చైనా చీకటి కోణం

Sakshi Editorial On Other Side Of China In Meng Hongwei Issue

బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన నేరగాళ్లను, హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నవారిని ఇంటర్‌పోల్‌ అనే అంతర్జాతీయ పోలీసు సంస్థ ఏ మూలనున్నా పట్టి బంధిస్తుం దని అందరూ నమ్ముతుంటారు. అది రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసిందంటే ఆ నేరగాళ్ల పని అయి పోయినట్టేనని విశ్వసిస్తుంటారు. కానీ ఈమధ్య ఉన్నట్టుండి మాయమై ఆచూకీ లేకుండా పోయిన ఇంటర్‌పోల్‌ చీఫ్‌ మెంగ్‌ హాంగ్వీ సంగతి తెలియక ఆ సంస్థ ఉన్నతాధికారులే అయోమయంలో పడ్డారు. ఆయన ఆచూకీ తెలుసుకోవడానికే దాదాపు రెండు వారాలు పట్టింది. ఇంకా విచిత్ర మేమంటే... ఆయన ఆచూకీ, ఇంటర్‌పోల్‌ చీఫ్‌ పదవికి ఆయన రాజీనామా ఒకేసారి వచ్చాయి. రాజీనామాను అంగీకరించి ఆయన స్థానంలో వేరే చీఫ్‌ను నియమించుకోవడం తప్ప ఇంటర్‌పోల్‌ చేసిందేమీ లేదు. ఇంటర్‌పోల్‌కు ఈ దుస్థితి కల్పించింది చైనా ప్రభుత్వమే. అంతర్జాతీయంగా అన్ని చోట్లా తన సత్తా చాటాలని, తిరుగులేని శక్తిగా ఎదగాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. దానికి తగినట్టు ఆర్థికంగా అది శరవేగంతో ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి సంస్థలన్నిటిలోనూ తన ముద్ర కనబడా లని, నాయకత్వ పగ్గాలు తనకూ రావాలని ఒకప్పుడు చైనా కోరుకునేది. కానీ పశ్చిమ దేశాలు అందుకు అవకాశమిచ్చేవి కాదు. 80వ దశకంలో డెంగ్‌ ఆర్థిక సంస్కరణలకు తెరతీశాక, పశ్చిమ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు మొదలయ్యాక పరిస్థితులు క్రమేపీ మారుతూ వచ్చాయి. ఐక్య రాజ్యసమితి సంస్థల్లోనూ, అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకుల్లోనూ, అంతర్జాతీయ న్యాయస్థానా ల్లోనూ ఆ దేశానికి కూడా చోటు దొరుకుతోంది. ఇప్పుడు కొన్ని రోజులు మాయమై అందరినీ కంగారు పెట్టిన ఇంటర్‌పోల్‌ చీఫ్‌ మెంగ్‌ హాంగ్వీ చైనీయుడే. రెండేళ్లక్రితం ఇంటర్‌పోల్‌కు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చైనా మీడియా ఎంతో సంబరపడింది. దీన్ని చైనా న్యాయవ్యవస్థకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించింది. ఇంతలోనే ఏమైందో చైనా ప్రభుత్వం ఆయనపై కన్నెర్రజేసింది. ఆయన్ను లంచం కేసులో అరెస్టు చేశామని చెబుతోంది.

