కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌పై దాడి జరిగింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలోకి చొరబడిన ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు ఆ యువకుడిని అభిషేక్ దాస్‌గా గుర్తించిన దరిమిలా అరెస్ట్ చేశారు.
ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జ్యోతిప్రియ మల్లిక్‌ను వెంబడించిన ఆ యువకుడు అతని ఇంటిలోనికి చొరబడి, హఠాత్తుగా ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లి, అతని పొత్తికడుపుపై బలంగా కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే షాక్‌నకు గురయ్యారు. వెంటనే తేరుకుని, కేకలు వేయడంతో అతని భద్రతా సిబ్బందితో పాటు సమీపంలోని ఇతరులంతా ఆ యువకుడిని పట్టుకుని, బిధాన్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
పోలీసులు విచారణలో ఆ యువకుడు తాను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ప్రాంతానికి చెందినవాడినని, ఉద్యోగం కోసం మల్లిక్‌తో మాట్లాడాలనుకున్నానని చెప్పాడు. మల్లిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో హబ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆ యువకుడు నగరంలోని ఒక ఆసుపత్రిలో మానసిక వైద్య చికిత్స పొందుతున్నాడని, సాల్ట్ లేక్‌లోని మల్లిక్ ఇంటికి పలుమార్లు వెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.
ఎమ్మెల్యే మల్లిక్ విలేకరులతో మాట్లాడుతూ, ఆ యువకుడు ఇతర సందర్శకుల మాదిరిగానే తనను కలుసుకునేందుకు వచ్చాడని, అయితే అకస్మాత్తుగా ముందుకు దూకి, తనను కొట్టడంతో ఆశ్చర్యపోయానన్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడో లేదో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మల్లిక్ రెండేళ్ల క్రితం అటవీ మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి కేసులో కేంద్ర సంస్థలు ఆయనను అరెస్టు చేశాయి.
ఇది కూడా చదవండి: ‘ట్రంప్ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు


