నీట్‌తో తెలుగు విద్యార్థులకు నష్టమే


విజయవాడ(గాంధీనగర్): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)తో తెలుగు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ పి.గంగాధర్ అన్నారు. గవర్నర్‌పేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశమంతటా ఒకే సిలబస్‌లో విద్యాబోధన చేయకుండా ఒకే విధానంలో పరీక్ష నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. నీట్ పరీక్షలో సమాధానాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో రాయాల్సి వస్తుందని తెలిపారు.



ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్ర సిలబస్‌ను తెలుగుమీడియంలో చదివే విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఇంగ్లిషులో రాయడానికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. కనీసం రెండు, మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా ఒకే సిలబస్‌ను అమలుచేసి, ఆ తర్వాత జాతీయస్థాయిలో నీట్ అమలుచేయాలని సూచించారు. నీట్ పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు చేయాలని కోరారు. విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందన్నారు. నీట్ పరీక్షపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టులో తమ వాదనలను వినిపిస్తామన్నారు.



జన ఔషధిని స్వాగతిస్తాం..

కేంద్రప్రభుత్వం జన ఔషధి పేరుతో మందులను తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏ రకమైన చర్యనైనా ఐఎంఏ స్వాగతిస్తోందని గంగాధర్ అన్నారు. ఈ విధానాన్ని అమలు చేసే ముందుకు జెనరిక్, బ్రాండెండ్ మందులపై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వాలు చేపట్టాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన వాటిని గుర్తించి చట్టపరంగా జెనరిక్ మందులనే తయారు చేసేవిధంగా మందుల కంపెనీలను నియంత్రిస్తే కొంతమేర ఫలితాలు ఉంటాయని తెలిపారు. వైద్య విద్యనభ్యసించిన డాక్టర్లను జెనరిక్ మందులే రాయాలని ఆదేశించడం సరికాదన్నారు. ఎటువంటి విద్యార్హత లేని కొందరు ఇష్టానుసారం మందులు రాస్తున్నారన్నారు. జెనరిక్ మందులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. జెనరిక్ మందులలో కల్తీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రెహమాన్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ కరుణామూర్తి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top