డెడ్‌లైన్ నెలాఖరు! | survey, without any difficulties for farmers | Sakshi
Sakshi News home page

డెడ్‌లైన్ నెలాఖరు!

Jun 8 2016 9:44 AM | Updated on Oct 1 2018 2:00 PM

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సర్వే చేయాలని, రైతుల అనుమతిలేనిదే భూ సేకరణ చేయరాదని హైకోర్టు

విజయనగరం కంటోన్మెంట్: రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సర్వే చేయాలని, రైతుల అనుమతిలేనిదే భూ సేకరణ చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ యంత్రాంగం ఆగడం లేదు. ప్రభుత్వం లక్ష్యాలను విధించడంతో రైతుల అనుమతి లేకపోయినా... అడ్డుకుంటున్నా... ఆయా గ్రామాల్లో కలియతిరుగుతూ సర్వే చేసేస్తున్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు సహకరిస్తున్నారు. భూ సేకరణ జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా భోగాపురం మండలంలోని ప్రతిపాదిత గ్రామాల్లో అధికారులు స్వైరవిహారం చేస్తున్నారు. గ్రామాల్లో సర్వేను వేగవంతం చేశారు.
 
 రైతులు అడ్డుకుంటున్నా ఆగని సర్వే
 గ్రామాల్లోని రైతులు ఎదురు తిరుగుతున్నారు. చంపినా సరే భూములిచ్చేది లేదని వారిస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ డెడ్‌లైన్ మరో పక్క రైతుల తిరుగుబాటుతో అధికారులు ఒక విధంగా నలిగిపోతున్నారు. అయినా రైతులనే హెచ్చరిస్తున్నారు. సర్వేకు అడ్డు తగిలితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు, స్థానికులు వాపోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం భోగాపురం పరిసర గ్రామాల్లో 5311 ఎకరాల భూములను సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా... తొలుత 2,004 ఎకరాలను సేకరించేందుకు సిద్ధపడింది. ఈ మేరకు రైతుల నుంచి భూముల రికార్డులను సర్వే చేస్తామని చెప్పి తమచే సంతకాలు చేయించుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
 
 శంకుస్థాపనకు సమాయత్తం
 గతంలో 5,311 ఎకరాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వగా ఆగస్టు నాటికి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన గడువు పూర్తి కానుంది. ఇప్పటివరకూ గుర్తించిన 2004 ఎకరాలనే ముందస్తు భూ సేకరణ చేసి విమానాశ్రయానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ భూమికి మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరో పక్క ప్రభుత్వం ఈనెలాఖరుకు భూమిని సేకరించాలని డెడ్‌లైన్ ఇవ్వడంతో గ్రామాల్లో గందర గోళ పరిస్థితి నెలకొంది. భూ సేకరణ అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది ఒక్క సారిగా గ్రామాలకు రావడంతో ఆయా సన్న, చిన్నకారు రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోసారి భూ సేకరణపై ఉద్యమం తారాస్థాయికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement