మంచినీళ్లు ఇచ్చే మాకు కన్నీళ్లా? | Water outsourcing employees not get salaries last four months | Sakshi
Sakshi News home page

మంచినీళ్లు ఇచ్చే మాకు కన్నీళ్లా?

May 6 2017 8:25 PM | Updated on Sep 5 2017 10:34 AM

నాలుగు నెలలుగా వేతనాలు రాక పస్తులుంటున్నారు.

► వేతనాలు అందని ఫిల్టర్‌బెడ్ల కార్మికులు
► కమిషనర్‌ క్యాంప్‌ ఆఫీస్‌ ఎదుట నిరసన
 
వరంగల్‌ అర్బన్: మహా నగరవాసులకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తూ గ్రేటర్‌ ఫిల్టర్‌ బెడ్లలోని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్లో కన్నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. నాలుగు నెలలుగా వేతనాలు రాక పస్తులుంటున్నారు. అధికారులు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో వారు శుక్రవారం హన్మకొండలోని కమిషనర్‌ క్యాంపు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల్లో వేతనాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని కమిషనర్‌ శృతి ఓజా హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. 
 
వరంగల్‌ మహా నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగంలో 250 మంది ఔట్‌సోరి్సంగ్‌ కార్మికులుగా కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశాయిపేట, కేయూ, వడ్డేపల్లిలోని ఫిల్టర్‌బెడ్‌లలో, బోరింగ్‌ రిపేర్లు, తాగునీటి పైపులైన్ల లీకేజీలు అరికట్టడం, గ్యాంగ్‌ మేన్లుగా, వర్క్‌ ఇన్స్పెక్టర్లుగా పనులు చేస్తున్నారు. స్కిల్డ్‌ కార్మికులకు రూ.8,700, సెమీ స్కిల్డ్‌ కార్మికులకు రూ.6,700, అన్ స్కిల్డ్‌ కార్మికులకు రూ.5,300 నెలవారీ వేతనాలు అందజేస్తున్నారు. నెలంతా పనిచేస్తే ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, సెలవులు మినహా వచ్చే వేతన డబ్బులతో కుటుంబ పోషణ భారంగా మారినట్లు వాపోయారు.
 
నాలుగు నెలలుగా అందని జీతాలు
 
ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు జనవరి నెల నుంచి ఏప్రిల్‌ నెల వరకు వేతనాలు అందలేదు. ఇదిగో అదిగో వేతనాలు అంటూ ఇంజినీర్లు, అకౌంటింగ్‌ విభాగం అధికారులు కాలయాపన చేస్తున్నారు. జీపీఏ కార్యాలయంలో కోడ్‌ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత, అనుమతి రావాల్సి ఉందని జాప్యం చేస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగం కావడంతో, ఎక్కడ విధులు నిలిపివేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోతుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

గ్రేటర్‌ పర్మనెంట్‌ అధికారులు, ఉద్యోగులు ప్రతి నెలా పదో తేదీ దాటితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల విషయంలో ఇలా అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహా నగరపాలక సంస్థ పాలక వర్గం పెద్దలు, ఉన్నతాధికారులు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులపై కనికరం చూపి, త్వరితగతిన వేతనాలు అందచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement