వామ్మో... సర్వే! | TRS Government doing the survey in all constituencies | Sakshi
Sakshi News home page

వామ్మో... సర్వే!

May 24 2017 1:31 PM | Updated on Mar 28 2019 5:27 PM

వామ్మో... సర్వే! - Sakshi

వామ్మో... సర్వే!

అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్‌ మొదలైంది.

► టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు సర్వే గుబులు
►ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన
►27న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల భేటీ
►పనితీరుపై వెల్లడికానున్న మూడో సర్వే వివరాలు



వరంగల్‌: అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్‌ మొదలైంది. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలను కూడా ఈ సమావేశంలోనే సీఎం  వెల్లడిస్తారని తెలుస్తోంది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పనితీరుపై వరుసగా నిర్వహిస్తున్న సర్వేలతో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరుగుతోంది.

గతంలోనూ ఇలాంటి సర్వేలు నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్‌... రెండు సర్వేల వివరాలను మార్చి నెలలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు స్వయంగా అందజేశారు. అందులో మెరుగ్గా ఉన్న వారు తమ స్థానం అలాగే ఉంటుందా లేదా అని దిగులుతో ఉన్నారు. గత సర్వేల్లో పనితీరులో కిందిస్థాయిలో ఉన్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు. సర్వేలో తమ పరిస్థితి మెరుగైందా లేదా అనేది తెలిసేదాకా అదే ఆలోచనలతో ఉంటున్నారు. సర్వే వివరాలతో సంబంధం లేకుండా... ప్రస్తుత ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మార్చిలో జరిగిన సమావేశంలో ప్రకటించారు.

అయితే సర్వేల నివేదికలో పనితీరు బాగా లేదని ఉంటే –రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయని ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో మార్చి 9న టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. కేసీఆర్‌ ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలపై అంతకుముందు నిర్వహించిన రెండు సర్వేల వివరాలను వెల్లడించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టే క్రమంలో మార్చి 25న టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఎంపీల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ సమావేశంలో వారికి అందజేశారు.

ఆ సర్వేల వివరాల ప్రకారం... ఎంపీలు సీతారాంనాయక్, బూర నర్సయ్యగౌడ్‌ మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరముందని సమావేశంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. వరంగల్‌ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్‌ పనితీరు పార్టీ కంటే మెరుగ్గా ఉందని సర్వే నివేదికలో పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మూడు మండలాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పనితీరు పరంగా మొదటి స్థానంలో... జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ఐదు మండలాలకు   ప్రాతినిథ్యం వహించే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ రెండో స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement