న్యూఢిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ అంతా భారత మహిళా క్రికెట్ జట్టును అభినందిస్తున్నారు. అయితే ఇదేవిధంగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన దరిమిలా, అది రాజకీయ చర్చకు దారి తీసింది. మహిళలు అర్థరాత్రి బయటకు వెళ్లడంపై మమతా గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోమారు తెరపైకి వచ్చాయి. బీజేపీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మమతను ఎద్దేవా చేసింది. వివరాల్లోకి వెళితే సీఎం మమత భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ ‘ఎక్స్’ పోస్టులో ‘ఈ రోజు, ప్రపంచ కప్ ఫైనల్‌లో ఘన విజయం సాధించిన మా ‘ఉమెన్ ఇన్ బ్లూ’ను చూశాక దేశమంతా గర్విస్తోంది. వారు చూపిన ప్రతిభ, టోర్నమెంట్‌లోవారి అద్భుత ప్రదర్శన తరతరాలుగా యువతులకు ప్రేరణగా నిలుస్తుంది. మీరు అత్యున్నత స్థాయిలో ఆడి, ప్రపంచ స్థాయి జట్టు అని నిరూపించారు. మీరు మాకు కొన్ని అద్భుత క్షణాలను అందించారు. మీరే మా హీరోలు. భవిష్యత్తులో భారీ విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మీకు తోడుగా నిలుస్తాం’అని రాశారు.
భారత మహిళా క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించిన తీరును పలువురు మెచ్చుకున్నారు. అయితే ఇంతలోనే ఇది రాజకీయ మలుపు తీసుకుంది. గతంలో దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసు విషయంలో మమతా బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తాజాగా బీజేపీ గుర్తు చేసింది. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఒక ట్వీట్ చేస్తూ.. ‘దేవుడా.. వాళ్లు 12 గంటల వరకు ఆడారు. మీరేమో వాళ్లని 8 గంటలలోపు ఇంట్లో ఉండమని చెప్పారు’ అని రాసింది. గత అక్టోబర్‌లో మమతా బెనర్జీ వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, బాధితురాలు రాత్రి 12.30 గంటలకు బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా రాత్రిపూట ఆడపిల్లను బయటకు రానివ్వకూడదు. వారు స్వీయ రక్షణలో ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. నాడు బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాలలో ఆగ్రహాన్ని తెప్పించాయి. మమత.. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు బదులు బాధితురాలిని నిందించారని పలువురు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్


