నేడే ‘ఊర’ పండుగ | Today 'ura panduga' | Sakshi
Sakshi News home page

నేడే ‘ఊర’ పండుగ

Jul 23 2016 10:32 PM | Updated on Sep 4 2017 5:54 AM

నేడే ‘ఊర’ పండుగ

నేడే ‘ఊర’ పండుగ

ఊరంతా మెచ్చే పండుగ వచ్చేసింది. అమ్మను కొలవడానికి ఇందూరు సర్వసమాజం సన్నద్ధమైంది. శనివారం రాత్రి నుంచే వేడుక ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం ఊర పండుగ జరగనుంది.

నిజామాబాద్‌కల్చరల్‌ : ఊరంతా మెచ్చే పండుగ వచ్చేసింది. అమ్మను కొలవడానికి ఇందూరు సర్వసమాజం సన్నద్ధమైంది. శనివారం రాత్రి నుంచే వేడుక ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం ఊర పండుగ జరగనుంది. వేడుకకు సంబంధించి బల్దియా అధికారులు, సర్వసమాజ్‌ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఏటా ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఊర పండుగను జరుపుకుంటున్నారు. ఊర పండుగ చరిత్ర గురించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎనిమిది దశాబ్దాల క్రితం నిజామాబాద్‌లో గత్తర, కలర, ప్లేగువంటి ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ఎడ్లు మృత్యువాతపడడంతో వ్యవసాయం దెబ్బతింది. వ్యాధుల కారణంగా ప్రజలు నగరం విడిచిపోయి శివారు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవించసాగారు. గ్రామ దేవతల ఆగ్రహం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని భావించిన గ్రామ పెద్దలు.. ప్రజలను కాపాడేందుకు అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. నిజామాబాద్‌లోని 9 మున్నూరుకాపు సంఘాలతోపాటు గోనెకాపు, పాకనాటి సంఘాలను కలుపుకుని ఆషాఢ మాసంలో ఊర పండుగ చేశారు. అమ్మ దయతో వ్యాధులు తగ్గిపోయాయి. గ్రామం విడిచి వెళ్లినవారు ఊరిలోకి తిరిగి వచ్చారు. వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు ఊరంతా బండారు చల్లి కట్టడి చేశారు. ఆ ఆనవాయితీనే ఏటా కొనసాగిస్తున్నారు. 
‘సరి’ విశిష్టత
ఊరపండుగలో వినియోగించే ‘సరి’కి ఎంతో విశిష్టత ఉంది. దీని కోసం ప్రజలు తోపులాడుకుంటారు. నవధాన్యాలు, పిండితో సరిని తయారు చేస్తారు. ఇందులో గ్రామదేవతలకు బలిచ్చే జీవాల రక్తం, పేగులను కలుపుతారు. ఈ సరిని ఇళ్లపై, ఎడ్లపై చల్లితే అనారోగ్యం దరి చేరదని నగరవాసుల అపార నమ్మకం. 
శనివారం అర్ధరాత్రినుంచే..
నగరంలోని ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించే గ్రామదేవతలను వడ్రంగులు తీర్చిదిద్దారు. నగరంలోని 12 ప్రధాన చౌరస్తాల్లో అమ్మవారిని కొలుస్తూ పసుపు, కుంకుమతో ముగ్గువేసి బండారు వేసి పూజలు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక అశోక్‌వీధిలోని వడ్లదాతి వద్ద తయారు చేసిన గ్రామదేవతలను ఖిల్లా తేలిమైసమ్మ గద్దెకు తీసుకువెళతారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడినుంచి విగ్రహాలతో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. గాజుల్‌పేట, గురుద్వార్, బడాబజార్, కస్బాగల్లి, గోల్‌హనుమాన్‌ చౌరస్తా, పూలాంగ్‌ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని మహాలక్ష్మీనగర్‌ వరకు శోభాయాత్ర సాగుతుంది. మూడు గ్రామ దేవతలను బడాబజార్‌ సమీపం నుంచి దుబ్బ వైపు తీసుకువెళ్తారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement