రుష్యశృంగ మహర్షికి పూజలు
రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో వరుణ జపాలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుతూ శతానువాక పారాయణలు, వారుణానువాక పారాయణలు, వరుణజపాలు, రుష్యశృంగ ఆవాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
-
రత్నగిరిపై రెండో రోజూ కొనసాగిన వరుణజపాలు
-
నేడు వరుణయాగం
అన్నవరం :
రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో వరుణ జపాలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుతూ శతానువాక పారాయణలు, వారుణానువాక పారాయణలు, వరుణజపాలు, రుష్యశృంగ ఆవాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రుష్యశృంగ మహర్షి విగ్రహాన్ని పండితులు, రుత్విక్కులు శిరసున దాల్చి ఆలయ ప్రాకారం చుట్టూ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. ఆలయం నలుదిక్కులా సుబ్రహ్మణ్య ఆవాహన చేశారు. అనంతరం ఆ విగ్రహాన్ని తిరిగి స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ప్రధాన వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, చామర్తి కన్నబాబు, మరో 18 మంది రుత్విక్కులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం ఉదయం వరుణ యాగం ప్రారంభించి పది గంటలకు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. అనంతరం రుష్యశృంగుని విగ్రహాన్ని పంపా నదిలో నిమజ్జనం చేస్తారు.