 
హాంగ్వీ ఉన్నతస్థాయి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. చైనా ఇంటర్‌పోల్‌ చీఫ్‌గా, ప్రభుత్వంలో ఉప మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సర్కారు ఎంపిక చేసి పంపితేనే ఇంటర్‌పోల్‌ చీఫ్‌ అయ్యారు. ఆయన అవినీతి ఇన్నాళ్లకు తెలిసింది కాబట్టే ఇప్పుడు చర్య తీసుకున్నామని చైనా ప్రభుత్వం వాదించవచ్చు. అది నిజమేననుకున్నా ఆయన్ను అరెస్టు చేసే విధానం ఇలాగేనా? ఆరోపణలొచ్చి నప్పుడు, వాటికి అవసరమైన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే దానిపై ఇంటర్‌పోల్‌కు వర్తమానం అందించాలి. చట్టప్రకారం ఆయన్ను రప్పించడానికి చర్యలు తీసుకోవాలి. ఇవేమీ లేకుండా, ఆయన స్వస్థలానికి వచ్చాక బంధించడం, ఆ సంగతిని కూడా దాదాపు రెండువారాలు దాచి పెట్టి ఉంచడం ఏ రకంగా సమర్థనీయమో ఆ ప్రభుత్వమే చెప్పాలి. తమ ప్రమాణాల ప్రకారం అరెస్టులు ఇలాగే ఉంటాయని చైనా వాదించవచ్చుగానీ ఈ తంతును ఎవరైనా అపహరణనే పిలుస్తారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక వ్యక్తిని ఇలా మాయం చేసిన తీరు చూశాక అసలు ఆ ఆరోపణలే పెద్ద బోగస్‌ అని భావిస్తారు. అందలం ఎక్కబోయే నేతలకూ లేదా అధికారంలో ఉన్నవారికి పెద్ద బెడదగా మారొచ్చునని సంశయం వస్తే అలాంటివారిని అవినీతి కేసులో, లంచం కేసులో ఇరికించి జైలుకు పంపడం చైనాలో రివాజు. మెంగ్‌ ఏ కోవలోకి వస్తారో చూడాల్సి ఉంది. అసలు ఆయన మాయమైన తీరు, అది వెల్లడైన తీరు ఆశ్చర్యం కలి గిస్తుంది. గత నెల 25న చైనా చేరుకున్నాక ఆయన ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో భార్య కంగారు పడుతుండగా, ఉన్నట్టుండి ఆ ఫోన్‌ నుంచి బాకు బొమ్మ ఈమోజీ రావడం ఆ భయాన్ని మరింత పెంచింది. కనీసం తనను పోలీసులు పట్టుకున్నారని సందేశం పంపే అవకాశం కూడా ఆయనకు లేదన్నమాట!  ఒక్క మెంగ్‌ విషయంలో మాత్రమే కాదు... హాలీవుడ్‌ చిత్రాల్లో నటించే చైనా సినీ తార ఫాన్‌ బింగ్‌బింగ్‌ను కూడా ఇదే విధంగా చైనా ఈ తరహాలోనే మాయం చేసింది. ఐరన్‌మాన్‌ 3, ఎక్స్‌–మెన్, లాస్ట్‌ ఇన్‌ బీజింగ్‌ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొంది భారీ పారితోషికాన్ని తీసుకునే నటి ఫాన్‌. ఆమె ఆచూకీ మూడు నెలలపాటు తెలియలేదు. ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి ఇలా మాయం కావడంలో మర్మమేమిటో ఎవరికీ బోధపడలేదు. హఠాత్తుగా ఈ నెల 3న ఆమె పేరిట ఒక ప్రకటన విడుదలైంది. భారీ మొత్తంలో పన్ను ఎగ్గొట్టి పెద్ద తప్పు చేశానని, సమాజం తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేశానని ఆ ప్రకటనలో ఆమె పశ్చాత్తాప పడింది. ఆమెతో పోలిస్తే మెంగ్‌ అదృష్టవంతుడు. ఇంటర్‌పోల్‌ చీఫ్‌ కనుక రెండు వారాలకే ఆచూకీ తెలిసింది! కానీ ఇద్దరి విషయంలోనూ వారి పేరిట వెలువడిన ప్రకటనలే ఇప్పటికీ ఆధారం. 

ఇంటర్‌పోల్‌ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థేమీ కాదు. పుట్టి 104 ఏళ్లవుతున్నా దానికి తగినన్ని నిధులు, అవసరమైనంత సిబ్బంది ఎప్పుడూ లేరు. 192 సభ్య దేశాల్లో ఏ దేశమైనా ఫలానా వ్యక్తిపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయమని కోరితే ఆ పని చేయడం, అంతర్జాతీయ నేరస్త ముఠాల ఆచూకీ అడిగితే సభ్యదేశాల్లోని పోలీసు విభాగాలన్నిటికీ ఆ వినతిని పంపి, స్పందన రాబట్టడం దాని పని. అలా చేయడం వల్ల అప్పుడప్పుడు నేరగాళ్లు పట్టుబడుతున్న సందర్భా లున్నాయి. అయితే అధికారంలో ఉన్నవారి ఆగడాలను ప్రశ్నించినవారిని ఆయా దేశాలు నేరస్తు లుగా చిత్రించి ఆచూకీ కోసం అడుగుతుంటే, అది ముందూ వెనకా చూడకుండా పాటిస్తుదన్న విమర్శలున్నాయి. రష్యా, చైనాలు ఇలాంటి పనుల్లో ఆరితేరాయి. ఆ దేశాలనుంచి అందే వినతుల విషయంలో జాగ్రత్తలు పాటించి, హేతుబద్ధంగా వ్యవహరించాలని అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఇంటర్‌పోల్‌పై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఈలోగా ఏకంగా ఆ సంస్థ చీఫ్‌నే అత్యంత అనాగరి కంగా, తలబిరుసుగా అపహరించి చైనా తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఈ ఉదంతం చైనా చీకటి కోణాన్ని వెల్లడించింది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top