‘రాజన్న రాజ్యం’ లక్ష్యంగా...

YS Rajasekhara Reddy Birth Anniversary  Special Editorial - Sakshi

ప్రకృతి సహకరిస్తుందో లేదో... పంట సరిగా పండుతుందో లేదో...పండాక గిట్టుబాటవుతుందో కాదో తెలియని అయోమయావస్థలో నిత్యం కష్టాల సేద్యం చేస్తున్నా, చినుకు పడి నేలంతా చిగురించాలన్న ఆశ, ధ్యాస తప్ప మరేమీ లేని రైతన్న రుణం తీర్చుకోలేనిది. అలాంటి రైతు కంట కన్నీరు రాకూడదని, అతడు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తపించేవారు. ఆయన వారసుడిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అఖండ మెజారిటీతో నెలరోజులక్రితం అధికార బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా రైతు సంక్షేమానికి పాటుబడే సంప్రదాయాన్ని చిత్తశుద్ధితో కొన సాగిస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం జరిగిన రైతు దినోత్సవం ఆయన సత్సంకల్పానికి అద్దం పట్టింది. రైతులకు సున్నా వడ్డీకే రుణాలు అందించే పథకం, పంట రుణాలకింద ఈసారి రూ. 84,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించి అమలు ప్రారంభించడం, పాదయాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ పగటిపూటే ఇవ్వడం, ఉచిత పంట లబీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు తదితరాలన్నీ ఆ కోవలోనివే. పైగా రైతులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని పెట్టుబడి సాయంగా వైఎస్సార్‌ భరోసా పథకం కింద అందించదలచిన వార్షిక సాయం రూ. 12,500 మొత్తాన్ని ఏడు నెలలముందుగా అక్టోబర్‌ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు.

గతంలో చంద్రబాబు సర్కారు రూ. 384 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల విత్తన సేకరణ అసాధ్యమవుతున్నదని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చిన మరుక్షణం ఆ బకాయిల్ని తీర్చడం, వేరుశెనగ విత్తనాలకు కొరత ఉందని తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన వేరే రాష్ట్రాల్లో కొనుగోలు చేయించి నెల్లాళ్లలోనే 3.57 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయడం, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని తెలిసి కొనుగోలుదారులతో మాట్లాడి ఒప్పించడం రైతులపట్ల జగన్‌కున్న చిత్తశుద్ధిని వెల్లడిస్తాయి.

రైతుల కడగండ్లపై సంపూర్ణ అవగాహన ఉన్న నిపుణులు, శాస్త్రవేత్తలు, మంత్రులు, అధికారులతో అగ్రికల్చర్‌ మిషన్‌ ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ జిల్లాలోని జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవ ప్రధాన సభలో సోమవారం జగన్‌ నవరత్నాలకు శ్రీకారం చుట్టారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు చెందిన కుటుంబాలు నిరాధారమవుతున్నా యని గ్రహించి ప్రకటించిన రాజన్న బీమా పథకం అమలును ఈ వేదికనుంచే ప్రారంభించారు. రెండేళ్లక్రితం అప్పుల బాధ తట్టుకోలేక ప్రాణం తీసుకున్న యువ రైతు విశ్వనాథ కుటుంబానికి రూ. 7 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. రైతు దినోత్సవం సందర్భంగా జగన్‌మోహన్‌ రెడ్డి రైతులనుద్దేశించి రాసిన లేఖను చూసినా, జమ్మలమడుగు సభలో చేసిన ప్రసంగాన్ని విన్నా... రైతుల శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన వెల్లడవుతుంది. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం.

రైతుల రెక్కల కష్టంపైనే ఈ జాతి మనుగడ ఆధారపడి ఉంది. ఎన్నడో 1966లోనే విత్తన చట్టం వచ్చినా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పొలంలో పంట ఏపుగా కనబడుతున్నా దానికి పూత రాదు. కాపుగాసే జాడే కనబడదు. వందల రూపాయలు పోసి కొన్న విత్తనాల్లో సత్తువ లేదని గ్రహించేసరికల్లా పుణ్యకాలం గడిచిపోతుంది. అంతవరకూ ఆ పొలంపై ఎరువుల కోసం, పురుగుమందుల కోసం చేసిన వేల రూపాయల సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. రైతు దగాపడతాడు. ఇంటిల్లిపాదీ బావురుమంటారు. అప్పటికే అప్పు లపాలైన రైతుకు ఆత్మహత్య తప్ప మరే దారీ కనబడదు. ఈ దుస్థితిని పూర్తిగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పించారు. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు, పురుగు మందులను నిరోధించడానికి చర్యలు చేపట్టబోతున్నట్టు  ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రయోగ శాలలు ఏర్పాటు చేసి నాణ్యతను నిర్ధారిస్తామని చెప్పారు. ఎరువులు, పురుగుమందుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే అవి లభ్యమయ్యేలా చేస్తామని తెలియ జేశారు.

ఈ ప్రయోగశాలలు ప్రారంభమైతే రైతులకెంతో మేలవుతుంది. బోగస్‌ పరిశోధనల పేరు చెప్పి, నాణ్యమైన సంకర జాతి విత్తనాలంటూ మాయదారి ప్రచారం చేసి సొమ్ము చేసుకుని రైతులను నిలువునా ముంచేయడం ఇకపై సాధ్యపడదు. అత్యధికంగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాల లభ్యత సరిగా లేదు. అవి ఎక్కువగా మోతుబరి రైతులకే దక్కుతాయి. ఇక కౌలు రైతుల కథ చెప్పనవసరమే లేదు. సక్రమంగా పండితే, మంచి ధరొస్తే ఏమోగానీ...పంట నష్టం జరిగితే కౌలు రైతు గోడు వినేవారెవరూ ఉండరు. ఎవరూ పట్టించుకోని అలాంటివారి కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌ నడుంబిగించారు. భూ యాజమాన్యపు హక్కులకు భంగం వాటిల్లకుండానే కౌలు రైతులకు అండగా నిలిచేందుకు చట్టం తీసుకురావాలని ఆయన నిర్ణయిం చారు. రైతులకు అండగా ఉండేందుకు సహకార రంగాన్ని బలోపేతం చేయదల్చుకున్నారు. గోదా వరి జలాలు కరువు ప్రాంతాలకు తరలించి వాటిన సశ్య సీమలుగా మార్చే బృహత్తర ప్రణాళిక రచిస్తున్నారు.

ప్రభుత్వాలు ఏటా ప్రకటించే భారీ బడ్జెట్లు, వార్షిక రుణ ప్రణాళికలు క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలను సరిగా తీర్చలేకపోయాయి. రైతులను పట్టిపీడిస్తున్న సమస్యలేమిటో, ఎక్కడెక్కడ వారికి సమస్యలెదురవుతున్నాయో పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకోబట్టే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారు. అచిరకాలంలోనే వీటి సత్ఫలి తాలు అందరికీ అంది జగన్‌మోహన్‌రెడ్డి బాస చేసిన ‘రాజన్న రాజ్యం’ సాకారమవుతుందన్న భరోసా కలుగుతోంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top