భారతదేశం మధ్య నుంచి పోయే రేఖ?

భారతదేశం మధ్య నుంచి పోయే రేఖ? - Sakshi


భూగోళశాస్త్రం

సౌరకుటుంబం - భూమి


సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ తిరిగే ఎనిమిది గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, లఘు గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు మొదలైనవాటన్నింటినీ కలిపి సౌరకుటుంబంగా పిలుస్తారు. సూర్యునితోపాటు విశ్వంలో ఉన్న మిలియన్ల కొద్ది నక్షత్రాల కూటమిని ‘గెలాక్సీ’ అంటారు. గెలాక్సీల సముదాయాన్ని పాలపుంత (పాలవెల్లి) లేదా ఆకాశగంగ అంటారు. నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశకాలు. సూర్యగోళంలో కేంద్రక సంలీనం ద్వారా అణు సంఘటనం జరిగి నిరంతరంగా ఉష్ణశక్తి విడుదలవుతుంది. ఈ శక్తిని సౌర వికిరణం (సోలార్ రేడియేషన్) అంటారు. సూర్యుని ఉపరితలంపై 6000నిఇ, కేంద్రంలో 10 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది.

 

సౌర కుటుంబం ఆవిర్భావం గురించి తెలిపే ముఖ్యమైన సిద్ధాంతాలు:


నీహారిక (నెబ్యులా) పరికల్పన: ఇమాన్యువల్ కాంట్ ప్రతిపాదించారు.

గ్రహకాల పరికల్పన: చాంబర్లీన్, మౌల్టన్ ప్రతిపాదించారు.

విశ్వ ఆవిర్భావ (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతం: జార్జెస్ లిమిటియర్ ప్రతిపాదించారు.

 ఈ సిద్ధాంతాలు గ్రహాల పుట్టుక గురించి వివరించాయి.

 

గ్రహాలు (Planets)

సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో గ్రహాలు పరిభ్రమిస్తాయి. ఇవి స్వయం ప్రకాశకాలు కావు. సూర్యకాంతి వీటిపై పడి పరావర్తనం చెందడం వల్ల ప్రకాశిస్తాయి. సౌరకుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి.

1. బుధుడు (Mercury), 2. శుక్రుడు (Venus), 3. భూమి (Earth), 4. కుజుడు లేదా అంగారకుడు (క్చటట), 5. గురువు లేదా బృహస్పతి (Jupiter), 6. శని (Saturn), 7. వరుణుడు (Uranus), 8. ఇంద్రుడు (Neptune) (2006 ఆగస్టు 24 వరకు ‘యముడు (Pluto)’ తొమ్మిదో గ్రహంగా ఉండేది. తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ (ఐఏయూ) దీన్ని తొలగించింది.)

 

ఉపగ్రహాలు (శాటిలైట్స్): గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళాలను ఉపగ్రహాలు అంటారు. ఇవి కూడా స్వయం ప్రకాశకాలు కావు. గ్రహాల నుంచి పరావర్తనం చెందిన సూర్యకాంతి వల్ల ఇవి ప్రకాశిస్తాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. భూమి, చంద్రుని మధ్య దూరం          3,84,365 కి.మీ. ‘గానిమెడ్’ ఉపగ్రహాలన్నింటిలో పెద్దది. ఇది బృహస్పతి ఉపగ్రహం. శని ఉపగ్రహమైన ‘టైటాన్’ రెండో అతి పెద్ద ఉపగ్రహం.

 

చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి 27 1/2 గంటలు పడుతుంది. చంద్రుడి ఆత్మ భ్రమణానికి  (తన చుట్టూ తాను తిరగడం) కూడా అంతే సమయం పడుతుంది. అందువల్ల మనం ఎప్పుడూ చంద్రుడి ఒక వైపును మాత్రమే చూడగలుగుతాం. చంద్రుడిని ‘శిలాజ గ్రహం’ అని కూడా పిలుస్తారు.



భూమి

భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దగా ఉంటుంది.

 

సూర్యుడి నుంచి భూమికి సగటు దూరం 149.5 మిలియన్ కి.మీ. ఇది మారుతూ ఉంటుంది. జూలై 4న 152 మి.కి.మీ.  (అపహేళీ), జనవరి 3న 147 మి.కి.మీ.(పరిహేళీ) ఉంటుంది. సూర్యుని నుంచి భూమి మూడో స్థానంలో ఉంటుంది. పరిమాణం దృష్ట్యా గ్రహాల్లో ఐదవది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. భూమి వైపు నిరంతరం ప్రసరించే సూర్యశక్తిని ‘సూర్యపుటం’ అంటారు.

 

భూమి సగటున ఒక చ.సెం.మీ. ఉపరితల విస్తీర్ణానికి రెండు కేలరీల శక్తికి సమానమైన సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. దీన్నే ‘సౌరస్థిరాంకం’ అంటారు. భూమి గ్రహిస్తున్న ఈ శక్తిలో పరావర్తనం చెందుతున్న శక్తి శాతాన్ని ‘ఆల్బిడో’ అంటారు. భూమి ఆల్బిడో 30 శాతం. సూర్యపుటం వేసవిలో ఎక్కువగా, చలికాలంలో తక్కువగా ఉంటుంది. భూమి సూర్యపుటం ద్వారా గ్రహిస్తున్న శక్తినంతా తిరిగి దీర్ఘ తరంగాలుగా విశ్వంలోకి పంపిస్తుంది. ఈ ప్రక్రియను ‘భూ వికిరణం’ అంటారు. వాతావరణంలోని  కింది పొరలు దీని ద్వారానే వేడెక్కుతాయి.

 

భూ చలనాలు - ఫలితాలు

 

భూభ్రమణం: భూమి తన అక్షంపై తన చుట్టూ తాను పశ్చిమం నుంచి తూర్పునకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది.  దీన్ని ‘భూభ్రమణం’ అంటారు. భూ ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను ‘అక్షం’ అంటారు.

 

భూమి ఒకసారి తనచుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు (సుమారు ఒక రోజు) పడుతుంది. భూ భ్రమణం వల్ల రాత్రి, పగలు ఏర్పడతాయి. సముద్రంలో సంభవించే పోటుపాట్లు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి.

 

భూ పరిభ్రమణం: భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ‘భూ పరిభ్రమణం’ అంటారు. భూ పరిభ్రమణానికి 365 1/4 రోజులు (ఒక సంవత్సరం) పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల పగలు, రాత్రి వేళల్లో తేడాలు, రుతువులు ఏర్పడుతున్నాయి.

 

భూమి తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీల్లో భూ మధ్య రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ఆ రెండు రోజుల్లో రాత్రి, పగళ్లు సమానంగా ఉంటాయి. వీటిని ‘విషవత్తులు’ అంటారు. అదేవిధంగా జూన్ 21న కర్కటరేఖపై, డిసెంబర్ 22న మకరరేఖపై సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ఈ రెండు రేఖలను ‘ఆయన రేఖలు’ అంటారు.

 

గ్రహణాలు

సూర్యగ్రహణం: సూర్యుడు కనపడకుండా భూమికి చంద్రుడు అడ్డువచ్చినప్పుడు ‘సూర్యగ్రహణం’ ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజుల్లోనే సంభవిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వస్తాయి.

 చంద్రగ్రహణం: సూర్య కిరణాలు చంద్రునిపై పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు ‘చంద్రగ్రహణం’ ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజుల్లో సంభవిస్తుంది (అన్ని పౌర్ణమిల్లో ఏర్పడదు). సూర్యుడు, భూమి, చంద్రుడు వరుసగా ఒకే సరళరేఖపై ఉంటాయి.

 

 

బుధుడు: సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. అత్యంత వేగంగా తిరుగుతుంది. అతి చిన్న గ్రహం. దీనికి ఉపగ్రహాలు లేవు.

శుక్రుడు: అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. దీన్ని ఉదయతార, వేగుచుక్క, సాయంత్రపు తార అంటారు. దీనికి ఉపగ్రహాలు లేవు. తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. భూమికి అత్యంత దగ్గరగా ఉంటుంది. అత్యధిక పగటికాలం, వేడి ఉండే గ్రహం.

భూమి: ఎత్తై పర్వత ప్రాంతాలున్న గ్రహం. అంతర గ్రహాల్లో పెద్దది. నీలి వర్ణంలో ఉంటుంది. నీరున్న ఏకైక గ్రహం. అత్యధిక సాంద్రత కలిగి ఉంది.

అంగారకుడు: ఎరుపు వర్ణంలో ఉంటుంది. అరుణ గ్రహం అంటారు.

గురుడు: అతి పెద్ద గ్రహం. అతి ఎక్కువ ఉపగ్రహాలున్నాయి. అత్యల్ప పగటి కాలం ఉంటుంది.

శని: అత్యల్ప సాంద్రత ఉన్న గ్రహం. రెండో పెద్ద గ్రహం. సుందర వలయాలుంటాయి. అందమైన గ్రహం.

వరుణుడు: శుక్రుడిలా తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. టెలిస్కోప్‌తో కనుగొన్న మొదటి గ్రహం.

ఇంద్రుడు: శీతల గ్రహం. సూర్యుడికి దూరంగా ఉంది.

 

అక్షాంశాలు - రేఖాంశాలు

భూమిపైనున్న ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించడానికి వీలుగా భూ గోళంపై ఉత్తర చివరన ఒక బిందువును, దక్షిణ చివరన ఒక బిందువును నిర్దారించారు. ఈ ఉత్తర, దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూగోళంపై గీసిన వృత్తాన్ని ‘భూ మధ్య రేఖ’ అంటారు. దీన్నే 0ని అక్షాంశమని పిలుస్తారు. దీనికి ఉత్తరాన ఉన్న అర్ధ భాగాన్ని ఉత్తరార్ధ గోళమని, దక్షిణాన ఉన్న అర్ధ భాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు.

 

భూమధ్య రేఖకు సమాంతరంగా ఒక డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు గీసిన వృత్తాలను అక్షాంశ రేఖలంటారు. వీటినే సమాంతర రేఖలని పిలుస్తారు. ఉత్తరార్ధ గోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధ గోళంలో 90 అక్షాంశాలుంటాయి. భూ మధ్యరేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలుంటాయి. 231/2ని ఉత్తర అక్షాంశాన్ని ‘కర్కటరేఖ’ అని, 231/2ని దక్షిణ అక్షాంశాన్ని ‘మకరరేఖ’ అని, 661/2ని డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ‘ఆర్కిటిక్ వలయం’ అని, 661/2ని దక్షిణ అక్షాంశాన్ని ‘అంటార్కిటిక్ వలయం’ అని పిలుస్తారు.

ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ మధ్య రేఖను ఖండిస్తూ భూమిచుట్టూ లంబంగా గీసిన రేఖలను ‘రేఖాంశాలు’ అంటారు.

 

ఇవి ఒక డిగ్రీ అంతరంతో మొత్తం 360 ఉంటాయి. లండన్‌లోని గ్రీనిచ్ మీదుగా వెళుతున్న రేఖాంశాన్ని 0ని రేఖాంశంగా గుర్తించారు. దీన్ని గ్రీనిచ్ రేఖాంశంగా పిలుస్తారు. ఈ ప్రధాన రేఖాంశానికి తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలుంటాయి. 180ని తూర్పు, పశ్చిమ రేఖాంశంగా మాత్రం ఒకటే ఉంటుంది. ఈ రేఖను ‘అంతర్జాతీయ దినరేఖ’  అంటారు. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా పోతుంది. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి రేఖాంశాలను ‘మధ్యాహ్నరేఖలు’ అని కూడా అంటారు.అక్షాంశ, రేఖాంశాలు రెండూ ఊహారేఖలే. వీటి సహాయంతో భూగోళంపై ఒక ప్రదేశం ఉనికిని సులభంగా గుర్తించవచ్చు.

 

భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ రేఖాంశం దూరం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. గ్రీనిచ్ రేఖపై ఉండే కాలాన్ని ప్రామాణిక కాలమానంగా (జీఎస్‌టీ) గుర్తిస్తున్నారు. వివిధ దేశాల్లో ప్రజల సౌకర్యార్థం వివిధ స్థానిక ప్రామాణిక కాలాలను నిర్ణయించారు. భారతదేశం మధ్య నుంచి పోయే 821/2ని తూర్పు రేఖాంశాన్ని దేశంలో కాల నిర్ణయానికి ప్రామాణికంగా తీసుకున్నారు. భారత ప్రామాణిక కాలం జీఎస్‌టీకి 51/2 గంటలు ముందుంటుంది (821/2నిణ 4 నిమిషాలు = 330 నిమిషాలు = 5.30 గంటలు).

 

మాదిరి ప్రశ్నలు

 

1.    నెప్ట్యూన్‌పై వాతావరణం దేనికి సమానంగా ఉంటుంది?

     1) శని        2) యురేనస్

     3) గురుడు    4) అంగారకుడు

 

2.    భారతదేశంలోని ఏ నగరం ద్వారా 821/2ని తూర్పు రేఖాంశం వెళుతోంది?

     1) న్యూఢిల్లీ    2) అహ్మదాబాద్

     3) అలహాబాద్    4) ముంబయి

 

3.    భూభ్రమణ వేగం ఎంత (కి.మీ./గం.)?

     1) 1510    2) 1770

     3) 1610    4) 1870

 

4.    భూమికి సూర్యుని తర్వాత అతి దగ్గరగా ఉండే నక్షత్రం?

     1) ప్రాక్సిమాసెంటారీ 2) ఆల్ఫాసెంటారీ

     3) బెటల్‌గక్స్    4) ఆండ్రోమెడా

 

5.    కిందివాటిలో భారతదేశం మధ్య నుంచి పోయే రేఖ?

     1) భూమధ్యరేఖ    2) గ్రీనిచ్ రేఖ

     3) మకరరేఖ    4) కర్కటక రేఖ

 

6.    భూమధ్య రేఖపై సూర్య కిరణాలు లంబంగా పడే రోజు?

     1) డిసెంబర్ 22    2) సెప్టెంబర్ 23

     3) జూన్ 21    4) మార్చి 20

 

7.    కిందివాటిలో కాలాన్ని బట్టి వీచే పవనాలు?

     1) వ్యాపార పవనాలు

     2) రుతు పవనాలు    

     3) స్థానిక పవనాలు

     4) పశ్చిమ పవనాలు

 

8.    పవనాలు, సముద్ర ప్రవాహాల మార్గాల్లో మార్పు సంభవించడానికి కారణం?

     1) భూ భ్రమణం    

     2) భూ పరిభ్రమణం

     3) గ్రహణాలు    4) అక్షాంశ, రేఖాంశాలు

 

9.    కిందివాటిలో ‘కవల గ్రహాలు’ ఏవి?

     1) భూమి, అంగారకుడు

     2) భూమి, శుక్రుడు

     3) యురేనస్, శని    4) శని, నెప్ట్యూన్

 

10.    వేసవిలో 0ని అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎన్ని గంటలు ఉంటుంది?

     1) 24     2) 12     3) 18     4) 6

 

11.    వాతావరణ కింది పొరలు దేని వల్ల వేడెక్కుతాయి?

     1) సౌర వికిరణం 2) సూర్యపుటం

     3) భూ వికిరణం     4) సౌర స్థిరాంకం

 

12.    భూ ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత ఎంత?

     1) 6ని సెల్సియస్    2) 10ని సెల్సియస్

     3) 13ని సెల్సియస్    4) 15ని సెల్సియస్

 

13.    భూమి నుంచి 1000 మీటర్ల ఎత్తుకు వెళితే ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది?

     1) 6ని    2) 1ని    3) 8ని    4) 2ని

 

14.    కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.

     1) లితోస్-శిల 2) ఆట్‌మోస్ - ఆవిరి

     3) హదర్ - నీరు    4) పైవన్నీ

 

సమాధానాలు

     1) 2;    2) 3;    3) 3;    4) 1;

     5) 4;    6) 2;    7) 2;    8) 1;

     9) 2;    10) 2;    11) 3;    12) 3;

     13) 1;    14) 4.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top