లంకలో విద్వేషపర్వం

Editorial Column On Terrorism In Sri Lanka - Sakshi

తమ చర్యల ద్వారా సమాజంలో చీలికలు తీసుకురావడం, పౌరుల్లో పరస్పర అనుమానాలు రేకెత్తించడం, ఘర్షణలు ప్రేరేపించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ఉగ్రవాద మూకల ప్రధానోద్దేశం. దాదాపు దశాబ్దకాలంనుంచి ప్రశాంతంగా ఉంటున్న శ్రీలంకలో మొన్న ఏప్రిల్‌ నెలలో ఈస్టర్‌ పర్వదినాన ఉగ్రవాదులు ఆ ఉద్దేశంతోనే మారణకాండ, విధ్వంసం సాగించారు. దాదాపు 300మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. నిఘా సంస్థలకు ఉగ్రవాదుల పన్నాగంపై ముందస్తు సమాచారం ఉన్నా అవి తగినవిధంగా స్పందించకపోవడం వల్లే ఇంత ఘోరం జరిగిపోయింది. అయితే దురదృష్టమేమంటే... తర్వాతనైనా శ్రీలంక ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేక పోతోంది. ఈ విషయమై పౌర సమాజం, మత పెద్దలు పదే పదే హెచ్చరిస్తున్నా దాని ధోరణేమీ మారలేదు.

ఫలితంగా దాడులు చేసిన ఉగ్రవాదులు జన్మతః ముస్లింలు కనుక ఆ వర్గం మొత్తాన్ని అనుమాన దృక్కులతో చూసే ధోరణి అక్కడ వ్యాపిస్తోంది. వారిపై పలుచోట్ల దుండగులు దాడులు చేస్తున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా వాయువ్య ప్రావిన్స్‌లో ముస్లింలకు చెందిన వ్యాపార సంస్థలపైనా, మసీదులపైనా, ఇళ్లపైనా సింహళ తీవ్రవాదులు దాడులు జరుపుతున్నారు.  చివరికి ఇదంతా ఎక్కడదాకా పోయిందంటే... గవర్నర్లుగా ఉన్న ఇద్దరు ముస్లిం నేతలు ఉగ్రవాదానికి తోడ్పాటునందిస్తున్నారని, దర్యాప్తు సక్రమంగా జరగకుండా అవాంతరాలు సృష్టిస్తున్నారని, వారిని వెంటనే తొలగించి అరెస్టు చేయాలని ఒక బౌద్ధ మత సన్యాసి నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. ఆయన అధికార పక్షమైన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీకి చెందిన ఎంపీయే.

అయినా ప్రధాని రనిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం పట్టనట్టు ఉండిపోయింది. ఒకపక్క బౌద్ధ సన్యాసి దీక్ష, మరోపక్క రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముస్లిం వర్గానికి చెందిన తొమ్మిదిమంది మంత్రులు, ఇద్దరు గవర్నర్లు రాజీనామా చేశారు. తమలో ఎవరికైనా ఉగ్రవాదులతో సంబం ధాలున్నట్టు తేలితే చర్య తీసుకోవాలని, లేనట్టయితే సింహళ తీవ్రవాద సంస్థల ఆరోపణలు అబద్ధమని చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రనిల్‌ విక్రమసింఘే మధ్య ఏర్పడ్డ విభేదాలు మొత్తం పాలనా వ్యవస్థను అచేతన స్థితికి చేర్చాయి. భారత నిఘా వర్గాలు ఉగ్రవాద దాడుల గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సరైన స్పందన లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కనీసం ఆ తర్వాతైనా ప్రభుత్వం సమష్టిగా పనిచేస్తే వేరుగా ఉండేది. కానీ భద్రత కొరవడటానికి కారణం మీరంటే మీరని వాదులాడుకోవడంతోనే సరిపోతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కాథొలిక్‌ చర్చి మెరుగ్గా ఉన్నాయి.

వాటి కృషి వల్లే క్రైస్తవులు ప్రశాంతంగా ఉన్నారు. మారణకాండ తర్వాత  క్రైస్తవ వర్గానికి చెందినవారు ముస్లింలపై దాడులు చేస్తారని సింహళ తీవ్రవాద శక్తులు బాగా ఆశించాయి. కానీ అలా జరగకపోవడంతో ఆ శక్తులే స్వయంగా రంగంలోకి దిగి ముస్లింల వ్యాపారసంస్థలపైనా, ఇళ్లపైనా దాడులు చేస్తున్నాయి. ఉగ్రవాదానికి రూపురేఖలుండవు. ప్రజలనూ, ప్రభుత్వాలనూ పక్కదోవ పట్టించేందుకు మతాన్నో, మరే ఇతర వాదాన్నో ముందుకు తెచ్చినా దాని మతమూ, అభిమతమూ కూడా మృత్యువే. పౌరులను సదా అప్రమత్తం చేయడం, విద్వేషపూరిత ప్రచారం చేసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, వాటి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచడం వంటివి ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి తోడ్పడ తాయి. అదే సమయంలో సమాజంలో పరస్పర విద్వేషాలు ప్రబలకుండా చూడటం, అలాంటి కార్యకలాపాలు సాగించేవారిపై చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యం. 

ఎల్‌టీటీఈపై సుదీర్ఘకాలం సాగించిన పోరాటం వల్ల కావొచ్చు.. శ్రీలంకలో సైన్యానికి, పోలీసులకు మొదటినుంచీ అపరిమిత అధికారాలున్నాయి. కానీ ముస్లిం వర్గాలపై దాడులు జరుగుతున్నా ఆ రెండు విభాగాలూ నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నాయి. మెజారిటీగా ఉన్న సింహ ళీయులపై చర్య తీసుకుంటే ఈ ఏడాది ఆఖరులో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో నష్టపోతానని విక్రమసింఘే భయపడుతుండటమే ఇందుకు కారణం. సింహళ తీవ్రవాద సంస్థలు ఒకపక్క ముస్లింలపై దాడులు సాగిస్తూనే వదంతుల్ని ప్రచారంలో పెడుతున్నాయి. ముస్లింలను బుజ్జగిస్తూ రావడం వల్లే ఉగ్రవాదం పెరిగిందని, బురఖా ధరించడానికి అనుమతించడం వల్ల ఎవరు ఉగ్రవాదో, ఎవరు కాదో తెలియడం లేదని వాదనలు లేవదీశాయి. దానికి తగ్గట్టే బురఖా ధరించ రాదంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

నిజానికి చర్చిలు, హోటళ్లపై ఉగ్ర దాడులకు పాల్పడిన వారు బురఖాలు ధరించలేదని సీసీ టీవీల్లో రికార్డయిన దృశ్యాలు చెబుతున్నాయి. ఉగ్రవాద చర్యలతో ప్రమేయమున్నదని అనుమానం కలిగినవారిపై చర్యలు తీసుకోరాదని ఇంతవరకూ ముస్లిం నేతలెవరూ కోరలేదు. వారు అలా అడిగారని ప్రభుత్వం కూడా చెప్పలేదు. కానీ సింహళ తీవ్రవాద సంస్థలు ఈ విషయంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నా అది మౌనం దాలుస్తోంది. దాదాపు రెండు నెలలుగా సాగిస్తున్న దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో, ఎవరి ప్రమేయమున్నదని తేలిందో, ఆ దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడానికి కారణాలేమిటో వివరించాల్సిన బాధ్యత ఉన్నా విక్రమసింఘే సర్కారు మాట్లాడదు.

ఈ స్థితిలో ముస్లిం మంత్రులు, గవర్నర్లు రాజీనామా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఈ సందర్భంగా లంక ఆర్థికమంత్రి మంగళ సమరవీర చేసిన ట్వీట్‌ ప్రస్తావించుకోవాలి. ‘ద్వేషాన్ని ద్వేషంతో శాంతింపజేయలేం. దాన్ని ప్రేమానురాగాలతోనే జయిం చగలమని బుద్ధుడు ప్రవచించాడు. వంచకులు బుద్ధ భగవానుడి పేరిట ఇష్టానుసారం విద్వేషాన్ని రగుల్కొల్పుతుంటే, ముస్లిం మంత్రులు తమ పదవులకు రాజీనామాలివ్వడం ద్వారా బుద్ధుడి మార్గాన్ని అనుసరించారు’ అని ఆ ట్వీట్‌లో  సమరవీర అన్నారు. శ్రీలంక ప్రభుత్వం కూడా తాను ఏ పక్షాన ఉంటున్నదో, ఉండాలో తేల్చుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top