గూడూరు శాసనసభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌రావు పోటీ నుంచి వెనకడుగు వేయలేదు. రెబల్‌గా నామినేషన్ ఉపసంహరించుకుంటే తగిన గుర్తింపు ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా బుజ్జగించినా డోంట్‌కేర్ అన్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గూడూరు శాసనసభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌రావు పోటీ నుంచి వెనకడుగు వేయలేదు. రెబల్‌గా నామినేషన్ ఉపసంహరించుకుంటే తగిన గుర్తింపు ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా బుజ్జగించినా డోంట్‌కేర్ అన్నారు. టీడీపీ నేతల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన బరిలోనే నిలిచారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ నాయకుడు విజయమోహన్‌రెడ్డి తనకు టికెట్ రాకపోవడానికి కారకులని పరోక్షంగా తూర్పారబట్టారు.
గూడూరు టీడీపీ టికెట్ వ్యవహారంలో గత ఆర్నెల్లుగా అనేక ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌కు ఈసారి టికెట్ రాదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతూ వచ్చింది. జిల్లా పార్టీ సమీకరణల్లో పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చంద్రబాబు ముఖ్యుడు కాంట్రాక్టర్ గంగాప్రసాద్ తనను వ్యతిరేకించినా అధినేత ఆశీస్సులు తనకే దక్కుతాయని బల్లి ధీమాగా వ్యవహరిస్తూ వచ్చారు.
నాలుగు జాబితాల్లో తన పేరు కనిపించక పోయినా చివరి వరకు వేచి చూశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా రత్నం పరిస్థితి కూడా ఇదేలా ఊగిసలాడింది. అయితే జిల్లాలోని రెండు ఎస్‌సీ నియోజక వర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలిద్దరికీ టికెట్ ఎగ్గొడితే ఆ సామాజిక వర్గంలో దెబ్బతింటామనే ఆలోచనతో చంద్రబాబు చివరకు పరసాకు ఓకే చేశారు. పార్టీ జిల్లా ముఖ్యుల ఒత్తిడితో గూడూరులో కొత్త అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్న లతకు టికెట్ ఖరారు చేసి బల్లికి చెక్‌పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బల్లికి ఈ రకంగా టికెట్ నిరాకరించడం ఇది రెండో సారి. 2004 ఎన్నికల సమయంలో సిట్టింగ్‌ఎమ్మెల్యేగా ఉన్న దుర్గాప్రసాద్‌ను కాదని ఉక్కాల రాజేశ్వరమ్మకు టికెట్ ఇచ్చారు. తిరిగి 2009 ఎన్నికల్లో దుర్గాప్రసాద్ టికెట్ సాధించి గెలుపొందారు. పార్టీలో ఒక సామాజిక వర్గం నేతలకు తాను విధేయుడిగా లేననే కక్షతో తనను తొక్కేయాలని చంద్రబాబు వద్ద ప్రయత్నాలు చేయడాన్ని బల్లి ఈ సారి సీరియస్‌గా తీసుకున్నారు.
టికెట్ ఇవ్వకపోయినా తాను బరిలో ఉంటానంటూ టీడీపీ, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. ఆయన్ను చల్లబరచడం పెద్ద సమస్య కాదనే ధీమాతో పార్టీ హై కమాండ్ వ్యవహరించింది. జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యులు మంగళవారం ఆయన్ను శాంతింపచేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మీ వల్లే తనకు టికెట్ రాలేదని దుర్గా ప్రసాద్ వారిపై మండిపడ్డారని తెలిసింది. చివరి ప్రయత్నంగా చంద్రబాబు స్వయంగా దుర్గాప్రసాద్‌కు ఫోన్ చేసి పోటీ నుంచి విరమించుకోవాలని కోరారు. మంగళవారం చిత్తూరు జిల్లా సత్యవేడు పర్యటనకు వెళ్లడానికి తడకు వస్తున్న తనను కలవాలని సూచించారు. ఈ ప్రతిపాదనను దుర్గాప్రసాద్ తిరస్కరించి చంద్రబాబుకు ముఖం చాటేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా దుర్గాప్రసాద్ తన నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో టీడీపీ అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నలత ఆందోళనలో పడ్డారు. దుర్గాప్రసాద్ మద్దతుదారులు మాత్రం తాము గెలవలేక పోయినా జ్యోత్స్నలతను ఓడించే శక్తి తమకుందని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిణామంతో గూడూరు టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. కొందరు దుర్గాప్రసాద్ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. ఇంకొందరు నాయకులు పార్టీ అభ్యర్థి వెంటే ఉంటామని చెబుతున్నారు.