నిరంతర శ్రామికులు పాత్రికేయులు
ఏసీపీ అప్పలరాజు
పీఎంపాలెం: నిత్యం పని ఒత్తిడిలో ఉండే పాత్రి కేయులు.. ఆటవిడుపుగా ఇలా వనసమారాధన ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని నార్త్ జోన్ ఏసీపీ జి.అప్పలరాజు అన్నారు. ఆదివారం శిల్పారామంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వనసమారాధన ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, అందరి సహకారంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు. నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటూనే పోలీసులు, పాత్రికేయులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. పాత్రికేయుల సంక్షేమమే పరమావధిగా ఫెడరేషన్ పని చేస్తోందన్నారు. ఫెడరేషన్ నగర అధ్యక్షుడు పోతిమహంతి నారాయణ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి, ఉత్సాహంగా ఒక రోజు గడపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎన్‌ఐఎఫ్‌ఎస్ సీఈవో సునీల్ మహంతి, ఆయుష్ ఆసుపత్రి డాక్టర్ ఆమన్ సాయి, ఫెడరేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జూనియర్ రాజబాబు హాస్యం, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


