వెల్‌డన్‌ విజయ్‌..

school kid defending baby in canal - Sakshi

సాహస బాలుడిని అభినందించిన శివాజీ

కాలువలో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన బాలుడు

పి.గన్నవరం: జనవరి 25వ తేదీ సాయంత్రం.. ఓ ప్రైవేటు స్కూల్‌ పిల్లలు బడి నుంచి ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఎల్‌కేజీ విద్యార్థి ప్రమాదవశాత్తూ పంటకాలువలో పడి కొట్టుకుపోతున్నాడు. అది గమనించిన అదే స్కూల్‌కు చెందిన మూడో తరగతి విద్యార్థి వెంటనే ఆ బాలుడిని రక్షించేందుకు సిద్ధమయ్యాడు. సమయస్ఫూర్తితో అక్కడ అందుబాటులో ఉన్న ఒక తాడును తన చేతికి కట్టుకుని పంటకాలువలో పడిన విద్యార్థికి అందించాడు. అతికష్టం మీద అతడిని గట్టుకు చేర్చాడు. ఆ చిన్నారి ప్రాణం నిలిపాడు. అతడి సాహసం, ధైర్యంపై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పి.గన్నవరం మండలం బెల్లంపూడిలో జరిగింది.

మూడేళ్ల బాలుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన ఎనిమిదేళ్ల గూటం విజయ్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ బుధవారం బెల్లంపూడి గ్రామంలో అభినందించారు. బెల్లంపూడికి చెందిన గూటం శ్రీనివాసరావు కుమారుడు విజయ్‌ గ్రామంలోని సత్యజ్యోతి కాన్వెంటులో మూడో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో నూకపెయ్యి సమీర్‌ అనే బాలుడు ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఈనెల 25 వతేదీ సాయంత్రం కాన్వెంటు విడిచిపెట్టిన అనంతరం విద్యార్థులు ఇళ్లకు వెళుతుండగా సమీర్‌ ప్రమాదవశాత్తూ పంట కాలువలో పడి కొట్టుకుపోతున్నాడు. వెనుక వస్తున్న గూటం విజయ్‌ ఈ ప్రమాదాన్ని గమనించి ఎంతో చాకచక్యంగా అతడిని ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే నీళ్లు తాగేసిన సమీర్‌ను స్థానికులు స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. మండల విద్యాశాఖ అధికారిణి కోన హెలీనా, కాన్వెంటు కరస్పాండెంట్‌ విళ్ల గోపాలకృష్ణ, రాష్ట్ర మాలల జేఏసీ కో కన్వీనర్‌ కోట రామ్మోహనరావు, నాయకులు నేరేడిమిల్లి రఘు, గన్నవరపు చిన్ని తదితరులు విజయ్‌ను అభినందించారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top