వైరస్‌ను క్రియారహితం చేయాలంటే..

వైరస్‌ను క్రియారహితం చేయాలంటే..


రేబిస్‌ వ్యాధి లీసా వైరస్‌ Lyssa virus వల్ల కలుగుతుంది. ఈ రేబిస్‌ వైరస్‌ కలిగిన కుక్కలు, గబ్బిలాలు, కోతులు, పిల్లులు మానవుడిని కరిచినప్పుడు, గీరినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది మెదడులోని నాడీ కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఫలితంగా పక్షవాతం వస్తుంది. నీరంటే భయపడటం (హైడ్రోఫోబియా), మూర్చ, ఉద్రేకపడటం, భయపడటం రేబిస్‌ లక్షణాలు. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 24 వేల నుంచి 60 వేల మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 95 శాతం మరణాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే ఉంటున్నాయి. అమెరికాలో రేబిస్‌ వ్యాధి ఎక్కువగా గబ్బిలాల వల్ల వ్యాప్తి చెందుతుంటే భారత్‌లో 99 శాతం కుక్కల ద్వారా వ్యాప్తి చెందుతోంది.



 సంప్రదాయ పద్ధతిలో రేబిస్‌ టీకా తయారీ

సంప్రదాయ పద్ధతిలో క్షీణింపజేసిన వ్యాధికారక వైరస్‌లను ఉపయోగించి టీకాను తయారుచేస్తారు. రేబిస్‌ వైరస్‌ను తీసుకొని క్షీణింపజేసి, నిర్వీర్యం చేసిన అనంతరం వ్యాక్సిన్‌గా ఉపయోగిస్తారు. రేబిస్‌ టీకా తయారీ మూడు దశల్లో ఉంటుంది. అవి..



Virus Attenuation

వైరస్‌ ఎటెన్యూషన్‌ అంటే వైరస్‌ను క్షీణింపచేయడం. దీనికోసం ఆఫ్రికా కోతి మూత్రపిండ కణాలను వాడతారు. వీటిని వెరో కణాలు అంటారు. రేబిస్‌ వైరస్‌ను కణజాల వర్థనం ద్వారా అభివృద్ధి చేసిన వెరో కణాల పైకి విడుదల చేస్తారు. ఈ కణాల్లో రేబిస్‌ వైరస్‌ అభివృద్ధి చెందుతుంది. అనేక తరాల తర్వాత వైరస్‌ క్రమంగా బలహీనపడుతుంది.



Virus inactivation

వైరస్‌ ఇనాక్టివేషన్‌ అంటే వైరస్‌ను క్రియారహితంగా మార్చడం. మొదటి దశలో క్షీణింపజేసిన వైరస్‌ను 0.45 మైక్రాన్‌ పొర ద్వారా వడకడతారు. దీన్నే వైరల్‌ క్లారిఫికేషన్‌ అంటారు. తర్వాత అల్ట్రాఫిల్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా గాఢత చెందిస్తారు. చివరగా బీ ప్రొపియో లాక్టోస్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి రేబిస్‌ వైరస్‌ను క్రియారహితం చేస్తారు (అంటే చంపేయడం). ఆ తర్వాత ఇంకా çసజీవంగా మిగిలి ఉన్న కొన్ని వైరస్‌లను వేరు చేస్తారు.



బల్క్‌ వ్యాక్సిన్‌

క్రియారహితం చేసిన వైరస్‌ను శుద్ధి చేస్తారు. తర్వాత కొన్ని పరీక్షలు నిర్వహించి అధిక మొత్తంలో వ్యాక్సిన్‌ను తయారుచేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను అనుసరించి ప్రతి మిల్లీ లీటర్‌కు 2.5 ఐయూ (ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌) మోతాదులో వైరస్‌ ఉండాలి.



హెపటైటిస్‌–బి టీకా

హెపటైటిస్‌–బి అనేది కాలేయాన్ని నాశనం చేసి లివర్‌ సిర్రోసిస్, లివర్‌ కేన్సర్‌ను కలగజేసే ప్రమాదకర వైరస్‌. ఇది జాండిస్‌ను కలిగించి కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది.



వ్యాధి లక్షణాలు: జ్వరం, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండటం, వాంతులు, అలసట, ఆకలి లేకపోవడం, పసిరికలు (కళ్లు  పసుపుగా ఉండటం), తేలికైన బూడిదరంగు మలం.



వ్యాప్తి: ఈ వ్యాధి కలిగిన వ్యక్తుల రక్తం ఇతర వ్యక్తులకు అంటడం, బిడ్డ పుట్టే సమయంలో, రక్షణలేని సంభోగం వల్ల; క్రిమిరహితం చేయని నీడిల్‌ వాడటం వల్ల; పళ్లు తోమే బ్రష్‌లను, రేజర్లను ఇతరులతో పంచుకొని వాడటం వల్ల వ్యాప్తి చెందుతుంది.



వ్యాధి తీవ్రత: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఏటా 6.86 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.



నివారణ: హెపటైటిస్‌–బి టీకా ఇవ్వడం ద్వారా నివారించొచ్చు. భారత్‌లో ఆధునిక రీకాంబినెంట్‌ డీఎన్‌ఏ టెక్నాలజీ పద్ధతిలో తయారుచేస్తున్న ఏకైక వ్యాక్సిన్‌ హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌.



ఆధునిక పద్ధతిలో వ్యాక్సిన్‌ తయారీ

ఆధునిక పద్ధతిలో రీ కాంబినెంట్‌ డీఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి హెపటైటిస్‌–బి  వ్యాక్సిన్‌ను తయారుచేస్తారు. ఈ పద్ధతిలో హెపటైటిస్‌ వైరస్‌ నుంచి వ్యాధికారక డీఎన్‌ఏను సేకరించి ప్లాస్మిడ్‌ అనే వాహకం ద్వారా ఈస్ట్‌ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెడతారు. ఈ బ్యాక్టీరియాను పోషకయానకంలో అభివృద్ధి చేసినప్పుడు ఏఆ అజ జన్యువు ఉన్న ప్రొటీన్‌ను విడుదల చేస్తుంది. ఈ ప్రొటీన్‌ను శుద్ధిచేసి వ్యాక్సిన్‌లా వాడతారు. డాక్టర్‌ బారుచ్‌ బ్లంబర్గ్‌ తొలిసారిగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.



వ్యాక్సిన్‌ తయారీలో దశలు..

1. ఏఆ అజ జన్యువును వైరస్‌ నుంచి వేరు చేయడం.

2. వైరల్‌ డీఎన్‌ఏను ఈస్ట్‌ బ్యాక్టీరియాలో ప్రవేశపెట్టడం.

3. ఈస్ట్‌ బ్యాక్టీరియాను అభివృద్ధి చెందించడం.




∙ఏఆ అజ జన్యువును వైరస్‌ నుంచి వేరు చేయడం: హెపటైటిస్‌–బి వైరస్‌ శరీరంపై ఏఆ అజ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే డీఎన్‌ఏ/ఆర్‌ఎన్‌ఏను వైరస్‌ నుంచి వేరు చేస్తారు. దీనికోసం రిస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేజ్‌ అనే ఎంజైమ్‌ను వాడతారు.



∙వైరల్‌ డీఎన్‌ఏను ఈస్ట్‌ బ్యాక్టీరియాలో ప్రవేశపెట్టడం: మొదటి దశలో వేరుచేసిన ఏఆ అజ అనే ప్రొటీన్‌ డీఎన్‌ఏను ఈస్ట్‌ బ్యాక్టీరియా డీఎన్‌ఏలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియలో ప్లాస్మిడ్‌ అనే వాహకాన్ని వాడతారు. ప్లాస్మిడ్‌ సహాయంతో డీఎన్‌ఏను ఈస్ట్‌ బ్యాక్టీరియాలో ప్రవేశపెడతారు. ఇప్పుడు ఈస్ట్‌ డీఎన్‌ఏను రీకాంబినెంట్‌ డీఎన్‌ఏ అంటారు. ఈ ప్రక్రియలో ఆర్‌–డీఎన్‌ఏ పరిజ్ఞానాన్ని వాడతారు.



3. ఈస్ట్‌ బ్యాక్టీరియాను అభివృద్ధి చేయడం: హెపటైటిస్‌ వైరస్‌ డీఎన్‌ఏను కలిగి ఉన్న ఈస్ట్‌ బ్యాక్టీరియాను పోషకయానకంలో అభివృద్ధి చేస్తారు. పోషకయానకం pఏ 7.3 నుంచి 7.5 వరకు ఉండేలా, ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఈ బ్యాక్టీరియా 2–3 రోజుల్లో  బాగా అభివృద్ధి చెంది ఏఆ అజ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది (ఎందుకంటే వైరస్‌ ఏఆ అజ జన్యువును కలిగి ఉంది).



∙వ్యాక్సిన్‌ను తయారుచేయడం: ఈస్ట్‌ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన ఏఆ అజ ప్రొటీన్‌ను సేకరించి వివిధ రసాయనాలతో శుద్ధి చేస్తారు. తర్వాత శుద్ధి చేసిన ఏఆ అజ స్వచ్ఛతను, సామర్థ్యాన్ని పరీక్షించి ఫైనల్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తారు.



డీపీటీ టీకా

డీపీటీ టీకాను డిఫ్తీరియా (కంఠసర్పి), పెర్టుసిస్‌ (కోరింత దగ్గు), టెటానస్‌ (ధనుర్వాతం) అనే మూడు బ్యాక్టీరియల్‌ వ్యాధుల నివారణకు వాడతారు. దీన్ని ఆరు వారాలు, పది వారాలు, 14 వారాల వయసు పిల్లలకు వేస్తారు. ఈ టీకా తయారీలో ముందుగా మూడు రకాల టీకాలను విడివిడిగా సంప్రదాయ పద్ధతిలో తయారుచేసి, తర్వాత తగిన మోతాదులో వాటిని కలుపుతారు. మూడు రకాల వ్యాధులను నివారిస్తున్నందున డీపీటీని ట్రిపుల్‌ యాంటీజెన్‌ అని కూడా అంటారు. సంప్రదాయ పద్ధతిలో డీపీటీ టీకా తయారీలో కింది దశలు ఉంటాయి.



1. డిఫ్తీరియా (కంఠసర్పి) ట్యాక్సాయిడ్‌ తయారీ

2. పెర్టుసిస్‌ (కోరింత దగ్గు) యాంటీజెన్స్‌ తయారీ

3. టెటానస్‌ (ధనుర్వాతం) ట్యాక్సాయిడ్‌  తయారీ

4. పై మూడూ కలపడం



 (డీపీటీ వ్యాక్సిన్‌  తయారీ)

డిఫ్తీరియా ట్యాక్సాయిడ్‌ తయారీ

డిఫ్తీరియా.. కొరినే బ్యాక్టీరియా డిఫ్తీరియే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది డిఫ్తీరియా ట్యాక్సిన్‌ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ ట్యాక్సిన్‌ను ఫార్మలిన్‌ అనే ద్రావణం ద్వారా నిర్వీర్యం చేసినప్పుడు డిఫ్తీరియా ట్యాక్సాయిడ్‌ తయారవుతుంది.



పెర్టుసిస్‌ యాంటీజెన్స్‌ తయారీ

పెర్టుసిస్‌ (కోరింత దగ్గు).. బోర్డటెల్లా పెర్టు్టసిస్‌ అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. ఈ బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసి చంపేస్తారు. చనిపోయిన బ్యాక్టీరియాను, వాటిపై ఉన్న ప్రతిజనకాలను సేకరించి శుద్ధి చేస్తారు. ఈ విధంగా తయారుచేసిన వ్యాక్సిన్‌ను హోల్‌ సెల్‌ వ్యాక్సిన్‌ అంటారు (చనిపోయిన బ్యాక్టీరియా కణాలు మాత్రమే ఉంటాయి). బ్యాక్టీరియా కణంపై ఉన్న ప్రతిజనకాలతో వ్యాక్సిన్‌ను తయారుచేస్తే దాన్ని ఎసెల్యులర్‌ వ్యాక్సిన్‌ అంటారు. తయారుచేసిన పెర్టుసిస్‌ ట్యాక్సాయిడ్‌లో గాఢత 4 ఐయూ కంటే ఎక్కువ ఉండాలి.



టెటానస్‌ ట్యాక్సాయిడ్‌ తయారీ

టెటానస్‌ (ధనుర్వాతం) ‘క్లాస్ట్రీడియం టెటాని’ అనే బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. ఈ బ్యాక్టీరియా టెటానోపాస్మిన్‌ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ ట్యాక్సిన్‌ను ఫార్మలిన్‌ అనే రసాయన ప్రభావానికి గురిచేయడం వల్ల విషపూరిత స్వభావాన్ని కోల్పోయి టెటానస్‌ ట్యాక్సాయిడ్‌గా మారుతుంది.



డీపీటీ వ్యాక్సిన్‌ తయారీ: డిఫ్తీరియా ట్యాక్సాయిడ్, పెర్టుసిస్‌ యాంటీజెన్స్, టెటానస్‌ ట్యాక్సాయిడ్‌లను తగిన మిశ్రమంలో కలపడం ద్వారా డీపీటీ వ్యాక్సిన్‌ తయారవుతుంది. అల్యూమినియం ఫాస్ఫేట్‌ను అబ్జార్బెంట్‌ (అధిశోషణ)గా వాడతారు. తయారైన డీపీటీ వ్యాక్సిన్‌ను శుద్ధిచేసి సురక్షితంగా వినియోగించాలి.



ప్రవీణ్‌ దత్తు

లెక్చరర్‌ ఇన్‌  జువాలజీ,

ఎల్‌.హెచ్‌.ఆర్‌. ్రప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top