిన రాయితీలు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మోకాలడ్డిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. తొమ్మిదేళ్లలో ఒక్క కాంట్రాక్ట్ డ్రైవర్‌నుగానీ, కండక్టర్‌నుగానీ పర్మినెంట్ చేయకుండా ఊడిగం చేయించుకున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సుల్ని వాడుకుని నష్టాలకు పునాది వేశాడని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బకాయిలు  5 వేల కోట్లకు చంద్రబాబు విధానాలే కారణమన్నది ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచకుండానే  సీటుకు ఉన్న టాక్స్‌ను 5 శాతం తగ్గించారని చెప్పారు. ప్రభుత్వ ఖజానా నుంచి సాలీనా రూ.250 కోట్ల ఆర్థిక సాయం అందించారని తెలిపారు.

 వైఎస్సార్ మొదటిసారిగా ప్రభుత్వ రాయితీలను రూ.220 కోట్లు ఆర్టీసీకి చెల్లించారని చెప్పారు. కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లను రెండు దఫాలు రెగ్యులర్ చేశారన్నారు. వైఎస్సార్ హయాంలో లాభాల బాటలో ఉన్న ఆర్టీసీ ఆయన మరణం తరువాత తిరిగి సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలంటే రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈనెల 7వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌గుర్తుపై ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు ఏ.భగవాన్, టీ.గోపాలరావు, బీ.పిచ్చిరెడ్డి, షేక్ భాషా, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement