వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of a married | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి The mysterious death of a married

Aug 19 2016 1:04 AM | Updated on May 25 2018 12:54 PM

జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్త వేధింపులు ఓ యువతి ప్రాణాలను బలిగొన్నాయి. వివాహమైన ఆరు నెలలకే అనుమానాస్పద స్థితిలో ఆమె మృతి చెందింది.

కడప అర్బన్‌ : జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్త వేధింపులు ఓ యువతి ప్రాణాలను బలిగొన్నాయి. వివాహమైన ఆరు నెలలకే అనుమానాస్పద స్థితిలో ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు, సుబ్బమ్మల కుమార్తె రమణమ్మ (25)కు కడప నగరం మారుతినగర్‌కు చెందిన గురు రాజాతో ఆరు నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో రూ. 4 లక్షలు కట్నంగా ఇచ్చారు. ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని మాయమాటలు చెప్పారని, తర్వాత ఎలాంటి ఉద్యోగం లేదని తెలిసిందని బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొంతకాలం నుంచి తన భార్య రమణమ్మను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తెలిపారు. ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం మృతురాలి అక్క, బావ వచ్చి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాకుండా సర్దిచెప్పి వెళ్లారు. అయితే గురువారం మధ్యాహ్నం తాము నివసిస్తున్న ఇంటి పైభాగాన ఉన్న గదిలో సిమెంటు రేకుకు ఉన్న పైపునకు చీరెతో ఉరి వేసుకుందని చెబుతున్నారు. కానీ భర్త, బంధువులే ఆమెను చీరెతో మెడచుట్టూ బిగించి హత్య చేశారని బంధువులు ఆరోపించారు. సంఘటనా స్థలాన్ని వన్‌టౌన్‌ సీఐ రమేష్‌ తమ సిబ్బందితో పరిశీలించారు.
సంఘటనపై అనుమానాలెన్నో?
 రమణమ్మకు గురురాజాతో వివాహం కాకమునుపే మరో మహిళను మొదట వివాహం చేసుకుని మనస్పర్థలు ఏర్పడడంతో ఆమెతో విడిపోయినట్లు బంధువులు తెలిపారు. తర్వాత రమణమ్మను ఆరు నెలల క్రితం వివాహం చేసుకుని వేధిస్తున్నాడని, స్నేహితులతో విందు వినోదాలు చేసుకునేందుకు డబ్బులు ఇప్పించాలని భార్యను వేధించేవాడని వారు ఆరోపించారు. కాగా,  మృతురాలి భర్త, బంధువులు మాత్రం తాము నివసిస్తున్న ఇంటి పైభాగాన సిమెంటు రేకులకు ఉన్న పైపునకు చీరెతో ఉరి వేసుకుందని, తలుపులు బద్దలు కొట్టి వైద్యుని వద్దకు తీసుకెళ్లామని చెబుతున్నారు. అయితే ఆ పైపునకు ఎలాంటి మరకలుగానీ, ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లుగానీ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భర్త, బంధువులే ఆమె మెడకు ఉరి బిగించి చంపారని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు.
పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన
 గురురాజా, బంధువులు కట్నం కోసం రమణమ్మను దారుణంగా హత్య చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గురువారం సాయంత్రం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement