సుష్మా స్వరాజ్‌కు దూషణలు

Social Media Trolls On Sushma Swaraj - Sakshi

సామాజిక మాధ్యమాలు కోట్లాదిమందికి గొంతునిస్తున్నాయి. జనం చేతిలో అవి ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ సాధనాలయ్యాయి. అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేస్తూ వదంతుల వ్యాప్తికి, నీలాపనిందలకు, వ్యక్తిత్వహననానికి పాల్పడే దుండగులు కూడా బయల్దేరారు. ఆ బాపతు వ్యక్తులకు తాజాగా విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ లక్ష్యంగా మారారు. మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు పాస్‌పోర్టులు మంజూరు చేయడం విషయంలో లక్నోలోని ఒక అధికారి అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన ఫిర్యాదుపై ఆరా తీసి తగిన చర్య తీసుకుంటామని సుష్మా స్వరాజ్‌ ఇచ్చిన హామీ దీనంతకూ కారణం. ముస్లింను పెళ్లాడినా పేరెందుకు మార్చుకోలేదని తననూ... నువ్వు హిందూమతంలోకి మారొచ్చుకదా తన భర్తనూ అడిగాడని, అందరిలోనూ అవ మానకరంగా మాట్లాడాడని తన్వీ సేఠ్‌ అనే మహిళ ఆరోపించింది. సుష్మా జోక్యం తర్వాత ఆ దంప తులకు పాస్‌పోర్టులు మంజూరు కావటంతోపాటు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలెదుర్కొన్న అధికారికి లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కు బదిలీ కావటం సంఘ్‌ పరివార్‌ అభిమానులకు నచ్చలేదు. దాంతోవారు ఆమెపై ట్వీటర్‌లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు.

పక్షపాతంతో అధికారిపై చర్య తీసుకున్నందుకు సిగ్గుపడాలంటూ ఒక మహిళ ట్వీట్‌ చేయడంతోపాటు ఇది ఇస్లామిక్‌ కిడ్నీ ప్రభా వమా అంటూ విరుచుకుపడ్డారు. ఈమధ్య సుష్మా స్వరాజ్‌కు జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యానం చేశారు. కొందరు ఇంకా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసేవారిని తూలనాడటం కొత్తేమీ కాదు. కాకపోతే బీజేపీ సీనియర్‌ నాయకురాలిగా, కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ఉంటూ కూడా సుష్మా స్వరాజ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చవిచూడవలసి రావటమే వింత. పరుషంగా మాట్లాడటం, నిందలే యటం మహిళల విషయంలో ఎక్కువుంటుంది. కానీ సుష్మాపై అలాంటి భాషను ప్రయోగించిన వారిలో మహిళలు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముస్లింను పెళ్లాడిన యువతి ఫిర్యాదుకు ప్రాధాన్యమిచ్చి సంబంధిత అధికారిపై చర్య తీసుకోవటం ఈ బాపతు ఉన్మాదుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది! 

నిజానికి ఇతర మంత్రిత్వ శాఖల్లా విదేశాంగ శాఖ ప్రజానీకంతో నేరుగా సంబంధమున్నది కాదు. విదేశాలతో మనకుండే సంబంధాల గురించి, అవి ఉండాల్సిన తీరు గురించి సమీక్షించడం, అంతర్జాతీయంగా మన దేశ ప్రయోజనాలను నెరవేర్చటం ఆ శాఖ వ్యాపకం. ప్రపంచ పరిణామా లనూ, వివిధ దేశాల పోకడలనూ, వాటి ఎత్తుగడలనూ తెలుసుకుంటూ మన దేశం వైఖరికి ఎప్పటిక ప్పుడు పదునుబెట్టే పనిలో నిమగ్నమయ్యే శాఖ అది. 1977లో జనతాపార్టీ అధికారంలోకొచ్చాక ఈ శాఖను వాజపేయి సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలూ పొందారు. ముఖ్యంగా చైనాతో స్నేహసంబంధాలు ఏర్పడటంలో ఆయన కృషి మెచ్చదగినది. అటు తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నవారు సుష్మాయే. ప్రవాసభారతీయుల సమస్యల విషయంలో, పాస్‌పోర్టుల మంజూరు విషయంలో స్పందించి పరిష్కరిస్తున్న తీరు అనేకులకు నచ్చింది. అంతేకాదు... భారత్‌లో శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూసే పాక్‌ పౌరులకు వీసాలు రాని సందర్భాల్లో ఆమె జోక్యం చేసుకుని ప్రాణాలు నిలబెట్టిన ఉదంతాలున్నాయి.

ఒక ముస్లింను పెళ్లాడిన యువతికెదురైన సమస్య విష యంలో ఆమె చొరవ ప్రదర్శించటం, పాస్‌పోర్టులు ఇప్పించటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారటం దేశంలో ప్రస్తుతం నెలకొన్న స్థితిగతులకు అద్దం పడుతుంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసినవారు సంఘ్‌ పరివార్‌ భావాలకు దగ్గరగా ఉన్నవారు గనుక వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరొ కరెవరైనా అయితే బహుశా ఈపాటికే అరెస్టయ్యేవారు. ఇంతకూ ఆరోపణలెదుర్కొన్న అధికారి బదిలీలో తన పాత్ర లేదని సుష్మా స్వరాజ్‌ వివరణనిచ్చుకోవటంతోపాటు అందులో ఆరు వ్యాఖ్య లను ఎంపిక చేసి ‘లైక్‌’ కొట్టి రీ ట్వీట్‌ చేశారు. ఇలా చేయటం ద్వారా వారిని బజారుకీడ్చి, సిగ్గు పడేలా చేశానని సుష్మా అనుకుని ఉండొచ్చు. కానీ వారు ఆ బాపతు కాదు. నిజానికి అలా సిగ్గు పడేవారు వెనకా ముందూ చూడకుండా ఎదుటి వ్యక్తిని ఆ స్థాయిలో కించపరుస్తూ మాట్లాడరు. తగిన సమాచారంతో, బాధ్యతాయుతమైన విమర్శ చేస్తారు తప్ప విపరీత ధోరణులను ప్రదర్శించరు. 

సామాజిక మాధ్యమాల్లో అకారణంగా, అన్యాయంగా నిందలెదుర్కొంటున్నవారిలో సుష్మా మొదటివారు కాదు. దేశంలో చాన్నాళ్లక్రితమే ఇది అంటువ్యాధిలా వ్యాపించింది. నాలుగైదేళ్లుగా వింత పోకడలకు పోతోంది. బెదిరింపులు, నిందలు రివాజుగా మారాయి. మహిళల విషయంలో అయితే మరీ రెచ్చిపోతారు. సామూహిక అత్యాచారం చేస్తామని హెచ్చరిస్తారు. ఫిర్యాదులు చేసినా చర్యలుం డటం లేదని ప్రముఖులుగా ఉన్నవారే వాపోతున్న సందర్భాలు కోకొల్లలు. సామాన్యుల పరిస్థితి మరింత ఘోరం. ప్రముఖులకు మనోవేదన, అభద్రతాభావం ఏర్పడుతున్నాయేమోగానీ సాధారణ పౌరుల ప్రాణాలే పోయిన ఉదంతాలున్నాయి. పశువులను కబేళాలకు తరలించుకుపోతున్నారని వాట్సాప్‌ ద్వారా వదంతులు పుట్టించి అమాయకులను కొట్టి చంపిన ఉదంతాలున్నాయి.

నిరుడు జూన్‌లో యూపీలో రైల్లో ప్రయాణిస్తున్న పదిహేనేళ్ల పిల్లవాడిపై దాడిచేసి హతమార్చిన ఉదంతమూ ఆ తరహాదే. ఇవి చూసి స్ఫూర్తి పొంది కొందరు సాధారణ వ్యక్తులు కూడా ఇలాంటి నేరాలకు పాల్ప డుతున్నారు. జార్ఖండ్‌ నుంచి అస్సాం వరకూ అనేకచోట్ల ఇదొక సంస్కృతిగా వ్యాపిస్తోంది. ఈ ధోర ణులకు అడ్డుకట్ట పడకపోతే వ్యాపించేది అరాచకమే. అంతేకాదు... అంతర్జాతీయంగా దేశం పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. పార్టీ సీనియర్‌ నేత, విదేశాంగ మంత్రి స్థాయి వ్యక్తిపై దూషణలు వెల్లు వెత్తినా బీజేపీ అగ్ర నాయకత్వం పట్టనట్టు ఉండటం ఆశ్చర్యకరం. ప్రభుత్వ పరంగా చర్య తీసుకో వటం మాట అటుంచి, పార్టీ నుంచి ప్రకటనైనా రాకపోవటం వింతగొలుపుతుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top