చిన్నారుల సజీవ సమాధి | two Children died in DEVARAKONDA | Sakshi
Sakshi News home page

చిన్నారుల సజీవ సమాధి

May 18 2016 12:51 AM | Updated on Apr 4 2019 4:44 PM

చిన్నారుల సజీవ సమాధి - Sakshi

చిన్నారుల సజీవ సమాధి

దేవరకొండ మండలం దుబ్బతండాకు చెందిన ఇస్లావత్ లక్ష్మణ్, ఇస్లావత్ పాపాలు అన్నదమ్ములు. వీరిద్దరూ తండాలోనే వ్యవసాయం చేస్తుండగా,

 దేవరకొండ :   దేవరకొండ మండలం దుబ్బతండాకు చెందిన ఇస్లావత్ లక్ష్మణ్, ఇస్లావత్ పాపాలు అన్నదమ్ములు. వీరిద్దరూ తండాలోనే వ్యవసాయం చేస్తుండగా, పాపా  పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మణ్, చంద్రి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్నకుమారుడు పవన్(7). లక్ష్మణ్ తమ్ముడు పాపా మృతిచెందడంతో అతడి భార్య భారతి తన ఇద్దరు చిన్నారులతో తండాలోనే ఉంటోంది. ఆమెకు అయిదేళ్ల కుమార్తె, కుమారుడు సిద్ధు (7) ఉన్నారు. ఇది ఇలా ఉండగా లక్ష్మణ్ దంపతులు  మంగళవారం ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి తండాకు సమీపంలో ఉన్న మడమడక మైనంపల్లి వాగుకు ఇసుక కోసం వెళ్లారు. అయితే వారికి  భోజనం తీసుకెళ్లడానికి వారి కుమారుడైన పవన్, సిద్ధుతో కలిసి వెళ్లాడు.  
 
 అక్కడ వారి తల్లిదండ్రులు ఇసుక తోడుతుండగా ఆ సమీపంలోనే ఉన్న ఇసుక దిబ్బ వద్ద ఆడుకుంటున్నారు. వాగులో గతంలో ఇసుక తోడేయగా సుమారు 10 ఫీట్ల గోతి ఏర్పడగా పై నుంచి మాత్రం స్లాబ్ మాదిరిగా దిబ్బ పేరుకుపోయి ఉంది. దాని కింద నీడతో పాటు చల్లగా ఉండటంతో పవన్, సిద్ధులిద్దరూ అక్కడ ఆడుకుంటున్నారు. ఆ సమయంలోనే  దిబ్బ కూలిపడటంతో వారిద్దరూ ఆ ఇసుకలో కూరుకుపోయారు. ఈ లోపు పవన్, సిద్ధులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆ సమీపంలో ఉన్న వారిని ఆరా తీశారు. అక్కడే ఉన్న తండాకు చెందిన మరో వ్యక్తి కొద్ది సేపటి క్రితం కొద్ది దూరంలోని ఇసుక దిబ్బ వద్ద ఆడుకుంటున్నట్లు తెలిపారు.
 
 అక్కడికి వచ్చి చూడటంతో ఇసుక దిబ్బ కూలిపోయి ఉండటంతో అనుమానం వచ్చిన వారు అక్కడ తవ్వే ప్రయత్నం చేసినప్పటికీ వారికి వీలు కాలేదు. దీంతో దేవరకొండ సమీపంలోని ఒక జేసీబీని తీసుకెళ్లి దిబ్బ ఉన్న ప్రాంతంలో తవ్వి చూడగా అప్పటికే వారిలో సిద్ధు మృతిచెందగా పవన్ మాత్రం కొన ఊపిరితో ఉన్నట్లు గమనించారు. వెంటనే 108కు సమాచారం అందించగా సిబ్బంది అక్కడికి వచ్చి ఆక్సీజన్ అందించి దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి  తీసుకెళ్లే లోపే పవన్ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
 
 ఆ కుటుంబంలో అంతులేని విషాదం   
  10 నెలల క్రితమే మృతుడు సిద్ధు తండ్రి పాపా అనారోగ్యంతో మృతి చెందడంతో కన్న తల్లి భారతే ఆ కుటుంబానికి పెద్ద దిక్కై సాకుతోంది. అయిదేళ్ల కుమార్తెతో పాటు కన్న కొడుకు సిద్ధే అన్నీ అనుకుని తల్లి భారతి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో 10 నెలల కాలంలోనే మళ్లీ కన్న కొడుకును కూడా పోగొట్టుకున్న  ఆ తల్లి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులను పోగొట్టుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్ని నిమిషాల కిందే తమ కళ్ల ముందే ఆడుకుంటూ కనిపించిన ఆ చిన్నారులిద్దరూ నిమిషాల వ్యవధిలోనే విగతజీవులుగా పడి ఉండటాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. ఆసుపత్రిలో ఆ ఇద్దరు చిన్నారులపై పడి లక్ష్మణ్, భారతిలు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
 
 ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటిన రోదనలు  
 ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంట తడిపెట్టించాయి. చిన్నారుల మృతదేహాలపై పడి బోరున విలపించారు. తండావాసులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.  ఆర్డీఓ గంగాధర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని సంఘటనకు సంబంధించిన వివరాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement