అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. విజయవాడలో రవాణా శాఖ కమిషనర్‌పై దాడి ఘటన మరువక ముందే హిందూపురం మున్సిపల్ కమిషనర్‌పై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దుర్భాషలాడారు.
హిందూపురం అర్బన్ : అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. విజయవాడలో రవాణా శాఖ కమిషనర్‌పై దాడి ఘటన మరువక ముందే హిందూపురం మున్సిపల్ కమిషనర్‌పై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దుర్భాషలాడారు. ఒక దశలో వెళ్లిపో అన్నట్లుగా తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. కొంతకాలంగా కమిషనర్ విశ్వనాథ్, చైర్‌పర్సన్ లక్ష్మి, ఆమె భర్త నాగరాజు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు వార్షిక బడ్జెట్‌ను రుపొందించారు. దాన్ని చైర్‌పర్సన్ ర్యాటిఫై కోసం పంపితే ఆమె సంతకాలు చేయకుండా పక్కన పడేశారు. ఈ విషయం ఎమ్మెల్యే బాలకృష్ణ వరకు వెళ్లింది.
దీంతో బాలకృష్ణ తన రాజకీయ, అధికార పీఏలు కృష్ణమూర్తి, వీరయ్యలను సయోధ్య కుదుర్చి బడ్జెట్‌ను ఆమోదింపజేసి సమావేశం నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ఈక్రమంలో ఇద్దరు పీఏలు చైర్‌పర్సన్ చాంబర్‌లో కమిషనర్‌తో పాటు అన్నిశాఖల అధికారులు, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లు, టీడీపీ నాయకుడు నాగరాజును సమావేశపరిచారు. సమావేశంలో అందరి ముందూ కమిషనర్‌పై నాయకులు మాటల దాడి చేశారు. ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టానుసరంగా మాట్లాడారు. దీంతో కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురై సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.