కొండగుడికి పండగొచ్చింది..!
డాబాగార్డెన్స్: పాత పోస్టాఫీస్ వద్ద గల కొండగుడి(రాస్‌హిల్స్)పై కొలువుదీరి కులమతాలతో సంబంధం లేకుండా భక్తులంతా కొలిచే తల్లి అమలోద్బవి (విశాఖపురి మేరిమాత). మేరీ మాత పుణ్యక్షేత్రం విశాఖపురికి ప్రత్యేక ఆభరణం. దీనినే ‘కొండగుడి’గా భక్తులు పిలుచుకుంటారు. సోమవారం జరిగే కొండగుడి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు
మేరిమాత ఉత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తులు ఆలయానికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను ఆలయ ఆవరణలో ప్రదర్శిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి సెయింట్ ఎలాసిస్ పాఠశాలలో వసతి సౌకర్యం ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. రాస్ హిల్స్ దిగువన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
పండగకు సుమారు లక్ష మందికి పైగా వచ్చే అవకాశాలు ఉన్నందున పోలీసులు భక్తులకు పలు సూచనలు చేశారు. పాత పోస్టాఫీస్‌కు ఆర్టీసీ బస్సులతో పాటు వచ్చే అన్ని వాహనాలు పూర్ణామార్కెట్, టౌన్‌కొత్తరోడ్డు, రీడింగ్‌రూమ్, కురుపాం మార్కెట్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రాణిబొమ్మ వరకు అనుమతిస్తారు. బీచ్‌రోడ్డు, కోటవీధి వైపు నుంచి వచ్చే వాహనాలను బీచ్‌రోడ్డులోని సెయింట్ అలోసిస్ స్కూల్ వరకు మాత్రమే అనుమతిస్తారు. సీహార్స్ జంక్షన్ నుంచి రాస్‌హిల్స్‌కు వచ్చే ద్విచక్ర, నాలుగు చక్ర వాహనాలకు పోర్టు ప్రధాన గేట్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ రోడ్డులో సీహార్స్ జంక్షన్, రైల్ క్రాసింగ్ జంక్షన్ నుంచి రోజ్ హిల్స్ కొండ డౌన్ వరకు ఎలాంటి వాహనాలు అనుమతించరు. పోర్టు ఏరియాలోని వేంకటేశ్వర గుడి నుంచి రాస్‌హిల్స్ వైపు కూడా వాహనాలు అనుమతించరు. ద్విచక్ర వాహన చోదకులు తమ వాహనాలను కృష్ణథియేటర్, పాత రైల్వేస్టేషన్ స్థలం వద్ద పార్కింగ్ చేసుకోవాలి. కార్లను హార్బర్, ఓల్డ్ పోలీస్‌స్టేషన్ వెనుక అదానీ రోడ్డులో, పోర్టు వేంకటేశ్వర గుడి వద్ద పార్కింగ్ చేసుకోవాలి. యాత్రికులు తీసుకు వచ్చిన బస్సులు కాన్వెంట్ జంక్షన్ సమీపంలోనే పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.


