ఇసి ప్రయత్నాలు సీమాంధ్రలోనైనా ఫలించేనా? | Is voting percentage increase in seemandhra Towns? | Sakshi
Sakshi News home page

ఇసి ప్రయత్నాలు సీమాంధ్రలోనైనా ఫలించేనా?

May 6 2014 5:27 PM | Updated on Aug 14 2018 4:24 PM

ఓటు వేసే పద్దతిని, ఓటు ప్రధాన్యతను తెలుపుతున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ - Sakshi

ఓటు వేసే పద్దతిని, ఓటు ప్రధాన్యతను తెలుపుతున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్

మన దేశంలో తెల్లారి లెగిస్తే ప్రభుత్వాన్ని, అధికారులను, వ్యవస్థను తిట్టిపోసేవారే ఎక్కువ. ఎన్నికలు వస్తే అటువంటివారు ఓటు మాత్రం వేయరు.

మన దేశంలో తెల్లారి లెగిస్తే ప్రభుత్వాన్ని, అధికారులను, వ్యవస్థను తిట్టిపోసేవారే ఎక్కువ. ఎన్నికలు వస్తే అటువంటివారు ఓటు మాత్రం వేయరు. ఓటుతో వ్యవస్థను మార్చవచ్చని తెలిసినా వారు మాత్రం ఓటు వేయడానికి ఆసక్తి చూపరు. ఉద్యోగులు ఓటు వేసేందుకు ప్రభుత్వం సెలవు ప్రకటించినా వారు దానిని ఉపయోగించుకోరు. ఓటు వేసేందుకు ఆసక్తి చూపనివారిలో చదువుకున్నవారే ఎక్కువగా ఉండటం బాధాకరం. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉండటంలేదు.

ఎలుకతోలు తెచ్చి ఏడాది ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు....అన్న వేమన పద్యాన్ని మన రాజధాని వాసులు బాగా వంటపట్టించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈసీ ఎంత ఊదరగొట్టినా అవి వారి చెవికెక్కలేదు. సెలవు ప్రకటించినా, వాతావరణం చల్లబడినా వారిలో మాత్రం చలనం కలగలేదు. ఫలితంగా పేరుకే విద్యావంతులు కానీ ఆలోచన లేని వారిగా మిగిలిపోయారు. మొన్న హైదరాబాద్లో జరిగిన ఎన్నికలలో కేవలం 53 శాతం ఓటింగ్ నమోదైంది. తెలంగాణ మొత్తంమీద ఇది అతి తక్కువ పోలింగ్ శాతం. చదవేస్తే ఉన్నమతి పోయినట్లుంది హైదరాబాద్‌ ఓటర్ల పరిస్ధితి.

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ ఈసీ చేపట్టిన ప్రచారం, చేసిన ప్రయత్నాలు నగర ఓటరును మాత్రం పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురాలేకపోయాయి.  పోలింగ్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఎన్నికల కమిషన్‌ సెలవు ప్రకటించింది.  వాతావరణం కూడా అనుకూలించింది. అయినా అవేవీ హైదరాబాద్‌ ఓటరుకు పట్టలేదు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోని ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుంటే, రాజధాని వాసులు  మాత్రం వారివారి ఇళ్లకే పరిమితమయ్యారు.  నగర ఓటర్లు  నామమాత్రంగానే ఓటింగ్‌లో పాల్గొనడం విచారకరం.

రేపు సీమాంధ్రలో జరిగే ఎన్నికలకు కూడా పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తన వంతు ప్రయత్నాలు, ప్రచారం చేస్తూనే ఉంది. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు, బాధ్యత.  ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయడం అలవరుచుకోవలసిన అవసరం ఉంది.  పట్టణవాసులు విజ్ఞతతో వ్యవహరించి రేపు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిద్దాం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement