మట్టిలో కలిశాక తెలిసే! | Sakshi
Sakshi News home page

మట్టిలో కలిశాక తెలిసే!

Published Thu, Aug 18 2016 7:45 PM

పద్మ మృతదేహం(ఫైల్‌) - Sakshi

  • చివరి చూపునకు నోచుకోని కుటుంబం
  • ఖననం చేశాక మృతురాలి ఆచూకీ లభ్యం
  • ముట్రాజ్‌పల్లి గ్రామస్తురాలిగా గుర్తింపు
  • మెదక్‌ రూరల్‌: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళ ఆచూకీ లభ్యమైంది. మండలంలోని శాలిపేట అటవీ ప్రాంతంలో ఈనెల 14న అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న మెదక్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

    మృతురాలికి సంబంధించిన వివరాలు మూడు రోజుల వరకు కూడా తెలియకపోవడంతో శవాన్ని పూడ్చిపెట్టారు. కాగా గురువారం కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన దోసలి పద్మ(45) కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు గ్రామ సర్పంచ్‌ సోమ్లా నాయక్‌ సహకారంతో కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు బాధితులను మెదక్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. ఇక్కడికి వచ్చిన పద్మ కుటుంబీకులు ఆమె ఫొటోలను, బట్టలను, చెప్పులను, చెవి దుద్దులను చూసి పద్మగా గుర్తించారు.

    కాగా పద్మ అడ్డామీద కూలీ పని చేసేదని, నర్సాపూర్, గుమ్మడిదల ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్లేదని కుటుంబీకులు తెలిపారు. రోజు మాదిరిగానే ఈనెల 13న కూలీ పనులకు ఇంట్లోంచి వెళ్లిన పద్మ ఆరోజు రాత్రి కూడా ఇంటికి చేరుకోలేదు. దీంతో రాత్రి 8గంటల సమయంలో ఫోన్‌ చేయగా ఏడుపాయల్లో విందులో ఉన్నట్లు చెప్పిందని, మరో 20 నిమిషాలకు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చిందని మృతురాలి కూతురు రజిత తెలిపింది.

    చివరి చూపులేకుండా చేశావమ్మా!
    మెదక్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో పద్మ దుస్తులను చూసిన ఆమె కూతుళ్లు.. పద్మను ఖననం చేసిన శ్మశాన వాటి వద్దకు చేరుఽకొని అమ్మా చివరి చూపులేకుండా చేశావా?  అమ్మా.. అంటూ గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. మాకు దిక్కెవరమ్మా! మమ్మల్ని ఒంటిరి వాళ్లను చేశావంటూ కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement