కూలిన షాపింగ్ మాల్ స్లాబ్
గుట్టుచప్పుడు కాకుండా తొలగింపు!
కంచరపాలెం: ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన, గ్రీన్ బెల్ట్‌కు ఆనుకుని జరుగుతున్న ఓ ప్రముఖ షాపింగ్ మాల్ నిర్మాణంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవన స్లాబ్‌లో కొంత భాగం ఆదివారం వేకువజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనం నగరానికి చెందిన ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారిదని స్థానికులు చెబుతున్నారు. స్లాబ్ కూలిన వెంటనే విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు, యాజమాన్యం అటువైపు రహదారిని మూసివేసి హడావిడిగా పొక్లెయిన్లతో శిథిలాలను తొలగించడం గమనార్హం. నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే స్లాబ్ కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే స్లాబ్ కూలిన సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రమాద తీవ్రత ఎంత? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కనీసం సెట్ బ్యాక్ కూడా వదలకుండా నిర్మాణం చేపడుతున్నా.. పర్యవేక్షించాల్సిన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధికారులు, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, స్లాబ్ కూలిన మాట వాస్తవమేనని, అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని కంచరపాలెం పోలీసులు తెలిపారు.


