నిధులున్నా పనులు సున్నా

నిధులున్నా పనులు సున్నా - Sakshi


గ్రామాల అభివృద్ధికి రవాణావ్యవస్థ ముఖ్యమని గ్రహించిన తెలంగాణ సర్కార్ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నా కాంట్రాక్లర్ల నిర్లక్షయంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. టెండర్లు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడిగా కాలయాపన చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.  

 

 మెదక్ రూరల్: 
మెదక్ (హవేళిఘనాపూర్) మండల పరిధిలోని మెదక్-భోదన్ ప్రధాన రహదారికి ఆనుకుని బూర్గుపల్లి గేటు నుంచి వాడీ, రాజ్‌పేట, కొత్తపల్లి మీదుగా పొల్కంపేట వరకు  సుమారు 12 కి.మీ. రోడ్డు వేసేందుకు రెండేళ్ల్ల క్రితం పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.1.40 కోట్లు మంజూరు చేశారు. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ కొన్ని నెలల తర్వాత ప్రారంభించారు. కేవలం రెండు కి.మీ. మేర డాంబర్ కోటింగ్ వేసి పనులు నిలిపివేశాడు.  

 

 అలాగే మండల పరిధిలోని హవేళిఘనాపూర్ వైపీఆర్ కళాశాల నుంచి లింగ్సాన్‌పల్లి, తిమ్మాయిపల్లి, బ్యాతోల్ మీదుగా మెదక్-రామాయంపేట ప్రధాన రహదారిలో గల ఔరంగాబాద్ తండా ప్రభుత్వ పాఠశాల వరకు గల 11 కి.మీ. రహదారి నిర్మించాలని ప్రభుత్వ ప్రతిపాదించింది. ఈ పనులు కూడా చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ ఉన్న రోడ్డును కాస్తా తవ్వి వదిలేశాడు. పనులు పూర్తిచేయండా వదిలేయడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర బ్బందులుపడుతున్నారు. రోడ్ల పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు ఇలా ఉదాసీనం ఉండటం ఎంతవరకు సమంజసమని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కోరుతున్నారు.

 

 రోడ్డు పనులు చేపట్టాలి

 రోడ్డు ను వేస్తున్నామంటూ ఉన్న రోడ్డును కాస్త తవ్వేసారు, ఏళ్ల గడుస్తున్నా పనులు ప్రారంభం కావడంలేదు. దీంతో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంది. ఈదారిలో వందల సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు.  ఇప్పటికైనా రోడ్డు పనులు చేపట్టాలి.

 - శ్రీనివాస్, తిమ్మాయిపల్లి కాంగ్రెస్ నాయకుడు

 

 కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే పనులు ముందుకు సాగుతలేవు

 ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష ్యంతోనే పనులు ముందుకు సాగడంలేదు. కొత్తపల్లి వద్ద రెండు కి.మీ. రోడ్డు వేసి డాంబర్ సమస్య ఉందంటూ పనులు నిలిపేశారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్ పత్తాలేడు. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.

 -  సాప రవి, గాజిరెడ్డిపల్లి

 

 రాకపోకలకు ఇబ్బందిగా ఉంది

 రోడ్డు పనులు ప్రారంభించకపోవడంతో రాకపోకలకు  ఇబ్బందులు పడుతున్నాం. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఉన్న రోడ్డును తవ్వేసి అలాగే వదిలేశాడు. దీంతో రోడ్డంతా గుంతలు. రాళ్లు  పైకితేలాయి. ఇలాంటి రోడ్డుపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.                      -నర్సింహారెడ్డి, లింగ్సాన్‌పల్లి సర్పంచ్

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top