రా... రా... శ్రీమంతుడా | Sakshi
Sakshi News home page

రా... రా... శ్రీమంతుడా

Published Sun, May 8 2016 2:15 AM

రా... రా... శ్రీమంతుడా - Sakshi

నేడు బుర్రిపాలేనికి మహేశ్‌బాబు
ఆశగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు
ఘనస్వాగతానికి సన్నాహాలు
పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రిన్స్

 
ఆరోజు వచ్చేసింది.. ఎంతోకాలంగా ఆ గ్రామస్తులు ఆశగా  ఎదురుచూస్తున్న శుభదినం రానే వచ్చింది. తమ గ్రామాన్ని సుసంపన్నం చేసే శ్రీమంతుడు ఆదివారం వస్తున్నాడన్న వార్తతో బుర్రిపాలెం గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచని తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయన్న ఆశతో వారంతా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
 
 
తెనాలి : సూపర్‌స్టార్ కృష్ణ తన స్వగ్రామం బుర్రిపాలెం పేరును సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘బుర్రిపాలెం బుల్లోడు’తో ఈ ప్రాంతాన్ని వెండితెరపైకి కూడా తెచ్చారు. కృష్ణ తనయుడు, ‘ప్రిన్స్’ మహేశ్‌బాబు దత్తత తీసుకోవడంతో మరోసారి ఈ గ్రామం వార్తల్లోకొచ్చింది. ‘సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం’ అన్న సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ ప్రకటన చేసినప్పట్నుంచీ బుర్రిపాలేన్ని  బంగారుపాలెం చేస్తారన్న భావనతో అభిమానులు ప్రిన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మార్చిలో మహేష్ భార్య నమ్రతా, సోదరి పద్మావతి కలిసి వచ్చారు. అప్పట్లో నమ్రతా ప్రకటించినట్టే రెండు నెలల్లోపే మహేష్ ఆదివారం గ్రామానికి రానున్నారు.


 అన్నీ ఉన్నా అభివృద్ధి లేదు
 బుర్రిపాలెం జనాభా 3,306 మంది. ఓటర్లు 2,524 మంది. జనాభాలో మూడోవంతు ఎస్సీలు, బీసీలే. ఆయకట్టు 1,200 ఎకరాలు. నీటితీరువా మినహా ఇతర ఆదాయం లేదు. ప్రభుత్వ నిధులతో సహా ఏడాదికి వచ్చే రూ.10 లక్షలతో అభివృద్ధికి ఆస్కారమే లేకుండా పోయింది. శివలూరుకు వెళ్లే డొంకరోడ్డు ఒక్కటే తారురోడ్డు. గ్రామంలో రోడ్లు 3వేల మీటర్లుంటే, 2,400 మీటర్లు సిమెంటు రోడ్లు వేయగలిగారు.  మూడు ఎలిమెంటరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాల, ప్రైవేట్ బీఈడీ కళాశాల, మూడు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో రెండింటికి శాశ్వత భవనాలు నిర్మితం కాగా, మరొకటి నిర్మించాల్సి ఉంది. అక్షరాస్యత 80 శాతం. భూగర్భ జలాలు అడుగంటి, తాగునీటి సమస్య ఎదురైంది. మురుగునీటి పారుదల వ్యవస్థ దుర్భరంగా ఉంది. దళితుల కాలనీల్లో వసతులు కరువయ్యాయి.
 
 
 షెడ్యూల్ ఇదీ..
 హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయల్దేరనున్న మహేశ్‌బాబు ఉదయం 11.30 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బుర్రిపాలెం వచ్చి సొంత ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి తన నాయనమ్మ, మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ నిర్మించిన గీతామందిరంలో దైవదర్శనం చేసుకుంటారు. గ్రామం వెలుపల పంట సంజీవని కింద పంటపొలాల్లో తీసిన నీటికుంటలను పరిశీలిస్తారు. అక్కడే గ్రామస్తులు, అభిమానులతో మాట్లాడతారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేస్తారు. రెండు డ్వాక్రా గ్రూపులకు చెక్కులు పంపిణి చేస్తారని ఎంపీడీవో శ్రీనివాసరావు చెప్పారు. నాగరత్నమ్మ పేరుతో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు తరగతి గదులను ప్రారంభిస్తారు. గ్రామంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. బహిరంగ సభ రద్దయినట్టు సమాచారం.

మురుగునీటి పారుదల మెరుగుపరచాలి
 బుర్రిపాలెం గ్రామంలో మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉంది. నీరుపారుదలకు సరైన మార్గం లేదు. కల్యాణమండపం ఎదుట నాకు పూరిల్లు ఉంది. వర్షం వస్తే నీళ్లను తోడుకోవాల్సిన పరిస్థితి. డ్రెయినేజీని మెరుగుపరచాలని కోరుకుంటున్నా.- నిడమానూరి కనకదుర్గాదేవి, బుర్రిపాలెం
 

 
 సమస్యలు చెప్పుకునే వీలుంటుందా?

 గ్రామంలో డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు ఉన్నాయి. మహేష్‌బాబు దత్తత తీసుకున్నాడని తెలిసిన నాటి నుంచి పరిస్థితులు మెరుగు పడతాయని ఆశిస్తున్నాం. ఆయనను కలిసి మా సమస్యలను వివరించే అవకాశం వస్తుందో రాదో. - కంచర్ల స్వాములు, బుర్రిపాలెం
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement