స్థానిక ప్రభుత్వ బాలుర గృహం ఆవరణలోని బాలుర పరిశీలన గృహం(జువైనల్ హోం)లో బాలుడు ముస్తఫా సహచర బాలుడి చేతిలో బుధవారం రాత్రి దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ గృహంలో సిబ్బంది 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటారు. అయినా హత్య చోటు చేసుకోవడం వెనుక కారణాలను పరిశీలిస్తే.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కడప అర్బన్ : స్థానిక ప్రభుత్వ బాలుర గృహం ఆవరణలోని బాలుర పరిశీలన గృహం(జువైనల్ హోం)లో బాలుడు ముస్తఫా సహచర బాలుడి చేతిలో బుధవారం రాత్రి దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ గృహంలో సిబ్బంది 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటారు. అయినా హత్య చోటు చేసుకోవడం వెనుక కారణాలను పరిశీలిస్తే.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన షేక్ ముస్తఫా (16), మహబూబ్ బాషా, గౌతమ్ ఇటీవల చోరీలకు పాల్పడటంతో పోలీసులు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కడప ప్రభుత్వ బాలుర గృహం ఆవరణలోని బాలుర పరిశీలన గృహానికి తరలించారు. ఈ ముగ్గురితోపాటు నేరాలకు పాల్పడి పర్యవేక్షణ పరిధిలోకి వచ్చిన మరి కొందరిని అదే గృహంలో ప్రత్యేక పరిశీలనా విభాగంలో ఉంచి గృహం సిబ్బంది 24 గంటలు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే మహబూబ్ బాషా, గౌతమ్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను ముస్తఫా అడ్డుకున్నాడు. దీంతో మహబూబ్ బాషాకు, ముస్తఫాకు మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ముస్తఫా బాత్‌రూముకు వెళ్లాడు. అది గమనించిన మహబూబ్‌బాషా అక్కడికి వెళ్లి ముస్తఫాతో గొడవపడి తన దగ్గరున్న టవల్‌తో అతని గొంతు చుట్టూ బిగించి దారుణంగా హత్య చేశాడు.
సిబ్బంది నిర్లక్ష్యం:
ఈ మొత్తం సంఘటనలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిశీలన గృహంలో తప్పనిసరిగా ప్రభుత్వ బాలుర గృహం సూపర్‌వైజర్ నిరంతరం విధుల్లో ఉండాలి. కానీ సంఘటన జరిగిన సమయంలో సంబంధిత సిబ్బంది అక్కడ విధుల్లో ఉన్నారా? లేక నిర్లక్ష్యంగా నిద్రపోయారా? అనే వ్యవహారంపై విచారణ చేయాల్సి ఉంది. అలాగే సంఘటనకు ముందు రోజు అక్కడున్న ఏడుగురు బాలురుల్లో నిందితుడు మహబూబ్‌బాషా.. గౌతమ్ కోసం ముస్తఫా వాగ్వివాదానికి దిగడం లాంటి సంఘటనలపై నిరంతర పరిశీలన ఉంటే సర్దుబాటు చేసే అవకాశం ఉండేది. కానీ అలాంటిదేమి లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణ సంఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హత్య జరగక ముందు మహబూబ్‌బాషా.. ముస్తఫా మెడ చుట్టూ టవల్ వేసుకుని బాత్‌రూము వైపు లాక్కెళ్లాడా? లేదంటే మరెవరి సహాయమైనా తీసుకున్నాడా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. మృతుడు ముస్తఫా, నిందితుడు మహబూబ్‌బాషా సమాన వయస్సు, సమాన శరీర సౌష్టవం కలిగిన వారే! కానీ మహబూబ్‌బాషా చేతిలో దారుణంగా హత్యకు గురి కావడం ఎంత వరకు అవకాశం ఉంది? అలాగే మరొకరి సాయం లేకుండా ఇలాంటి సంఘటన అసాధ్యమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పోలీసులు, అధికారులు ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ ముస్తఫా బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుమార్టం పూర్తి
ముస్తఫా మృతదేహానికి కడప ఆర్డీఓ చిన్నరాముడు సమక్షంలో మెజిస్ట్రీరియల్ విచారణ అనంతరం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
జేడీ విచారణ
ముస్తఫా సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ బాలుర సంక్షేమ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌మూర్తి విచారణ చేపట్టారు. ఆయన శుక్రవారం కడపకు వచ్చి బాలుర పరిశీలన గృహంలో పని చేస్తున్న సూపర్‌వైజర్లు, సూపరింటెండెంట్, సిబ్బందిని విచారణ చేశారు. సంఘటన జరిగిన బాత్‌రూము, తదితర ప్రదేశాలను పరిశీలించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని ప్రత్యేకంగా విచారణ చేశారు. ముస్తఫా బంధువులు కలిసి తమ స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. అనంతరం జేడీ మీడియాతో మాట్లాడుతూ ముస్తఫా మరణంపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నామన్నారు. సంఘటన బాత్‌రూములో జరిగిందని తమకు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించారనే విషయాన్ని తెలుసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిబ్బంది 24 గంటల పాటు పరిశీలిస్తూనే ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. సమగ్రంగా విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తామని ఆయన వివరించారు.