విశాఖ జిల్లాలోని మైదానప్రాంతంపై వరుణుడు చిరుకన్నేశాడు. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతున్నా అవి ఇతర జిల్లాలపైనే ప్రభావం చూపుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలోని మైదానప్రాంతంపై వరుణుడు చిరుకన్నేశాడు. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతున్నా అవి ఇతర జిల్లాలపైనే ప్రభావం చూపుతున్నాయి. ఇక జిల్లాలో మన్యంలోనే వానలు ముంచెత్తుతున్నాయి తప్ప మైదానంలో మేఘాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా జిల్లా వాసులు వర్షాల ముఖం చూసి చాలా రోజులే అయింది.
సాయంత్రానికి వాతావరణం చల్లబడుతున్నా వర్షం కురవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా విశాఖలో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతోంది. నైరుతి సీజన్‌లో గతం కంటే ఈ సారి తక్కువ వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. పొరుగున ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల కంటే విశాఖ జిల్లాలో అరకొర వర్షాలే కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌లో వరి, చెరకు రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో జిల్లాలో సాగయ్యే సుమారు 2.12 లక్షల హెక్టార్లపై దీని ప్రభావం కనిపిస్తోంది. జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో కొద్దికొద్దిగా వర్షాలు పడడం ప్రారంభమయ్యాయి.
జూలై 10న కురిసిన వర్షాలకు జిల్లా చల్లబడింది. అనంతరం వాయవ్య బంగాళాఖాతంలో నాలుగు సార్లు అల్పపీడనాలేర్పడినా వాటి ప్రభావం జిల్లాలో నామమాత్రం. అల్పపీడన ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు, క్యుములోనింబస్ మేఘాలేర్పడుతున్నా తేలికపాటి జల్లులకే పరిమితమైపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతంకంటే ఐదు శాతం అధికంగా నమోదయింది. కానీ విశాఖలో ఇప్పటికీ 23 సెం.మీల వర్షం లోటుంది.
మధ్య బంగాళాఖాతంలో : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎగువ నుంచి వచ్చే వరద నీటితో లోటు భర్తీ అవుతోంది. రుతుపవనాల ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) దక్షిణ భారతం వైపు పయనించడంతో పాటు మధ్య బంగాళాఖాతంవైపు అల్పపీడనాలేర్పడితేనే విశాఖ వంటి తీరాలకు వర్షాలొస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ డెరైక్టర్ అచ్యుతరావు స్పష్టం చేశారు. పంటలకు నీరు కావాల న్నా, వాతావరణం చల్లబడాలన్నా కొద్దిరోజులు వేచి చూడాల్సిందేనన్నారు. ఐదేళ్లతో పోల్చితే ఈ సారే ఇలా జరిగిందని, జూలై చివరిలోనూ వర్షాభావానికి ప్రత్యేక కారణాలేవీ లేవని, ఇది తాత్కాలికమేనని చెప్పారు. విశాఖలో సాధారణ వర్షపాతం 49.2 సెం.మీలకు ఇప్పటికి 21.2 సెం.మీల నమోదైందన్నారు.
ఇవీ కారణాలు : వాతావరణ పరిస్థితుల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని వాతావరణ అధికారులు చెబుతుంటే పెరిగిపోతున్న కాలుష్యం, పారిశ్రామికీకరణ వ్యర్థాలు, పచ్చదనం లోపించడమేనని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు,వాల్తేరులోని వాతావరణశాఖ కార్యాలయం మధ్య వర్షపాతం, నమోదవుతున్న ఉష్ణోగ్రతల మధ్య తేడాను ఉదహరిస్తున్నారు. ఇంకుడుగుంతల ఏ ర్పాటు, నీటి వృధా, కాలుష్య నివారణల వల్ల భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని ఏయూ వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు మాజీ అధిపతి ప్రొఫెసర్ ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్ అభిప్రాయపడ్డారు.