ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం


 ఆర్థికం

 మూడో ద్వైమాసిక విధాన సమీక్ష మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 4న ప్రకటించింది. రెపో రేటు (బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను 7.25 శాతం వద్ద కొనసాగించింది. దీనికి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కారణంగా చూపింది. అదే విధంగా రివర్స్ రెపో రేటు (బ్యాంకులు స్వల్పకాలానికి తనవద్ద ఉంచే నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు)ను కూడా 6.25 శాతానికే పరిమితం చేసింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్ - బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తం)ని కూడా 4 శాతంగానే ఉంచింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.6 శాతంగా ఉందని పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు లక్ష్యం 7.6 శాతంగా వెల్లడించింది. నాలుగో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సెప్టెంబరు 29న జరుగుతుంది.

 

 షియామీ మొబైల్ ఫోన్ ఆవిష్కరణ

 షియామీ ఆంధ్రప్రదేశ్‌లో తయారుచేసిన మొబైల్ ఫోన్ ‘రెడ్‌మి-2 ప్రైమ్’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఆగస్టు 10న ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీలో షియామీ ఫోన్లను తయారుచేశారు. చైనాకు చెందిన షియామీ సంస్థ.. ఇప్పటివరకు చైనా, బ్రెజిల్‌లో మాత్రమే ఈ ఫోన్లను తయారు చేస్తోంది. ఇకపై భారత్‌లో అమ్మే ప్రతి షియామీ ఫోన్‌ను ఈ దేశంలోనే తయారుచేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న షియామీ సంస్థ ఉపాధ్యక్షుడు హ్యూగోబర్ర ప్రకటించారు.

 

 బఫెట్ కంపెనీ భారీ ఒప్పందం

 విమానాల విడిభాగాల తయారీ సంస్థ ప్రెసిషన్ క్యాస్ట్‌పార్ట్స్‌ను వారెన్ బఫెట్‌కి చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే.. 37.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఈక్విటీ భాగం 32.64 బిలియన్ డాలర్లు కాగా మిగిలినది డెట్ రూపంలో ఉంటుంది. ప్రెసిషన్ క్యాస్ట్‌పార్ట్స్ షేరు ఆగస్టు 7న 193.88 డాలర్ల దగ్గర ట్రేడవగా బెర్క్‌షైర్ 21.2% ప్రీమియంతో షేరు ఒక్కింటికి 235 డాలర్లు ఆఫర్ చేసింది.

 

 జాతీయం

 జాతీయ చేనేత దినోత్సవం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. భారత చేనేత లోగోను కూడా ఆవిష్కరించారు. ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్వాతంత్య్రోద్యమంలో  ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం చేపట్టిన రోజుకు గుర్తుగా చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. చేనేతను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు, చేనేత కార్మికులకు సరైన ప్రతిఫలం దక్కేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. 2012-14 మధ్యకాలంలో చేనేత రంగంలో నైపుణ్యం ప్రదర్శించిన 72 మందికి ప్రధాని అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు అందజేశారు. వ్యవసాయం తర్వాత చేనేత రంగం అత్యధికంగా ఉపాధి కల్పిస్తోంది. దేశంలోని మొత్తం వస్త్ర వినియోగంలో 15 శాతం చేనేత రంగానికి చెందింది.

 

 వాయు కాలుష్యంతో పదేళ్లలో

 35 వేల మంది మృతి గత పది సంవత్సరాల్లో (2006-15) వాయు కాలుష్యం వల్ల 35,616 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 6న పార్లమెంటుకు తెలిపింది. ఈ కాలంలో ప్రతి సంవత్సరం 2.6 కోట్ల వాయు కాలుష్య కేసులు నమోదయ్యాయి. ఇటువంటి సమాచారాన్ని ప్రభుత్వం చాలా అరుదుగా అందజేస్తుంది. వాయు కాలుష్యం వల్ల మరణించిన వారి సంఖ్య(6,423) పశ్చిమబెంగాల్‌లో అధికంగా ఉంది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (3,768), ఉత్తరప్రదేశ్ (2,458), మధ్యప్రదేశ్ (2,069) ఉన్నాయి.

 

 మరణ శిక్ష రద్దు తీర్మానాన్ని

 ఆమోదించిన త్రిపుర అసెంబ్లీ మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ త్రిపుర శాసనసభ ఆగస్టు 7న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతుంది. మరణ శిక్ష రద్దుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302ను సవరించాలని, ఎంత తీవ్రమైన నేరానికైనా జీవిత ఖైదు విధించేలా చట్టాలను సవరించాలని కేంద్రాన్ని కోరింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తీర్మానాన్ని సమర్థిస్తూ ఎంతటి తీవ్రమైన నేరాలకైనా జీవించి ఉన్నంత వరకూ జైలు శిక్ష సరైనదని అభిప్రాయపడ్డారు.

 

 అంతర్జాతీయం

 మరో సూయజ్ కాలువను ప్రారంభించిన ఈజిప్టు ప్రఖ్యాత సూయజ్ కాలువకు సమాంతరంగా మరో కాలువను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్‌సిసీ ఆగస్టు 6న ప్రారంభించారు. కాలువ ప్రారంభ కార్యక్రమంలో భారత్ తరఫున కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. సంవత్సర కాలంలో నిర్మించిన ఈ కాలువకు 8.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 120 మైళ్ల కాలువను విస్తరించడంతో రెండు వైపులా రవాణాకు వీలవుతుంది. నౌకలు వేచిఉండే సమయం ఎనిమిది గంటలు తగ్గుతుంది. 2023 నాటికి వార్షికంగా 13.2 బిలియన్ల ఆదాయం సమకూరుతుంది. 1869 నవంబరు 29న సూయజ్ కాలువను అధికారికంగా ప్రారంభించారు. దీనివల్ల ఐరోపా నుంచి భారత్‌కు వెళ్లే నౌకల ప్రయాణం 7 వేల కిలోమీటర్లు తగ్గింది.

 

 కాబూల్ బాంబు పేలుళ్లలో 51 మంది మృతి

 అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆగస్టు 7న జరిగిన బాంబు పేలుళ్లలో 51 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. 2014 డిసెంబరులో నాటో మిషన్ తర్వాత జరిగిన అతిపెద్ద దుర్ఘటన ఇది. తాలిబన్ నేత ముల్లా ఉమర్ మరణించినట్లు ప్రకటించిన తర్వాత ఈ దాడులు జరుగుతున్నాయి. ఆత్మాహుతి మానవ బాంబు పోలీసు దుస్తుల్లో కాబూల్ పోలీసు అకాడమీలోకి చొరబడి తనను తాను పేల్చుకోవడంతో 27 మంది మరణించారు. అంతకు ముందు ట్రక్ బాంబు పేలిపోవడంతో మరికొందరు మృత్యువాతపడ్డారు.

 

 చైనా, తైవాన్‌లలో సౌడెలార్ తుఫాను

 సౌడెలార్ తుఫానుకు చైనా, తైవాన్‌లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ తుఫాను వల్ల ఆగస్టు 9 నాటికి చైనాలో 14 మంది, తైవాన్‌లో 10 మంది మరణించారు. వెన్‌చెంగ్ కౌంటీలో 24 గంటల్లో 645 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంత అధికంగా కురవడం గత 100 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇదే నగరంలో 1.58 మిలియన్ల మంది తుఫాను తాకిడికి గురయ్యారు. విద్యుత్తు, రహదారి వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

 

 జపాన్‌లో అణురియాక్టర్ ప్రారంభం

 ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత తొలిసారి దక్షిణ జపాన్‌లోని అణు రియాక్టర్‌ను జపాన్ ఆగస్టు11న తిరిగి ప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలతో అణువిద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించారు. 2011లో భూకంపం, సునామీ వల్ల ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించిన తర్వాత జపాన్‌లో అణువిద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది.

 

 నేపాల్‌లో కొత్త రాజ్యాంగ ఒప్పందం

 దేశ అంతర్గత సరిహద్దులను నిర్దేశించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై నేపాల్‌లోని నాలుగు రాజకీయ పార్టీలు ఆగస్టు 8న సంతకాలు చేశాయి. దేశాన్ని ఆరు ప్రావిన్సులలో విభజించే ఒప్పందాన్ని అంగీకరించాయి. ఈ ఆరు ప్రావిన్సులు భారత్‌తో సరిహద్దు కలిగి ఉన్నాయి. దేశాన్ని ఎనిమిది ప్రావిన్సులుగా విభజిస్తూ జూన్‌లో చరిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకున్నాయి. రాష్ట్రాల అంతర్గత సరిహద్దులను నిర్దేశించే అంశాలను ఫెడరల్ కమిషన్‌కు వదిలేశారు. ప్రస్తుత ఒప్పందంతో కమిషన్ సరిహద్దులను నిర్ణయించే అవసరం ఇక ఉండదు. ప్రస్తుత ఒప్పందంతో సమాఖ్య ఏర్పాటుకు ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ఆరు రాష్ట్రాలకు పేర్లు నిర్ణయించాల్సి ఉంది.

 

 మొజాంబిక్ అధ్యక్షుడి భారత పర్యటన

 మొజాంబక్ అధ్యక్షుడు ఫిలిప్ జాసింతో న్యూసీ భారత పర్యటనలో భాగంగా ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మొజాంబిక్‌లో హైడ్రోకార్బన్స్, ఖనిజాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టేందుకు ఆ దేశం ప్రోత్సాహకర పరిస్థితులు కల్పిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మొజాంబిక్‌లో ఉన్న సహజ వాయువు, బొగ్గు, ఇతర ఖనిజాలు భారత్ వృద్ధిలో ప్రధానమైన వనరులుగా ప్రధాని పేర్కొన్నారు. మొజాంబిక్ రాజధాని మపుటోలో భారత రుణంతో చేపడుతున్న విద్యుత్తు సరఫరా ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. వ్యవసాయం, ఆహార భద్రత రంగాల అభివృద్ధికి పూర్తి సహాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

 

 సైన్స్ అండ్ టెక్నాలజీ

 అంగారకుడు, చంద్రుడిపైకి నాసా డ్రోన్లు? అంగారక గ్రహం, చంద్రుడు, వంటి వాటిపై ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న ప్రదేశాల గుట్టు తేల్చేందుకు డ్రోన్లను ప్రయోగించాలని నాసా భావిస్తోంది. అంగారకుడిపై పెద్దపెద్ద బిలాల వద్ద చీకటి ప్రదేశాలు ఉన్నాయి. చంద్రుడు, గ్రహశకలాలపై కూడా ఇలాంటి చీకటి ప్రాంతాలున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ప్రయోగించిన రోవర్లు ఇక్కడ దిగలేదు. ఇప్పుడు ప్రత్యేక డ్రోన్లను వాటిపైకి పంపేందుకు నాసా సిద్ధమవుతోంది.

 

 ఇస్రో టైటానియం ప్లాంట్ ప్రారంభం

 అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్లు, ఉపగ్రహాలు, రక్షణ పరికరాల తయారీలో వినియోగించే టైటానియం స్పాంజ్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటు ఆగస్టు 10 నుంచి వాణిజ్య స్థాయిలో పని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా కేరళలోని చవరాలో ఇస్రో ఈ ప్లాంటును ఏర్పాటు చేసింది. తమకు ఏటా దాదాపు 300 టన్నుల టైటానియం స్పాంజ్ అవసరం ఉంటుందని వెల్లడించింది.

 

 రాష్ట్రీయం

  ‘గివ్ ఇట్ అప్’లో యూపీ మొదటి స్థానం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని.. వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమంలో దేశంలో తెలంగాణ 13వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘గివ్ ఇట్ అప్’లో 2.45 లక్షల మంది రాయితీని వదులుకోవడంతో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, మహారాష్ట్రలో 2.26 లక్షల మంది గ్యాస్ రాయితీ వదులుకున్నట్లు తెలిపింది.

 

 ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఒక యువకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తిరుపతిలో ఆగస్టు 8న కాంగ్రెస్ నిర్వహించిన పోరాట సభలో బీఎంకే కోటి (41) అనే యువకుడు ఒంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన ఆ యువకుడు చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కోటి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.

 

 ఏపీలో ‘మీ ఇంటికి - మీ భూమి’

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 10న ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లాలో శంకరం గ్రామంలో ప్రారంభించారు. ఇది ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. భూమి వివరాలు సవరించుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం కింద ఆధార్ నంబర్, సర్వే నంబర్‌లలో సవరణల కోసం బహిరంగంగా దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామసభలు నిర్వహించి సమాచారం తెలియజేస్తారు. గ్రామసభలో విలేజ్ మ్యాప్‌ను ప్రదర్శించి, వివరిస్తారు. సభకు రెండు రోజుల ముందు పట్టాదారుల వివరాలను గ్రామంలో ప్రదర్శిస్తారు. రాష్ట్రంలో 2.24 కోట్ల సర్వే నంబర్లుండగా, 72 లక్షల మంది పట్టాదారులున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

 

 క్రీడలు

 రిటైర్మెంట్ ప్రకటించిన క్లార్క్ ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (34)అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నట్లు ఆగస్టు 8న ప్రకటించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ అనంతరం వైదొలుగుతున్నట్లు తెలిపాడు. 2011 నుంచి ఆయన ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌లో 114 టెస్ట్‌లు ఆడిన క్లార్క్ 8628 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి.

 

 ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్

 ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 5 స్వర్ణ పతకాలు లభించాయి. దక్షిణ కొరియాలోని సువన్‌లో ఆగస్టు 10న ముగిసిన పోటీల్లో 5 స్వర్ణ పతకాలతోపాటు 5 రజత, ఏడు కాంస్య పతకాలు దక్కాయి. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు ఎన్.కృష్ణ తేజ (అండర్-18 ఓపెన్‌లో) స్వర్ణ పతకం సాధించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top