తేజ్‌ ప్రతాప్‌ రాయని డైరీ | Unwritten diary of the tej pratap | Sakshi
Sakshi News home page

తేజ్‌ ప్రతాప్‌ రాయని డైరీ

Jun 11 2017 1:40 AM | Updated on Sep 5 2017 1:17 PM

తేజ్‌ ప్రతాప్‌ రాయని డైరీ

తేజ్‌ ప్రతాప్‌ రాయని డైరీ

గవర్నమెంటులో ఉన్నవాళ్లను గవర్నమెంటులో లేనివాళ్లు చికాకు పెడుతున్నారంటే గవర్నమెంటు ఉన్నట్టా?

గవర్నమెంటులో ఉన్నవాళ్లను గవర్నమెంటులో లేనివాళ్లు చికాకు పెడుతున్నారంటే గవర్నమెంటు ఉన్నట్టా? లేనట్టా? నేను హెల్త్‌ మినిస్టర్‌ని. మా తమ్ముడు డిప్యూటీ సీఎం. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ గవర్నమెంట్‌ నిలబడి ఉందంటేనే మా ఫ్యామిలీ వల్ల. ఇంత పవర్‌ ఉండీ మా అన్నదమ్ములం ఉదయం లేవగానే ఎవరి పనులు వాళ్లం చేసుకోలేకపోతున్నాం! రెండు నెలలుగా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ప్రెస్‌ మీట్లు పెట్టి చంపుతున్నాడు సుశీల్‌ కుమార్‌ మోదీ. మాకు ఇన్నిన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో, డైలీ ఆయన ఇంటికెళ్లి డాక్యుమెంట్స్‌ చూపించి రావాలట! పవర్‌లో లేనివాడు ఏదైనా అడుగుతాడు.
‘‘రోజూ మనకు ఈ .. మన్‌ కీ బాత్‌ ఏంటి నితీశ్‌జీ’’ అని అడిగాను.
‘‘నన్నెందుకు కలుపుకుంటారు తేజ్‌ బాబూ’’ అన్నారు నితీశ్‌! ఆశ్చర్యపోయాను.
 ఢిల్లీ వెళ్లి మోదీతో లంచ్‌  చేసి వచ్చినప్పటి నుంచీ నితీశ్‌ బిహార్‌ చీఫ్‌ మినిస్టర్‌లా బిహేవ్‌ చెయ్యడం లేదు. తనని తను బీజేపీ చీఫ్‌ మినిస్టర్‌ అనుకుంటున్నట్లున్నాడు.
‘‘మిమ్మల్ని మేము కలుపుకోవడం ఏంటి నితీశ్‌జీ! మీ మంత్రివర్గంలోనే కదా ఉన్నాం.. నేను, మా తమ్ముడు’’ అన్నాను.
‘‘క్యాబినెట్‌లో ఉన్నంత మాత్రాన, కలిసి ఉన్నామనేనా తేజ్‌ బాబూ’’ అన్నారు నితీశ్‌.  
నితీశ్‌ నావైపు చూసి మాట్లాడ్డం లేదు. నేను లేని వైపు చూసి మాట్లాడుతున్నారు!
‘‘సుశీల్‌ మోదీ ఎక్కువ చేస్తున్నాడు నితీశ్‌జీ’’ అన్నాను. నితీశ్‌ మౌనంగా ఉన్నారు.
‘‘తన పేరులో మోదీ ఉందని చెప్పి, తనను మోదీ అనుకుంటున్నాడు నితీశ్‌జీ’’ అన్నాను.
నితీశ్‌ మౌనంగా ఉన్నారు! ఆయనేమీ మాట్లాడదలచుకోలేదని నాకు అర్థమైంది.
‘‘వెళ్తున్నాను నితీశ్‌జీ’’ అన్నాను.
అప్పుడడిగారు.. ‘‘ఏదైనా పనిమీద వచ్చావా తేజ్‌ బాబూ’’ అని!
‘‘ఇవాళ నాన్నగారి బర్త్‌డే. ఇవాళొక్కరోజూ సుశీల్‌ మోదీ ప్రెస్‌మీట్‌ పెట్టకుండా చూడగలరా నితీశ్‌జీ’’ అని అడిగాను.
‘‘నాన్నగారికి బర్త్‌డే విషెస్‌ చెప్పడం ఒక్కటే నా చేతుల్లో ఉంది తేజ్‌ బాబు’’ అన్నారు నితీశ్‌!
గుడ్డ సంచిలోంచి ప్రసాదం తీసి ఆయన చేతికి ఇచ్చాను. ‘‘శ్రీకృష్ణ ప్రసాదం నితీశ్‌జీ. బృందావనా నికి వెళ్లొచ్చాను’’ అని చెప్పి బయల్దేరాను.
‘‘బృందావనమా! ఏమిటి యు.పి. విశేషాలు’’ అని అడిగారు.
‘‘యోగి ఆదిత్యనాథ్‌ కొత్త స్పెషల్‌ సెక్రెటరీని అపాయింట్‌ చేసుకున్నారు నితీశ్‌జీ. అదే విశేషం’’ అని చెప్పాను.
‘అందులో విశేషం ఏముంది తేజ్‌ బాబూ’ అన్నట్లు చూశారు నితీశ్‌.
ఆ స్పెషల్‌ సెక్రెటరీ పేరు నితీశ్‌ కుమార్‌. ఆ విషయమే నితీశ్‌జీ కి చెప్పి వచ్చేశాను.

                       - మాధవ్‌ శింగరాజు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement