ఈసారి హెగ్డే వంతు!

Anant Kumar Hegde comments raise heat - Sakshi

గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వివరణనిచ్చి, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని బుధవారంనాడు చెప్పడంతో రెండు వారాలుగా స్తంభించిన పార్లమెంటులో ప్రశాంతత అలుముకుంది. ఈలోగా కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే రాజ్యాంగంపైనా, లౌకికవాదంపైనా, లౌకికవాదులపైనా చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో మళ్లీ ఉభయ సభలూ అట్టుడికాయి. రాజ్యాంగాన్ని మార్చడానికే బీజేపీ అధికారంలోకొచ్చిందని, దాన్నుంచి ‘సెక్యులర్‌’ అనే పదాన్ని తొలగిస్తామని ఒక కుల సభలో మాట్లాడుతూ ఆయన ప్రకటించారు. అంతటితో ఆగలేదు... ‘లౌకికవాదులు అమ్మానాన్నలెవరో తెలియనివారితో సమానమ’ని నోరు పారేసుకున్నారు.

కుల మేమిటో, మతమేమిటో చెప్పుకునేవారే ఆయన దృష్టిలో గొప్పవారు. ఎవరైనా సెక్యులరిస్టునని చెప్పుకుంటే అలాంటి వ్యక్తిని మంత్రిగారు అనుమానంతో చూస్తారట! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి ‘ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా, అక్రమ సంతానమా తేల్చుకోవాల’ని చేసిన వ్యాఖ్యకూ, ఇప్పుడు అనంత్‌కుమార్‌ హెగ్డే మాట తీరుకూ పెద్దగా తేడా లేదు. అప్పుడు కూడా ఇలాగే ఉభయ సభలూ అట్టుడికితే అలా మాట్లాడటం పొరపాటేనని ఆమె తరఫున నరేంద్రమోదీ సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది.  

రెండేళ్లక్రితం రాజ్యాంగ దినోత్సవాన్నీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతినీ పురస్కరించుకుని లోక్‌సభ రెండురోజులు ప్రత్యేక సమావేశాలు జరుపుకున్నప్పుడు సైతం లౌకికవాదం ప్రస్తావన వచ్చింది. అది రాసేనాటికి అందులో లౌకికవాదం, సామ్యవాదం పదాలు లేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎత్తిచూపితే... అప్పట్లో వాటిని చేర్చడం అంబేడ్కర్‌కు సాధ్యపడలేదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే జవాబిచ్చారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలు రాజ్యాంగ పీఠికలో చేరాయి.

అవి ఎప్పుడు చేరాయన్నది కాదు... రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి బింబిస్తున్నాయా లేదా అన్నదే ప్రశ్న. లౌకికవాదం రాజ్యాంగ స్ఫూర్తికి అను గుణమైనదేనని ఆ చర్చలో రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా అంగీకరించారు. రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్నప్పుడు అందులో బ్రిటన్, అమెరికా, కెనడా తదితర దేశాల రాజ్యాంగాల్లోని అంశాలున్నాయి తప్ప మన ప్రాచీన భారతీయ విలువలు, మను ధర్మ సూత్రాలు ఎక్కడని గుండెలు బాదుకున్న వారున్నారు. డాక్టర్‌ అంబేడ్కర్, రాజ్యాంగ నిర్ణాయక సభలోని ఇతర సభ్యులూ మూడేళ్లపాటు సాగిన చర్చల పరం పరలో ఇలాంటి ఎన్నో ఒత్తిళ్లను, విమర్శలను తట్టుకుని ఇప్పుడు మనం అను సరిస్తున్న రాజ్యాంగాన్ని రూపొందించారు.

