కేలో..కేలో..కేలోరే...!

కేలో..కేలో..కేలోరే...!

ఉత్కంఠంగా రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

మెయిన్‌ డ్రాలో ఆడుతున్న క్రీడాకారులు

కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ): రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు గురువారం ఉత్కంఠతతో కొనసాగాయి. క్రీడాకారులు మెయిన్‌డ్రాలో తమ సత్తాను చాటుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 600 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. అండర్‌ 13, 15 విభాగాల్లో సింగిల్స్, డబుల్స్‌తో బాలురు, బాలికల జట్ల మ«ధ్య హోరాహోరీగా సాగుతోంది. నగరంలోని ఆఫీసర్స్‌ క్లబ్, కాస్మోపాలిటన్‌ క్లబ్, కేఎస్‌ఎన్‌ ఇండోర్‌ స్టేడియం, భాను ఇండోర్‌ స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్‌ జరుగుతుండగా, డబుల్స్‌ శుక్రవారం జరగనున్నాయి. వీటిలో విజేతలుగా నిలిచిన వారు త్వరలో జరగబోయే నేషనల్స్‌ టోర్నమెంటోలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. 

నేషనల్స్‌కు వెళ్లాలి

నాకు చిన్నప్పటినుంచి షటిల్‌ అంటే తెలీని ఇçష్టం, దాంతో స్కూలులో ఎక్కువగా ఆడుతుండేవాడిని. అదే నాకు మంచి తోడ్పాడునిచ్చింది. ఇప్పటివరకు అండర్‌ 13లో నాలుగు టోర్నమెంట్లు ఆడాను. నేషనల్స్‌కు వెళ్లి రాష్ట్రం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం.

- అభిరామ్, షటిల్‌ క్రీడాకారుడు. శ్రీకాకుళం.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో షటిల్‌ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నాను. వారిచ్చే ప్రోద్బలంతో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాననే నమ్మకం ఉంది. నేషనల్‌ ర్యాంకింగ్‌ కొయంబత్తూర్‌ ఆడాను. రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాను.

-కె.సాత్విక్‌ కోర్, షటిల్‌ క్రీడాకారుడు. ఒంగోలు

ఒలింపిక్‌ సాధనే లక్ష్యం..

ఒలింపిక్‌ సాధనే లక్ష్యంతో ఆడుతున్నాను. నేషనల్‌ ర్యాంకింగ్‌ సెవెన్‌తో పాటు తెనాలి స్టేట్‌ విన్నర్‌గా నిలిచాను. అండర్‌ 13లో ఆడుతున్నాను. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి. ఆసక్తికరంగా పోటీలు సాగుతున్నాయి. విజేతగా నిలిచేందుకు కృషి చేస్తున్నాను. 

- బాబారావ్, షటిల్‌ క్రీడాకారుడు. కడప.

నేషనల్స్‌కు ఆటగాళ్లను పంపుతాం

రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు 13 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు వచ్చారు. వీరందరికీ భోజన, వసతి సదుపాయలు కల్పించాం. క్రీడాకారులు పోటాపోటీగా ఆడుతున్నారు. 19న జరిగే పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారిని నేషనల్స్‌కు పంపుతాం. ఈ పోటీలు రాజమహేంద్రవరంలో జరగడం చాలా ఆనందంగా ఉంది.

- జి.సాయిబాబా, ఆర్గనైజింగ్‌ కమిటీ మెంబర్‌
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top