
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
వడ్డెపల్లి ప్రభుత్వ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు(14) ఈ నెల 18న జరగాల్సిన బాల్య
హన్మకొండ అర్బన్ : వడ్డెపల్లి ప్రభుత్వ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు(14) ఈ నెల 18న జరగాల్సిన బాల్య వివాహాన్ని హన్మకొండ రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి బాలకను సీడబ్ల్యూసీ ముందు హాజరుపరిచి చైల్డ్‌హోంకు తరలించారు. హన్మకొండ మండలం వడ్డెపల్లిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్, లలిత కూతురును ఎల్కతుర్తి మండలం కోతులతండాకు చెందిన పల్లెపు రాజయ్య– తిరుపతమ్మల కుమారుడితో ఈ నెల 18న వావాహం చేయాలని నిశ్చయించారు. ఇరుపక్షాల వారు పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
స్థానికులు, తోటి పిల్లలు, ఉపాధ్యాయుల ద్వారా సమాచారం చైల్డ్‌లైన్‌కు చేరింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సోమవారం బాలిక స్కూల్‌లో ఉన్న సమయంలో సమాచారం తెలుసుకున్న అధికారులు ఆమె సమాచారం స్కూల్‌లో సేకరించారు. స్కూల్ రికార్డుల ప్రకారం బాలిక 12 ఆగస్టు 2005లో జన్మించినట్లు నమోదై ఉంది. దీని ఆధారంగా బాలిక మైనర్‌గా గుర్తించిన అధికారులు ఆమెను విచారించారు. అనంత రం వరంగల్ ఆటో నగర్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో చైర్‌పర్సన్ అనితారెడ్డి ఎదుట ప్రవేశపెట్టారు. బాలికను చిల్డ్రన్స్ హోంకు తరలించాలని ఆదేశిస్తూ గురువారం ఇరుపక్షాల పెద్దలు బెంచ్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బాలికకు వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో పరీక్షలు రాయించి చైల్డ్‌హోంకు తరలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌ప్రకాష్, ఆర్‌ఐ ప్రణయ్, అంగన్‌వాడీ టీచర్ సరస్వతీ, చైల్డ్‌లైన్, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
బాధ్యులందరిపై కేసులు : చైర్‌పర్సన్ అనితారెడ్డి
బాల్యవివాహాల విషయంలో బాధ్యులందరిపై కేసుల నమోదుకు అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితారెడ్డి తెలిపారు.పెళ్లి పెద్దలు, పురోహితులు, షంక్షన్‌హాల్ అద్దెకిచ్చిన వారు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరూ బాల్యవివాహాల నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. పెళ్లి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే కొత్త వ్యక్తులు ముందుగా అబ్బాయి, అమ్మాయిల వయస్సును నిర్థారించుకోవాలని సూచించారు.