అనంత్‌కుమార్‌ హెగ్డే కొత్తగా లోక్‌సభలో అడుగుపెట్టినవారు కాదు. ఆయన అయిదు దఫాలనుంచి ఎంపీగా ఎన్నికవుతున్నారు. తొలిసారి కేంద్రమంత్రి అయ్యారు. ఆ స్థాయి నాయకుడు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడారో అనూహ్యం. ఇంతకూ లౌకికవాదం అనే పదంపై తనకున్న అభ్యంతరం ఏమిటో, ఎందుకో ఆయన చెప్పలేదు. మతం, కులం వద్దనుకునేవారివల్ల దేశానికి కలుగుతున్న నష్టమేమిటో ఆయన వివరించలేదు. లౌకికవాదం విషయంలో కాంగ్రెస్‌ ఆలోచననూ, దాని ఆచరణనూ వ్యతిరేకించినవారు ఇంతక్రితమూ ఉన్నారు.

బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ ఈ పదానికి పోటీగా ‘కుహనా లౌకికవాదం’ అనే పదబంధం వాడుకలోకి తెచ్చారు. ఇలా అనడం ద్వారా లౌకికవాదాన్ని ఆచరిస్తున్నామంటున్నవారు ‘నిజమైన’ లౌకికవాదులు కాదన్నట్టు ధ్వనించారు తప్ప అసలు లౌకికవాదమే మహాపరాధమని అద్వానీ ఎన్నడూ చెప్పలేదు. ఇన్నేళ్లు గడిచాక ఆ విషయంలో పరిణతి రావడానికి బదులు మొర టుదనం పెరిగిందని అనంత్‌కుమార్‌ హెగ్డే వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతుంది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో ఏకీభవించడం లేదని కేంద్రం పార్ల మెంటులో వివరణనిచ్చింది. లౌకికవాదంపై, లౌకికవాదులపై ఆయనకున్న అభి ప్రాయాలతో ప్రజాస్వామ్యంపై విశ్వాసమున్న వారెవరూ ఏకీభవించలేరు.

మన దేశంలో అనుసరిస్తున్నామని చెప్పుకునే లౌకికవాదంపై ఎప్పటినుంచో విమర్శలున్నాయి. సమర్ధనలు ఉన్నాయి. రాజ్యం, మతం వేర్వేరుగా ఉండటమే లౌకికవాదమని ప్రపంచంలో మిగిలినచోట్ల అనుకున్నా... మన దేశంలో మాత్రం అన్ని మతాలను సమానంగా గౌరవించడమే లౌకికవాదమన్న అభిప్రాయం స్థిరపడింది. కాంగ్రెస్‌ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మైనారిటీలకు భద్రత కల్పించడమే లౌకికవాదం అనే స్థాయికి తీసుకెళ్లింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలయ్యాక అందుకు గల కారణాలను అన్వేషించే బాధ్యత తీసుకున్న ఆ పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ... పార్టీపై జనంలో లౌకికవాదం ఎలాంటి అభిప్రాయం కలగజేసిందో ఒక సందర్భంలో చెప్పారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేయాలన్నదే పార్టీ విధానమైనా... మైనారిటీలకు కాంగ్రెస్‌ సన్ని హితంగా ఉంటున్నదన్న అభిప్రాయం జనంలో ఏర్పడిందని ఆంటోనీ భావించారు.

మైనారిటీలకు తమ పాలనలోనే భద్రత ఉంటుందని చెప్పడం తప్ప వారికోసం నిజానికి  కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. ముస్లింల స్థితిగతులపై జస్టిస్‌ రాజీందర్‌ సచార్‌ నేతృత్వంలో జాతీయ కమిటీని ఏర్పాటు చేసినా ఆ కమిటీ సిఫార్సుల అమలులో అది అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందువల్లే వివాదం సృష్టించడం కోసం అనంత్‌కుమార్‌ హెగ్డే ఇలా మాట్లాడారని విపక్షాలంటున్నాయి. లౌకికవాదంపై ఆయనకు ఏ అభిప్రా యమైనా ఉండొచ్చు. కానీ దాన్ని నాగరికంగా, సవ్యమైన చర్చకు దారితీసే విధంగా వ్యక్తం చేయాలి తప్ప ఇష్టానుసారం తోచినట్టు మాట్లాడకూడదు. కేంద్రమంత్రి పదవిలో ఉన్నందువల్ల తాను అన్నిటికీ అతీతుడనని హెగ్డే భావిస్తే దాన్నెవరూ అంగీకరించరు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top