
హొసూరులో చిరంజీవి ప్రసంగం
కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని మతతత్వ పార్టీ బీజేపీకి ఓట్లు వేయవద్దని కేంద్రమంత్రి చిరంజీవి ఓటర్లను కోరారు.
హొసూరు: కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని మతతత్వ పార్టీ బీజేపీకి ఓట్లు వేయవద్దని కేంద్రమంత్రి చిరంజీవి ఓటర్లను కోరారు. తమిళనాడులోని కృష్ణగిరి లోకసభ నియోజకవర్గ పరిదిలోని హొసూరు, వేపనహళ్ళి శాసనసభ నియోజకవర్గాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హొసూరు గాంధీ విగ్రహం వద్ద అభిమానుద్దేశించి మాట్లాడారు. బీజేపిని గెలిపిస్తే దేశంలో అరాచకమే అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.
విభిన్న భాషలు, సంస్కృతులు, విభిన్న మతాలున్న ప్రాంతం హొసూరు మినీ ఇండియాగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకు పదవులే తప్ప ప్రజాప్రయోజనాలు తెలియదన్నారు. తమిళనాడు ప్రభుత్వం అందజేసే ఉచిత బియ్యం పథకం నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి అత్తిపల్లి మీదుగా ఆయన హొసూరుకు వచ్చారు. బాగలూరు, బేరికె, సూళగిరి, అత్తిముగంలలో పర్యటించారు.
చిరంజీవి తప్పుడు సమాచారం
హొసూరు రోడ్డు షోలో అభిమానులను చూసి చిరంజీవి రెచ్చిపోయారు. తన ప్రసంగంలో తప్పుడు వివరాలను ప్రజలకు చెప్పారు. రోడ్ల గురించి తెలిసీ తెలియని మాటలు మాట్లాడారు. 65 ఏళ్ళలో డీఎంకే, అన్నాడీఎంకే ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. హొగేనకల్ తాగునీటి ప్రాజెక్ట్, కష్ణా తాగునీటి ప్రాజెక్ట్ (తెలుగుగంగ) డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రానికి తీసుకొచ్చాయి. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని తాగు, సాగునీరు ప్రాజెక్ట్‌గా చిరంజీవి పేర్కొనడంతో ప్రజలు నవ్వుకున్నారు.